అవుతారా.. ఆస్ట్రోఫిజిసిస్ట్‌!

అంతరిక్ష ప్రయోగాలతో దూసుకుపోతున్న భారత్‌లో ఆస్ట్రోఫిజిక్స్‌ సబ్జెక్టును ఎంచుకున్న వారికి ఎంతో భవిష్యత్తు ఉంది. చంద్రయాన్‌-3, ఆదిత్య-ఎల్‌1 వంటి విజయవంతమైన ప్రయోగాలతో కొత్తగా మరింత మంది ఈవైపు ఆకర్షితులవుతున్నారు.

Published : 07 Mar 2024 00:20 IST

అంతరిక్ష ప్రయోగాలతో దూసుకుపోతున్న భారత్‌లో ఆస్ట్రోఫిజిక్స్‌ సబ్జెక్టును ఎంచుకున్న వారికి ఎంతో భవిష్యత్తు ఉంది. చంద్రయాన్‌-3, ఆదిత్య-ఎల్‌1 వంటి విజయవంతమైన ప్రయోగాలతో కొత్తగా మరింత మంది ఈవైపు ఆకర్షితులవుతున్నారు. త్వరలో జరగనున్న ప్రయోగాలు మరింతగా ఈ రంగంపై ఆసక్తిని పెంచనున్నాయి. విద్యాసంవత్సరం త్వరలో మొదలుకానున్న తరుణంలో దీని గురించి ఇంకా లోతుగా తెలుసుకుందామా..

స్ట్రోఫిజిక్స్‌ సాధారణ ఫిజిక్స్‌ సబ్జెక్టులో ఒక భాగం. నక్షత్రాలు, గ్యాలెక్సీలు, గ్రహాలు, ఇతర విషయాల గురించి ఇది తెలుసుకుంటుంది. విశ్వంలోని ఎన్నో అంతుచిక్కని రహస్యాలను తెలుసుకోవాలనే ఉత్సాహం కలిగిన యువతకు ఇది నప్పే కెరియర్‌ అవుతుంది. ఒక అంచనా ప్రకారం 2016 నుంచి 2026 వరకు ఈ రంగంలో అవకాశాలు 14శాతం వరకూ వేగవంతమైనట్లు తెలిసింది. అందువల్ల చక్కని ప్రణాళికతో ముందుకెళ్తే వీటిని అందుకుని రాణించవచ్చు.


ఏం చేస్తారు?

స్ట్రోఫిజిసిస్ట్‌లు ఆస్ట్రోనామికల్‌ వివరాలను విశ్లేషిస్తారు. వాటి ద్వారా కొత్త కొత్త విషయాలను తెలుసుకుంటారు. వీరు ఆస్ట్రోఫిజికల్‌ థియరీలను అభివృద్ధి చేయడంతోపాటు వాటిని పరీక్షించడానికి పరిశోధన మెలకువలను తయారుచేస్తారు. పరిశ్రమలో తాజాగా జరుగుతున్న పరిణామాలపై నిరంతరం అవగాహన పెంచుకుంటూ ఉంటారు. అవసరమైన డేటాను అందిస్తూ పరిశోధనలకు సాయం చేస్తారు. రిసెర్చ్‌ను అభివృద్ధి చేయడానికి డెవలపింగ్‌ ప్రోగ్రామ్స్‌, టూల్స్‌ను తయారుచేసుకుంటారు. అంతరిక్షం గురించి మానవాళికి నూతన విషయాలు తెలియజేయడంలో వీరి పాత్ర ఎంతో కీలకం.


కళాశాలలు

విద్యార్థులు మనదేశంలో ఐఐఎస్‌ఈఆర్‌, ఎన్‌ఐఎస్‌ఈఆర్‌, ఐఐటీ, ఐఏఎస్‌టీ, దిల్లీ యూనివర్సిటీ వంటి పలు ప్రధాన విద్యాసంస్థలతోపాటు తెలుగురాష్ట్రాల్లో ప్రధాన వర్శిటీల్లో ఈ కోర్సులు చదివే వీలుంది.
భారత్‌లో దీనికి సంబంధించి ముఖ్యమైన ఇన్‌స్టిట్యూట్లు ఏమిటో గమనిస్తే..

  • ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆస్ట్రోఫిజిక్స్‌ (ఐఐఏ), బెంగళూరు.
  • ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్పేస్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ (ఐఐఎస్‌టీ), తిరువనంతపురం.
  • టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫండటమెంటల్‌ రిసెర్చ్‌, ముంబయి.
  • ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్సెన్‌, బెంగళూరు
  • రామన్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఆర్‌ఆర్‌ఐ) బెంగళూరు.
  • ఇంటర్‌ - యూనివర్సిటీ సెంటర్‌ ఫర్‌ ఆస్ట్రానమీ అండ్‌ ఆస్ట్రో ఫిజిక్స్‌, పుణె.
  • వీటిలో..  బీఎస్సీ ఆస్ట్రానమీ, ఆస్ట్రోఫిజిక్స్‌, బీటెక్‌ - సంబంధిత ఇంజినీరింగ్‌, ఎంటెక్‌ ఇన్‌ ఆస్ట్రానమీ అండ్‌ స్పేస్‌ ఇంజినీరింగ్‌, ఎమ్మెస్సీ ఆస్ట్రానమీ, పీహెచ్‌డీ ఇన్‌ అట్మాస్ఫిరిక్‌ సైన్స్‌ అండ్‌ ఆస్ట్రోఫిజిక్స్‌, పీహెచ్‌డీ ఇన్‌ ఆస్ట్రానమీ, పీహెచ్‌డీ ఇన్‌ ఆస్ట్రోఫిజిక్స్‌, పీహెచ్‌డీ ఆస్ట్రానమీ అండ్‌ ఆస్ట్రోఫిజిక్స్‌ వంటి కోర్సులు చేసే వీలుంది.

నైపుణ్యాలిలా..

స్ట్రోఫిజిక్స్‌ విభాగంలో రాణించాలని భావించే యువత కొన్ని ప్రత్యేకమైన నైపుణ్యాలను కలిగి ఉండటం ద్వారా ఇతరుల కంటే మెరుగైన అవకాశాలు అందిపుచ్చుకోగలరు.  

1. విశ్లేషణాత్మకంగా..: ఆస్ట్రోఫిజిసిస్ట్‌గా పనిచేసేటప్పుడు లోతైన విశ్లేషణ నైపుణ్యాలు అవసరం అవుతాయి. వీరు చాలా రిసెర్చ్‌ ప్రాజెక్టులు చేస్తుంటారు. ఇటువంటి సమయంలో డేటాను సేకరించి, విశ్లేషించి, దాని ద్వారా సమాచారాన్ని తీసుకోవాలి అనేటప్పుడు దాన్ని విశ్లేషించడం ఎలాగో తెలియాలి.

2. రిపోర్టింగ్‌ : తాము తెలుసుకున్న విషయాలను పరిశ్రమలో ఇతర నిపుణులు కూడా ఉపయోగించేలా విధంగా రిపోర్ట్‌ చేయడం ఒక ముఖ్యమైన అంశం. కేవలం పరిశోధనలు చేయడమే కాకుండా కనుక్కున్న విషయాలను తీరైన రీతిలో భద్రపరచడం దీని ఉద్దేశం.  

3. గణితం : ఆస్ట్రోఫిజిసిస్ట్‌లు సాధారణంగా తమ రోజువారీ పనుల్లో భాగంగా అడ్వాన్స్‌డ్‌ మ్యాథమెటికల్‌ నైపుణ్యాలు ఉపయోగించాల్సి ఉంటుంది. ఇందుకు గణితంపై పట్టు తప్పనిసరి.

4. సమస్యా పరిష్కారం : వీరు తమ పరిశోధన ప్రక్రియల్లో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించాల్సి ఉంటుంది. సవాలు ఏమిటో గుర్తించడం, దాన్ని పరిష్కరించేందుకు ప్రయత్నించడం, నూతన పద్ధతులు కనిపెట్టడం వంటి సమస్యా పరిష్కార నైపుణ్యాలు అవసరం అవుతాయి.


విద్యార్హతలు

కెరియర్‌లో ప్రవేశించేందుకు ఫిజిక్స్‌, ఆస్ట్రానమీ, ఇతర ఏ సంబంధిత సబ్జెక్టులోనైనా పీహెచ్‌డీ ఉండాలి. పూర్తిస్థాయి రిసెర్చ్‌ సంబంధిత పోస్టులకు దరఖాస్తు చేయడానికి ఈ చదువు తప్పనిసరి. ఇలా పీహెచ్‌డీ ఉన్న చాలామంది అభ్యర్థులు సొంతంగా పరిశోధకులుగా మారేముందు కొంతకాలం ఇతరుల వద్ద పని నేర్చుకోవడానికి మొగ్గు చూపుతారు. ఈ సమయంలో వారు సీనియర్‌ శాస్త్రవేత్తలతో కలిసి పనిచేస్తూ పరిశోధన ప్రక్రియల్లోని మెలకువలు నేర్చుకుంటారు. ఈ విధమైన అనుభవం పెరిగేకొద్దీ వారు సొంతంగా సంక్లిష్టమైన పరిశోధనలు చేసేలా తయారవుతారు. అధికశాతం సంస్థలు పీహెచ్‌డీ కావాలంటున్నా ఈ రంగంలో కనీస స్థాయిలో రాణించేందుకు పీజీ ఉండాలి. ఇందుకు మొదట బ్యాచిలర్‌ డిగ్రీని ఆస్ట్రోఫిజిక్స్‌ లేదా ఇతర సంబంధిత ఫీల్డ్‌లో చదివి, తర్వాత ఆస్ట్రోఫిజిక్స్‌ లేదా ఆస్ట్రానమీలో పీజీ చేయాలి. ఉద్యోగానికి ముందు ఇంటర్న్‌షిప్స్‌ ద్వారా కూడా తగిన అనుభవం సమకూర్చుకోవచ్చు.

ఆస్ట్రోఫిజిసిస్ట్‌లు పరిశోధనను ఎంచుకోవచ్చు లేదా బోధన రంగంవైపు అడుగులు వేయవచ్చు. కొందరు పరిశోధన రంగంలో పని చేస్తూనే బోధన కొనసాగిస్తూ ఉంటారు. వీరికి ఇంకా అవసరమైన మేరకు కంప్యూటర్ల వినియోగం, అధికమొత్తంలో ఉన్న సమాచారాన్ని నిర్వహించడం, పరిశోధనకు సంబంధించి విభిన్న విభాగాల మీద అవగాహన తప్పనిసరి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని