అర్జెంటు కాదుగా?తర్వాత చూద్దాంలే!

చదవాల్సిన పాఠాలెన్నో ఉంటాయి. వాటిని క్రమపద్ధతిలో నేర్చుకోవాలని చక్కని ప్రణాళిక కూడా వేసుకుంటారు. కానీ దాన్ని కచ్చితంగా అమలు చేయకుండా ఎప్పటికప్పుడు వాయిదాలు వేస్తూనే ఉంటారు.

Published : 07 Feb 2024 00:09 IST

చదవాల్సిన పాఠాలెన్నో ఉంటాయి. వాటిని క్రమపద్ధతిలో నేర్చుకోవాలని చక్కని ప్రణాళిక కూడా వేసుకుంటారు. కానీ దాన్ని కచ్చితంగా అమలు చేయకుండా ఎప్పటికప్పుడు వాయిదాలు వేస్తూనే ఉంటారు. నిజానికి సక్రమంగా నేర్చుకోవడానికి ఉండే ప్రధానమైన ఆటంకం వాయిదా వేయడమేనని చెప్పొచ్చు.

చేయాల్సిన పనులను ఈరోజు, రేపూ అంటూ.. గడువు తేదీ వరకూ వాయిదా వేయడం.. ఆ తర్వాత చదవడానికి సమయం లేదని కంగారు పడటం.. మనలో చాలామంది చేసే పనే. దీనివల్ల చివరి నిమిషంలో విపరీతమైన ఒత్తిడికి గురయ్యే అవకాశమూ ఉంటుంది. ఇలా కాకుండా ఉండాలంటే.. అవరోధంగా మారుతున్న పరిస్థితులు, అందుకు కారణాలు ఏమిటో తెలుసుకోవాలి. 

అసలు కారణం

ఒక పనిని వెంటనే ప్రారంభించడానికైనా, రోజుల తరబడి వాయిదాలు వేస్తూ వెళ్లడానికైనా ఒక కారణమంటూ ఉంటుంది. కాబట్టి ముందుగా అసలైన కారణాన్ని అన్వేషించడానికి ప్రయత్నించాలి. సాధారణంగా విపరీతమైన ఒత్తిడికి గురికావడం, లేదా సరైన ప్రేరణ లేకపోవడం వల్ల చేయాల్సిన పనులను వాయిదా వేస్తుంటారు. ఒత్తిడిని ఎంత త్వరగా అధిగమిస్తే అంత త్వరగా వాయిదాల సమస్య నుంచి బయటపడొచ్చు.

దశలవారీగా...

ఒకేసారి పెద్ద లక్ష్యాన్ని పెట్టుకుంటే.. దాన్ని సాధించడం పెద్ద సమస్యలా కనిపిస్తుంది. అలాంటప్పుడు పెద్ద లక్ష్యాన్ని చిన్నగా విభజించుకుని దాన్ని దశలవారీగా పూర్తిచేయడానికి ప్రయత్నించాలి. ఒక దశను విజయవంతంగా పూర్తిచేసిన ఆనందంలో మరోదాన్ని వెంటనే మొదలుపెట్టే వీలుంటుంది. 

గడువు నిర్దేశించుకోవాలి

ఏ పనినైనా పూర్తి చేయడమనేది ప్రధానం కాదు. నిర్ణీత గడువులోగా చేశామా లేదా అనేదే ముఖ్యం. అందుకే కచ్చితమైన గడువును తప్పనిసరిగా పెట్టుకోవాలి. అలా కానప్పుడు ఈరోజు.. రేపు అంటూ వాయిదాలు వేస్తూనే ఉంటాం. అలాగే లక్ష్యాలు ఎప్పుడూ ఆలోచనలకే పరిమితం కాకూడదు. వాస్తవానికి దగ్గరగా ఉండేలా చూసుకోవాలి.

అవాంతరాలకు దూరంగా

చదవడానికి ఎవరైనా సాధారణంగా నిశ్శబ్దంగా ఉండే ప్రదేశాన్నే ఎంచుకుంటారు. అయితే ఇలాంటప్పుడు మొబైల్‌ ఫోన్‌ను స్విచ్చాఫ్‌ చేసుకుంటే మంచిది. నోటిఫికేషన్లు రావడం వల్ల దృష్టి వాటి మీదకు మళ్లే అవకాశం ఉంటుంది. అలాగే చదువుదామని కూర్చున్న సమయంలోనే.. సరదాగా బయటకు వెళదామని స్నేహితులు ఫోన్‌ చేయొచ్చు. ఫోన్‌ను సైలెంట్‌లో పెట్టుకుని మరో గదిలో ఉంచినా మంచిదే. చదవడం పూర్తయిన తర్వాత ఎవరి నుంచి ఫోన్లు, మెసేజ్‌లు వచ్చిందీ చూసుకోవచ్చు. దీంతో చేయాల్సిన పనులు వాయిదా పడే అవకాశం ఉండదు. 

సమయం వృథా కాకుండా

చదవాల్సినవి చాలానే ఉన్నా.. వాటిలో వెంటనే చదవాల్సినవి కొన్ని ఉంటాయి. మరికొన్నింటిని కొన్ని రోజుల తర్వాత చదివినా ప్రమాదం ఉండకపోవచ్చు. అలాంటప్పుడు వివరంగా జాబితాను రూపొందించుకోవాలి. అలాగే టైమర్లు, ప్రొడక్టవిటీ యాప్‌లను ఉపయోగించడం వల్లా దారి తప్పకుండా ఉంటారు. సమయం వృథా కాకుండా .. అనుకున్న సమయానికే పనులను పూర్తిచేయగలుగుతారు.

చిన్న విరామం

ఏకధాటిగా కొన్ని గంటలపాటు చదవడం వల్ల క్రమంగా ఆసక్తి సన్నగిల్లుతుంది. విసిగిపోవడం వల్ల కొన్నింటిని మర్నాటికి వాయిదా వేసే అవకాశం లేకపోలేదు. అరగంటసేపు చదివిన తర్వాత చిన్న విరామం తీసుకోవచ్చు. దీనివల్ల విసుగు, అలసట దరిచేరకుండా పునరుత్తేజంతో చదవగలుగుతారు. 

సరైన సమయం

విద్యార్థులందరికీ చదివే సమయం ఒకే విధంగా ఉండదు. కొందరు రాత్రంతా మేల్కొని చదవగలుగుతారుగానీ.. తెల్లవారు జామున లేచి చదవలేరు. మరికొందరు వేకువ జామునే లేవగలరుగానీ.. రాత్రి ఎక్కువ సేపు మెలకువగా ఉండలేరు. కాబట్టి ఎవరికి అనువైన సమయాన్ని వాళ్లు ఎంచుకుంటే ప్రయోజనం ఉంటుంది.

ఇలాంటి మెలకువలు పాటిస్తే వాయిదా అలవాటును నియంత్రించుకోవటం సులువు అవుతుంది!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని