అదనంగా ఒక మెట్టే.. అందలం దక్కినట్టే!

వట్టి డిగ్రీతోనే కొలువు కట్టబెట్టే రోజులు పోయాయి. కేవలం పట్టాలే ఉద్యోగ పట్టాలు ఎక్కించలేకపోతున్నాయి. ఏ కంపెనీకీ  ‘డబ్బులు ఊరికే రావు’ కాబట్టి ఉద్యోగార్థుల్లో తమకు కావలసిన నైపుణ్యాలు ఉన్నాయో లేదో సంస్థలు నిశిత పరీక్షలు చేస్తున్నాయి. ఈ అగ్నిపరీక్షలను దాటాలంటే  నికార్సయిన నైపుణ్యాలు ఉండాల్సిందే.

Published : 24 Jan 2024 00:25 IST

జాబ్‌ స్కిల్స్‌ 2024

వట్టి డిగ్రీతోనే కొలువు కట్టబెట్టే రోజులు పోయాయి. కేవలం పట్టాలే ఉద్యోగ పట్టాలు ఎక్కించలేకపోతున్నాయి. ఏ కంపెనీకీ  ‘డబ్బులు ఊరికే రావు’ కాబట్టి ఉద్యోగార్థుల్లో తమకు కావలసిన నైపుణ్యాలు ఉన్నాయో లేదో సంస్థలు నిశిత పరీక్షలు చేస్తున్నాయి. ఈ అగ్నిపరీక్షలను దాటాలంటే  నికార్సయిన నైపుణ్యాలు ఉండాల్సిందే.

ద్యోగ సాధనకు కెరియర్‌ ప్ల్లానింగ్‌ ఉండాలనడంలోనే ఈ సూచన కనిపిస్తోంది. ఉద్యోగార్థులు నేటి కాలమాన పరిస్థితులు డిమాండ్‌ చేసే స్కిల్స్‌ను ఆపోశన పడితేనే కంపెనీల ప్యాకేజీలు అందుకోగలరు. ఫ్రెషర్లు ఎంట్రీ స్థాయి కొలువు సాధించాలన్నా.. మెరుగైన ఉద్యోగం ఆశిస్తున్నా.. అందుకు తగ్గ నైపుణ్యాలను ప్రదర్శించాల్సిందే.

ఉద్యోగ భవంతికి ఐదు స్తంభాలు

భవన నిర్మాణానికి ప్రణాళిక, సిమెంట్‌, ఇసుక, స్టీల్‌లతో పాటు పనితనం గలవారి అవసరం ఎంతగా ఉందో సరిగ్గా ఉద్యోగ సాధనకూ ఐదు రకాల నైపుణ్యాలు అవసరం అవుతున్నాయి. కంప్యూటర్‌ ఫండమెంట్స్‌, కోడింగ్‌ స్కిల్స్‌, ఆప్టిట్యూడ్‌ స్కిల్స్‌, లాజికల్‌ థింకింగ్‌, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ అనే నైపుణ్యాలతోనే ఉద్యోగ భవంతిని నిర్మించుకోవచ్చు. తాజా గ్రాడ్యుయేట్ల డిగ్రీని చూసి కంపెనీలు మురిసిపోవు. ఆ ఉద్యోగార్థిలో ఈ ఐదు నైపుణ్యాలున్నాయా అని చూస్తాయి. ఈ నైపుణ్యాలు అసాధ్యమైనవేమీ కాదు.

కంప్యూటర్‌ ఫండమెంట్స్‌

ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజెస్‌ ప్రాథమిక అంశాలపై పట్టు ఉండాలి. వేరియబుల్స్‌, డేటా స్ట్రక్చర్స్‌, కంట్రోల్‌ స్ట్ర్టక్చర్స్‌, సిన్‌టెక్స్‌, టూల్స్‌ వంటి మూల విషయాలపై పనిచేయగలిగి వుండాలి. ఉదాహరణకు- విస్తారమైన సమాచారం (డేటా) అందుబాటులో ఉన్నప్పుడు, అదీ ఒకే తరహా సమాచారం పుష్కలంగా లభ్యమైనప్పుడు డేటా స్ట్రక్చర్స్‌ అవసరం ఏర్చడుతుంది. అందుకే దీనిపై అవగాహన అవసరం. నెట్‌వర్కింగ్‌లో ప్రాథమిక అంశాలూ తెలిసుండాలి.

కోడింగ్‌ స్కిల్స్‌

ఇవి ప్రోగ్రామింగ్‌ నైపుణ్యాలే. ప్రస్తుతం అన్ని జీవన రంగాల పని (వర్క్‌) డిజిటల్‌గానే జరుగుతూ ఐటీ రంగానికి ప్రాణం పోసినందున కోడింగ్‌ స్కిల్స్‌ చుట్టూనే ఐటీ జాబ్స్‌ తిరుగుతున్నాయి. ఐటీ కంపెనీలకు ఆదాయాలు తెచ్చిపెడుతున్న ప్రోగ్రామింగ్‌లకు అనివార్యమైన కంప్యూటర్‌ భాషపై పట్టు ఉండాలి. వివిధ ప్రోగ్రామింగ్‌ ఫ్రేమ్‌ వర్కులను అర్థం చేసుకోవడం, ఆ ప్రోగ్రామింగ్‌ నిర్మాణాలనూ గుర్తించగలగడం అవసరం. కొత్త ప్రోగ్రామ్స్‌ను రూపొందించగల కోడింగ్‌ నైపుణ్యాల్లో ఎంత బలంగా ఉంటే అంతగా కంపెనీలు సంతృప్తి చెందుతాయి.

ఆప్టిట్యూడ్‌ స్కిల్స్‌

‘అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని’ అన్నట్టు ఎంతగా సాంకేతిక పరిజ్ఞానాన్ని తలకెక్కించుకున్నా... తీరా అభ్యర్థిని నిరాసక్తత ఆవరించి ఉంటే ఆ పరిజ్ఞానం అంతా బూడిదలో పోసిన పన్నీరే. అందుకే ఉద్యోగార్థిలో పనిచేయాలన్న తపన, నిర్దేశిత లక్ష్య దిశగా కదలగల చురుకుదనం, కొత్త విషయాలు నేర్చుకోవాలనీ, నేర్చుకున్నదాన్ని తన పనిలో ఇముడ్చుకొని ఫలవంతంగా ముందుకెళ్లాలన్న తృష్ణ ఉన్నాయా, లేదా అని సంస్థలు వేర్వేరు రకాలుగా పరీక్షిస్తున్నాయి. వీటినే ఆప్టిట్యూడ్‌ స్కిల్స్‌గా పిలుస్తున్నారు.

కమ్యూనికేషన్‌ స్కిల్స్‌

సాంకేతిక నైపుణ్యాలు ఎంతున్నా ఇంగ్లిష్‌లో రాతపూర్వక, మౌఖిక వ్యక్తీకరణలో మెరుగ్గా లేని అభ్యర్థుల పట్ల కంపెనీలు ఆసక్తి చూపలేవు. ప్రస్తుతం డిజిటల్‌ వాతావరణంలో ఉద్యోగ బాధ్యత నిర్వర్తించాల్సి ఉన్నందున ఈ-మెయిల్స్‌ ద్వారా వ్యక్తీకరణ కీలకంగా మారింది. తనకు కేటాయించిన పనిలో సందేహాలు వచ్చినా లేదా దాన్ని పూర్తిచేసి తర్వాతి స్థాయికి పంపేటప్పుడు వివరంగా ఈ-మెయిల్స్‌ ద్వారా తెలుపవలసి ఉంటుంది. అయితే ఎస్‌ఎంఎస్‌, వాట్సాప్‌ భాషకు అలవాటు పడుతున్న నేపథ్యంలో తప్పులు లేకుండా అధికారిక ఈ-మెయిల్‌ రాయడమూ సవాలుగా మారింది. అందుకే కంపెనీలు మౌఖిక, లిఖిత వ్యక్తీకరణలో మెరుగ్గా ఉన్న అభ్యర్థుల ఎంపికకు ప్రాధాన్యం ఇస్తున్నాయి.

లాజికల్‌ థింకింగ్‌

సమస్యను లోతుగా విశ్లేషించడం, భిన్నంగా ఆలోచించడం, డేటా ఆధారంగా తగిన పరిష్కార మార్గాలు సూచించగల నైపుణ్యాలున్నవారంటేనే కంపెనీలు మొగ్గుచూపుతాయి 

నేటి కంపెనీలకు కావలసింది పుస్తకాల పురుగులూ, బట్టీ రాయుళ్లూ కాదు. జీపీఏ స్కోర్లు.. ఎంపికల మొదటి దశలో వడపోతకే తప్ప తర్వాత వాటి వెలుగుల్లో ఉద్యోగులను చూడరు. కంపెనీలో ఒక ఉద్యోగి వెనుక కాంతి పుంజంలా నిలిచేది ఆలోచనా సరళే! అభ్యర్థిలో సాంకేతిక నైపుణ్యాల లోతును శోధించాక కంపెనీలు పరిశీలించేది అభ్యర్థి ఎంత బాగా ఆలోచిస్తున్నాడు? ఎంత భిన్నంగా, వైవిధ్యంగా ఆలోచిస్తున్నాడు అనేదే.

ఒకప్పుడు కొన్ని నంబర్లు ఇచ్చి వాటిల్లో ప్రైమ్‌ నంబర్‌ను గుర్తించమని అడిగేవారు. ఇప్పుడు గ్రాడ్యుయేషన్‌లో విద్యార్థి నేర్చుకున్నదాన్ని బాహ్య ప్రపంచంలో ఎంతవరకు అనువర్తింపజేస్తున్నాడన్న కోణంలో పరిశీలిస్తున్నారు.

ఆమధ్య ఫేస్‌బుక్‌.. కృత్రిమ మేథతో పనిచేసే రెండు రోబోలను తయారుచేసిన విషయం తెలిసిందే. అద్భుత ప్రజ్ఞా పాటవాలను సంతరించుకున్న ఈ రోబోలు నిపుణులు ఇచ్చిన అన్ని ఆదేశాలను పాటించి పనిచేయడంతో పాటు వాళ్లు చెప్పని పనులూ చేయడం మొదలుపెట్టాయి. అల్గారిదమ్స్‌ను అర్థం చేసుకొని ఒకదానితో మరొకటి సొంత భాషను సృష్టించుకొని సంభాషించుకోసాగాయి. అంటే సొంతంగా ఆలోచించడం మొదలుపెట్టాయని గుర్తించిన ఫేస్‌బుక్‌ అధినేత ఇది ఎటువంటి ఉపద్రవానికి దారితీస్తుందోనన్న భయంతో ఆ రోబోలను ధ్వంసం చేయించారు. ఈ ఉదంతాన్ని ఎంపికల్లో పాల్గొంటున్న ఉద్యోగాభిలాషుల ముందుంచి దీనికి కారణాలు విశ్లేషించమని కంపెనీలు అడుగుతున్నాయి. అల్గారిదమ్స్‌లో అన్వయలోపాన్ని ఏ సాధారణ అభ్యర్థి అయినా గుర్తించగలుగుతాడు. కానీ సవాలును సమగ్రంగా విశ్లేషించగలిగిన ఉద్యోగార్థి మెడలో కొలువు వరమాల పడుతుందని చెప్పనవసరం లేదు.

ఒక సమస్యను లోతుగా విశ్లేషించడం, భిన్నంగా ఆలోచించడం, అందుబాటులోని సమాచారం ఆధారంగా తగిన పరిష్కార మార్గాలు సూచించగల తార్కిక ఆలోచనా సరళి (లాజికల్‌ థింకింగ్‌) నైపుణ్యాలున్నవారికే కంపెనీలు పెద్దపీట వేస్తాయి.

ఎంత చెట్టుకి అంత గాలి

ఉద్యోగాన్ని ఇచ్చే కంపెనీ స్వరూపాన్ని బట్టి ఆశించే నైపుణ్యాలు మారుతుంటాయి. ఈ కోణంలో చూసినప్పుడు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు ఇచ్చే కంపెనీలను రెండుగా వర్గీకరించవచ్చు. సర్వీస్‌ ప్రొవైడింగ్‌ కంపెనీలు, ప్రొడక్ట్‌ డెవలప్‌మెంట్‌ కంపెనీలు. వీటిలో సాఫ్ట్‌వేర్‌ సేవలందించే కంపెనీలు కోరుకునే నైపుణ్యాలు పరిమితంగానే ఉంటాయి. కోడింగ్‌లో ఫండమెంటల్స్‌ మెరుగ్గా ఉండి తాజా సాంకేతిక పరిజ్ఞానాలైన ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, మెషిన్‌ లెర్నింగ్‌, క్లౌడ్‌ కంప్యూటింగ్‌ వంటి వాటిపై ప్రాథమిక అవగాహన ఉంటే చాలు. ఉద్యోగార్థికి ఆఫర్‌ లెటల్‌ చేతిలో పడ్డట్టే.

అదే ప్రొడక్ట్‌ డెవలప్‌మెంట్‌ కంపెనీల అవసరాలు కాస్త ఎత్తులో ఉంటున్నాయి. అపాయింట్‌ చేసే అభ్యర్థి సేవలను కంపెనీ ఆర్‌ అండ్‌ డీ విభాగాల్లో వినియోగించే అవకాశం ఉంటుంది. అందుకే కోడింగ్‌లో లోతైన నైపుణ్యంతోపాటు ఏఐ, ఎంఎల్‌, క్లౌడ్‌ కంప్యూటింగ్‌ టెక్నాలజీలో గట్టి ప్రాజెక్టులు చేసిన అభ్యర్థులకు అవకాశం కల్పిస్తున్నాయి. ఇందులో అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌, డార్విన్‌ బాక్స్‌ వంటి కంపెనీలు ఈ స్కిల్స్‌తో పాటు ఫ్రెషర్ల కంటే మూడు, నాలుగేళ్ల అనుభవం ఉన్నవారికి అవకాశం ఇస్తున్నాయి. అయితే మూస ప్రాజెక్టు వర్క్‌కు భిన్నంగా వినూత్నమైన ప్రాజెక్ట్‌ వర్క్‌ చేసిన తాజా అభ్యర్థులనూ ఆహ్వానిస్తున్నాయి.

ఆఫర్‌ చేసే శాలరీ ప్యాకేజీ విషయంలోనూ ఈ వ్యత్యాసం ఉంటుంది. ప్రొడక్ట్‌ బేస్డ్‌ కంపెనీలు కోడింగ్‌లో పటిష్ఠంగా ఉండి కొత్త టెక్నాలజీలను అందిపుచ్చుకున్న అభ్యర్థులకు సహజంగానే మంచి ప్యాకేజీలను ఆఫర్‌ చేస్తున్నాయి.

నైపుణ్యాలకు నగిషీ

నేటి తీవ్ర పోటీ ప్రపంచంలో ఉద్యోగం కావాలనుకునేవారంతా కనీస అర్హత అయిన ప్రోగ్రామింగ్‌ స్కిల్స్‌ను నేర్చుకునే ఉంటారు. మరి అలాంటప్పుడు మనకంటూ ప్రత్యేకంగా నిలిపేదేమిటి? అన్న ప్రశ్న వేసుకున్న అభ్యర్థికి తప్పక మార్గాలు కనిపిస్తాయి. ‘సమ్‌థింగ్‌ స్పెషల్‌’ ఆశించేవారికి టీసీఎస్‌ కోడ్‌ వీటా వంటి ఆన్‌లైన్‌ పోటీ వేదికలు ఆహ్వానం పలుకుతుంటాయి.

ఏడాదికి ఒకసారి టీసీఎస్‌ నిర్వహించే కోడింగ్‌ ఆన్‌లైన్‌ పోటీల్లో పాల్గొని ప్రోగ్రామింగ్‌లో తమ స్థాయి, సామర్థ్యాలను పరీక్షించుకోవచ్చు. ఈ జాతీయస్థాయి పోటీలో పాల్గొని సాధించిన స్కోరును ఉద్యోగార్థి సగర్వంగా ప్రాంగణ నియామకాల్లో కంపెనీలకు చూపించవచ్చు. ‘బంగారు పళ్లేనికైనా గోడ చేర్పు ఉండాల’న్నట్టు అభ్యర్థి సాధించిన ఈ స్కోరు అతనికి అదనపు ఆభరణమవుతుంది. ప్రోగ్రామింగ్‌పై ఉద్యోగార్థికి ఉన్న నిజమైన ఆసక్తిని ఇది చెబుతుంది. మిగతా అభ్యర్థులతో వేసే తులాభారంలో ఇటువంటి అదనపు స్కోరును తమ అర్హతలను జోడించిన అభ్యర్థులు కాస్త ఎక్కువగానే తూగుతారు. కోరుకున్న ఉద్యోగాన్ని సొంతం చేసుకోగలుగుతారు!

యస్‌.వి. సురేష్‌ సంపాదకుడు, ఉద్యోగ సోపానం


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని