ఒత్తిడి లేని విద్యతోనే ఉద్యోగం!

బీటెక్‌ పూర్తిచేసి చిన్నపాటి ఉద్యోగం సంపాదించడానికే అభ్యర్థులకు అంతగా కాలం కలిసిరాని ఈ రోజుల్లో.. ప్రాంగణ ఎంపికల్లోనే ఏడాదికి రూ.50 లక్షల ప్యాకేజీతో బంపర్‌ ఆఫర్‌ సాధించింది హైదరాబాద్‌ జేఎన్‌టీయూలో సీఎస్‌ఈ చదువుతున్న చల్లా సాయికృతి.

Updated : 20 Feb 2024 17:42 IST

బీటెక్‌ పూర్తిచేసి చిన్నపాటి ఉద్యోగం సంపాదించడానికే అభ్యర్థులకు అంతగా కాలం కలిసిరాని ఈ రోజుల్లో.. ప్రాంగణ ఎంపికల్లోనే ఏడాదికి రూ.50 లక్షల ప్యాకేజీతో బంపర్‌ ఆఫర్‌ సాధించింది హైదరాబాద్‌ జేఎన్‌టీయూలో సీఎస్‌ఈ చదువుతున్న చల్లా సాయికృతి. మరి ఇది తనకు ఎలా సాధ్యమైందో.. ఇందుకోసం ఎలా కష్టపడిందో తన మాటల్లోనే తెలుసుకుందామా..

‘చిన్నప్పటి నుంచి హైదరాబాద్‌లోనే చదివాను. నాన్న మహీధర్‌ ప్రాజెక్ట్‌ మేనేజర్‌గా పని చేస్తున్నారు, అమ్మ ఉషారాణి గృహిణి, అక్క సుచిత కూడా సాఫ్ట్‌వేర్‌ రంగంలోనే ఉంది. మానసికంగా నా ఎదుగుదలలో వారి ముగ్గురి పాత్ర చాలా కీలకం. ఇంట్లో ఎప్పుడూ చదువు, చదువు అని ఒత్తిడి పెట్టేవారు కాదు. మా అంతట మేమే ఇష్టంగా చదువుకునేలాంటి వాతావరణం కల్పించేవారు. మార్కుల వేట కాకుండా, ఫలితంతో సంబంధం లేకుండా మన వంతు మనం పూర్తిస్థాయిలో కృషి చేయాలి అన్నట్టుగా అమ్మానాన్నలు నేర్పించారు.  వారి వల్లనే ఎటువంటి సవాలు అయినా సులువుగా స్వీకరించడం అలవాటైంది.

  • పదో తరగతిలో 10 పాయింట్లు వచ్చాయి. ఇంటర్‌లో 985 మార్కులు తెచ్చుకున్నాను. ఎంసెట్‌లో 186 ర్యాంకు వచ్చింది.  ఐఐటీ మద్రాస్‌లో సివిల్‌ ఇంజినీరింగ్‌లో సీటు సాధించాను. కానీ సాఫ్ట్‌వేర్‌ రంగం మీద ఆసక్తితో జేఎన్‌టీయూలో సీఎస్‌ఈలో చేరాను. కోడింగ్‌ అంటే ఇష్టం, చిన్నప్పటి నుంచి ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌ నచ్చుతుంది.
  • బీటెక్‌ మొదటి ఏడాది సెమిస్టర్‌లో ఉన్న సబ్జెక్టులు మాత్రమే చదివాను. రెండో సంవత్సరం వాటితోపాటు యుడెమీలో ‘డేటా స్ట్రక్చర్స్‌’  కోర్సు చేశాను. ఇది ప్రాథమిక అంశాలు నేర్చుకునేందుకు బాగా సాయపడింది. పోర్షన్‌ ఏదీ పెండింగ్‌ ఉంచకుండా ఎప్పటికప్పుడు చదివేసుకునేదాన్ని. మూడో సంవత్సరం నుంచి ప్రాంగణ ఎంపికలు మొదలయ్యాయి. అదే సమయంలో మా కాలేజీ ద్వారానే అందుబాటులో ఉన్న మెంటర్‌షిప్‌ ప్రోగ్రామ్‌లో చేరి ప్రోగ్రామింగ్‌ అసైన్‌మెంట్లు చేస్తూ వచ్చాను. ప్రతి రెండు వారాలకు ఒక సమస్య ఇచ్చి సాల్వ్‌ చేయమనేవారు. వారు ఇచ్చేవే కాకుండా ఇతర ప్లాట్‌ఫామ్స్‌ ద్వారా కూడా సొంతంగా కొన్ని సమస్యలు పూరిస్తూ వచ్చాను.
  • ఎన్ని ప్రశ్నలు చేశాం అనేది కాకుండా ఎన్ని రకాలైన ప్రశ్నలు నేర్చుకున్నాం అనే విషయంపై ఎక్కువ ఫోకస్‌ చేశాను. స్నేహితులతో కలిసి టేక్‌యూ ఫార్వర్డ్‌ అనే యూట్యూబ్‌ చానెల్‌ ఫాలో అవుతూ కోడింగ్‌ సాధన చేశాను. వీటివల్ల దాదాపు ప్రతి టాపిక్‌ కవర్‌ అవుతుంది. సమస్య చూడగానే కొంత సమయం పెట్టుకుని ఆలోపు సాల్వ్‌ చేయడానికి ప్రయత్నించేదాన్ని. అప్పటికీ రాకపోతే అప్పుడు మాత్రమే జవాబు చూసేదాన్ని. చేసినవి మళ్లీ మర్చిపోకుండా అప్పుడప్పుడూ రివైజ్‌ చేస్తూ లాజిక్‌ను గుర్తుచేసుకుంటూ ఉండేదాన్ని. ఇవన్నీ బాగా సహాయపడ్డాయి.
  • 4వ ఏడాది మొదటి నుంచి ప్లేస్‌మెంట్‌ డ్రైవ్‌లలో పాల్గొనడం మొదలుపెట్టాను. అదే సమయంలో ఒక నెల ఐఐటీ చెన్నైలో ఇంటర్న్‌షిప్‌ చేశాను. తర్వాత మా కాలేజీకి ఒరాకిల్‌ సంస్థ వచ్చింది. ఆ ఇంటర్వ్యూలో ఏడాదికి రూ.19 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం సాధించాను. ఆ తర్వాత మళ్లీ డీఈషా కంపెనీకే ఇంటర్వ్యూకి హాజరయ్యాను. ఈ సంస్థ వచ్చే వారం ముందు మాకు చెప్పారు. మంచి అవకాశం కావడంతో అప్పటి నుంచి బాగా సన్నద్ధమయ్యాను. చేసిన ప్రాబ్లమ్స్‌ రివిజన్‌ చేయడం, కోర్‌ సబ్జెక్టులు బాగా చూసుకోవడం వంటివి చేశాను.
  • మా మావయ్య ఉదయ్‌భాస్కర్‌రెడ్డి ఫిజిక్స్‌ అధ్యాపకులుగా పనిచేస్తున్నారు, ఆయనే నా మెంటార్‌. ఏం చదవాలి, ఎలా చదవాలనేది చెబుతూ ఉండేవారు. స్కూల్లో ఉన్నప్పుడు మరీ పుస్తకాలకు అతుక్కుపోవడం అంటూ ఉండేది కాదు. వీలైనంతగా ఆటలకు సమయం ఇచ్చేదాన్ని. ఇష్టంగా బ్యాడ్మింటన్‌ ఆడేదాన్ని. నా చిన్నప్పటి నుంచి ఎప్పుడూ ట్యూషన్‌కి అంటూ వెళ్లిందే లేదు! అలా ఎప్పుడూ చదువుకే సమయం ఇవ్వడానికి అమ్మ వ్యతిరేకం. అందుకే స్కూల్‌ తర్వాత నచ్చినపని చేసేదాన్ని. దీని వల్ల ఎప్పుడూ ఒత్తిడి అనేది లేదు. కాలేజీలో చేరాక ఇవాళ తరగతులు జరగవు అని తెలిసినప్పుడు వెళ్లకుండా ఇంట్లోనే ఉండి చదువుకునేదాన్ని. దీని వల్ల చాలా సమయం మిగిలేది. ఆ టైమ్‌నంతా సన్నద్ధతకు ఉపయోగించుకునేదాన్ని.

ఇంటర్వ్యూ ఇలా..

ముఖాముఖి మొత్తం మూడు రౌండ్లు జరిగింది. మొదట ఆన్‌లైన్‌ టెస్ట్‌ కాలేజీలోనే పెట్టారు. ఆప్టిట్యూడ్‌, టెక్నికల్‌ అంశాల మీద పరీక్ష జరిగింది, ఒక కోడింగ్‌ ప్రశ్న ఇచ్చారు. దాని దగ్గర టైమ్‌ సరిగ్గా మేనేజ్‌ చేయడం వల్ల అన్నీ బాగా రాయగలిగాను. తర్వాత రౌండ్‌లో అల్గారిదమ్స్‌ నుంచి రెండు ప్రశ్నలు అడిగారు, కోర్‌ సబ్జెక్టుల మీద ఫోకస్‌ చేశారు. ఆపైన రౌండ్‌కి ఆఫీస్‌కి వెళ్లాం. అక్కడ ప్రశ్నల కఠినత్వం పెరిగింది, ఇన్‌డైరక్ట్‌గా అడిగారు. నిజానికి నేను ఒకటి రెండు ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేదు కూడా. కానీ వీలైనంత వరకూ జవాబు చెప్పడానికి ప్రయత్నించాను. మనం ఎంత సరైన ఆన్సర్‌ ఇస్తున్నాం అనేదానికంటే ఎంతగా ప్రయత్నిస్తున్నాం అనేది ముఖ్యం. అలాగే అనుకుని బాగా ప్రయత్నించాను. కానీ కొంచెం ధీమా తగ్గిందనే చెప్పాలి. నాతోపాటు ఆఖరి రౌండ్‌కు హాజరైన ఐదుగురిలో నేను మాత్రమే సెలక్ట్‌ కావడం చాలా ఆశ్చర్యంగానూ ఆనందంగానూ అనిపించింది.


ఇంకా..

  1. కాలేజీలో చేరిన మొదట్లో నేను నోట్సు రాసేదాన్ని కాదు.. కానీ తర్వాత ఫ్రెండ్స్‌ను చూసి రాయడం అలవాటు చేసుకన్నా. మన చేతితో స్వయంగా రాసిన విషయాలు ఎక్కువ కాలం గుర్తుంటాయని ఒక ప్రొఫెసర్‌ చెప్పిన మాటలతో ఆ అంశానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం మొదలుపెట్టాను.
  2. కంప్యూటర్‌ సైన్స్‌ సబ్జెక్టులు రాసేటప్పుడు మెటీరియల్‌ చాలా ఎక్కువ దొరుకుతుంది, ఏది ఎంతవరకూ చదవాలి అనేది గమనించుకోవాలి. నేనైతే ఆన్‌లైన్‌ మెటీరియల్‌ కొన్ని టాపిక్స్‌ కోసం చూసినా.. అధికశాతం టెక్ట్స్‌ బుక్‌లో చదవడానికే ప్రాధాన్యం ఇచ్చాను.
  3. స్కూల్‌లో ఉన్నప్పటి నుంచి ఇంగ్లిష్‌ పుస్తకాలు, పెద్దయ్యాక నవలలు చదవడం అలవాటయ్యింది. ఏదైనా కొత్త పదం కనిపిస్తే అర్థం తెలుసుకుని గుర్తుపెట్టుకునేదాన్ని. దానివల్ల భాషా పరిజ్ఞానం అభివృద్ధి చెందింది.
  4. ఇంటర్వ్యూ సమయంలో ఎదుటివారు ఏం అడుగుతున్నారు అనే అంశంపై పూర్తిగా ఏకాగ్రత పెట్టడానికి ప్రయత్నించాను, వీలైనంత వరకూ అక్కడ ఉండటానికే చూశాను. నిజానికి నాకు ఉన్న అనుభవం రెండు ఇంటర్వ్యూలే. కానీ ఆ రెండింటిలోనూ విజయం సాధించడం సంతోషంగా ఉంది.
  5. ప్రశ్న అర్థం కాకపోతే మొహమాట పడకుండా మళ్లీ అడిగి నిర్ధరించుకున్నాను. ముఖాముఖికి వెళ్లేముందే కోర్‌ సబ్జెక్టులు బాగా చదివాను.
  6. ఇంట్లో మంచి వాతావరణం ఉంటే విద్యార్థులు ఒత్తిడి లేకుండా చదవగలరు అనడానికి నేనే మంచి ఉదాహరణ. ఎవరికైనా సరే ఓపికతో ప్రయత్నిస్తే తప్పక విజయం లభిస్తుంది. ప్రస్తుతం నా ధ్యాస మొత్తం ఈ జాబ్‌ మీదనే ఉంది. అందులో చేరాక ఉన్నత చదువుల గురించి ఆలోచిస్తా!

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని