ప్రతిభ చూపిస్తే..ఉపకార వేతనాలు

ఎందరో ప్రతిభావంతులైన విద్యార్థుల ఉన్నత విద్యకు ఆర్థిక పరిస్థితులు అవరోధమవుతున్నాయి. ఇలాంటి వారు ఎలాంటి ఆటంకం లేకుండా చదువులు కొనసాగించడానికి కేంద్రం ప్రోత్సాహం అందిస్తోంది.

Updated : 26 Oct 2022 06:51 IST

సెంట్రల్‌ సెక్టర్‌ స్కీమ్‌

ఎందరో ప్రతిభావంతులైన విద్యార్థుల ఉన్నత విద్యకు ఆర్థిక పరిస్థితులు అవరోధమవుతున్నాయి. ఇలాంటి వారు ఎలాంటి ఆటంకం లేకుండా చదువులు కొనసాగించడానికి కేంద్రం ప్రోత్సాహం అందిస్తోంది. ఇంటర్మీడియట్‌ తర్వాత ఏదైనా యూజీలో ప్రథమ సంవత్సరం కోర్సుల్లో చేరిన విద్యార్థులకు ప్రధానమంత్రి ఉచ్ఛతర్‌ శిక్షా ప్రోత్సాహన్‌ (పీఎం-యూఎస్‌పీ) సెంట్రల్‌ సెక్టర్‌ స్కీమ్‌ స్కాలర్‌షిప్‌ ఫర్‌ కాలేజ్‌ అండ్‌ యూనివర్సిటీ స్టూడెంట్స్‌ పేరుతో వీటిని అందిస్తున్నారు. సీనియర్‌ సెకెండరీ/ఇంటర్మీడియట్‌ పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా ప్రోత్సాహం అందుతుంది. ఆ వివరాలు...

ఈ ఉపకార వేతనాలకు ప్రస్తుతం ఏదైనా యూజీ లేదా ఇంటిగ్రేటెడ్‌ పీజీ ప్రథమ సంవత్సరం కోర్సుల్లో చేరినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రతిభావంతులకు రోజువారీ అవసరాలను తీర్చడానికి వీటిని ఏర్పాటుచేశారు. యూజీ నుంచి పీజీ వరకు ఐదేళ్లపాటు ఈ పురస్కారాలు అందుతాయి. బీటెక్‌ లాంటి ప్రొఫెషనల్‌ కోర్సులు చదువుతున్నవారికి నాలుగేళ్ల వరకు చెల్లిస్తారు. సాధారణ డిగ్రీలు, ఇంటిగ్రేటెడ్‌ పీజీలు చదువుతున్నవారికి ఏడాదికి రూ.12,000 చొప్పున మొదటి మూడేళ్లు వారి బ్యాంకు ఖాతాలో వేస్తారు. పీజీలో చేరినప్పుడు ఏడాదికి రూ.20,000 చొప్పున రెండేళ్లు అందిస్తారు. బీటెక్‌ విద్యార్థులైతే నాలుగో ఏడాది రూ.20,000 ఇస్తారు.

అర్హత: 2021-2022 విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్‌ /+2 కోర్సులు పూర్తిచేసుకున్నవారే అర్హులు. ఇంటర్‌ లేదా ప్లస్‌2లో 80 పర్సంటైల్‌ కంటే ఎక్కువ మార్కులు సాధించాలి. అంటే ఆ బోర్డు పరిధిలో టాప్‌ 20 పర్సంటైల్‌లో ఉండాలి. రెగ్యులర్‌ విధానంలో చదివినవాళ్లే అర్హులు. డిప్లొమా విద్యార్థులకు అవకాశం లేదు. అలాగే తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.4.5 లక్షల లోపు ఉండాలి. ఇతర ఏ స్కాలర్‌షిప్పులనూ పొందనివారే దీనికి అర్హులు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వర్తించినవాళ్లు అనర్హులు. స్కాలర్‌షిప్పులకు ఎంపికైనవాళ్లు తర్వాత ఏడాదిల్లోనూ వీటిని పొందడానికి అంతకు ముందు విద్యా సంవత్సరంలో కనీస హాజరు ఉండాలి. నిర్దేశిత మార్కుల శాతం తప్పనిసరి.

కేటాయింపు ఇలా...
ఈ స్కాలర్‌షిప్పులను రాష్ట్రాలవారీ విభజించారు. ఇందుకు ఆయా రాష్ట్రాలవారీగా 18-25 ఏళ్ల వయసు జనాభాను ప్రాతిపదికగా తీసుకున్నారు. రాష్ట్రాల వారీ సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ బోర్డుల్లో పదో తరగతిలో ఉత్తీర్ణత శాతాన్నీ పరిగణనలోకి తీసుకుంటారు. రాష్ట్రాలవారీగా కేటాయించిన స్కాలర్‌షిప్పుల్లో సైన్స్‌, కామర్స్‌, హ్యుమానిటీస్‌ విద్యార్థులను 3:2:1 విధానంలో ఎంపికచేస్తారు. మొత్తం స్కాలర్‌షిప్పుల్లో 50 శాతం అమ్మాయిలకు దక్కుతాయి.
రిజర్వేషన్‌: ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు  7.5, ఓబీసీలకు 27 శాతం, దివ్యాంగులకు 5 శాతం స్కాలర్‌షిప్పులు కేటాయించారు.
దరఖాస్తులు: విద్యార్థులు నేషనల్‌ స్కాలర్‌షిప్పు పోర్టల్‌లో వివరాలు నమోదు చేసుకోవాలి. అనంతరం సంబంధిత స్కాలర్‌షిప్పు పత్రాన్ని ఆన్‌లైన్‌లో పూరించాలి. అవసరమైన పత్రాలను జతచేయాలి.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: అక్టోబరు 31

వెబ్‌సైట్‌: https//scholarships.gov.in/


యూనివర్సిటీ టాపర్లకు..

యూజీ కోర్సుల్లో ప్రతిభావంతులను ఉన్నత చదువుల దిశగా ప్రోత్సహించడానికి విశ్వవిద్యాలయాల నిధుల సంఘం (యూజీసీ) ఏటా స్కాలర్‌షిప్పులు అందిస్తోంది. ఏదైనా డిగ్రీ కోర్సులో సంబంధిత విశ్వవిద్యాలయం స్థాయిలో మొదటి రెండు స్థానాల్లో నిలిచినవారికి వీటిని అందిస్తారు. అయితే వీరు ప్రస్తుతం పీజీలో చేరి ఉండాలి. అర్హత సాధించినవారికి ప్రతి నెలా రూ.3100 చొప్పున రెండేళ్లపాటు అందుతాయి. యూజీసీ పోస్టు గ్రాడ్యుయేట్‌ మెరిట్‌ స్కాలర్‌షిప్‌ స్కీమ్‌ పూర్తి వివరాలు...

దేశ అభివృద్ధిలో ఉన్నత విద్య పాత్ర చాలా కీలకం. ఈ విభాగాన్ని పటిష్ఠపరచినప్పుడే అన్ని రంగాల్లోనూ అభివృద్ధి సాధ్యమవుతుంది. అయితే అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతోన్న ఇతర దేశాలతో పోల్చుకుంటే మన దగ్గర ఉన్నత విద్య చదివేవాళ్ల సంఖ్య చాలా తక్కువ. ఈ లోటును కొంతైనా పూరించడానికి సమర్థులైన యువతను డిగ్రీ నుంచి పీజీ దిశగా అడుగులేయించాలి. దీనికోసం వాళ్లను ప్రోత్సహించాలి. అందులో భాగమే యూజీసీ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ మెరిట్‌ స్కాలర్‌షిప్‌ స్కీమ్‌. డిగ్రీ స్థాయిలో వివిధ కోర్సుల్లో యూనివర్సిటీ టాపర్స్‌ (మొదటి రెండు స్థానాలు పొందినవారు)కు ఈ స్కాలర్‌షిప్‌ వర్తిస్తుంది. దీని వ్యవధి రెండేళ్లు. యూనివర్సిటీల వారీ టాపర్స్‌గా నిలిచి, పీజీ కోర్సుల్లో చేరితేనే ఈ స్కాలర్‌షిప్‌ అందుతుంది. విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహించి, వాళ్లు పీజీలో చేరేలా చూడడమే స్కాలర్‌షిప్‌ ముఖ్య ఉద్దేశ్యం.
అర్హతలివీ...
విద్యార్థులు చదివిన యూనివర్సిటీ స్థాయిలో ఏదైనా బేసిక్‌ కోర్సులో ప్రథమ, ద్వితీయ స్థానాలు పొంది ఉండాలి. డీమ్డ్‌ సంస్థలు, ప్రైవేటు విశ్వవిద్యాలయాలు, అటానమస్‌ సంస్థల్లో చదివి ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచినా అర్హులే. అలాగే విద్యార్థులు ఏదైనా యూనివర్సిటీ లేదా పీజీ కాలేజీలో ప్రథమ సంవత్సరం కోర్సులో చేరి ఉండాలి. దూరవిద్యలో చదివినవాళ్లు ఈ స్కాలర్‌షిప్పులకు అనర్హులు. వయసు 30 ఏళ్లకు మించరాదు. లైఫ్‌ సైన్సెస్‌, ఫిజికల్‌ సైన్సెస్‌, కెమికల్‌ సైన్సెస్‌, ఎర్త్‌ సైన్సెస్‌, మ్యాథమెటికల్‌ సైన్సెస్‌, సోషల్‌ సైన్సెస్‌, కామర్స్‌, లాంగ్వేజెస్‌ వీటిలో ఏ కోర్సైనా యూజీలో చదివి మెరిట్‌ పొందినవారు నేషనల్‌ స్కాలర్‌షిప్‌ పోర్టల్‌లో తమ వివరాలు నమోదు చేసుకోవచ్చు.

ఎన్నేసి.. ఎన్నేళ్లు?
మొత్తం 3000 స్కాలర్‌షిప్పులు ఉన్నాయి. వీటి వ్యవధి రెండేళ్లు. నెలకు రూ.3100 చొప్పున చెల్లిస్తారు. ప్రథమ సంవత్సరంలో ప్రతిభ కనబరచిన విద్యార్థులకు మాత్రమే రెండో సంవత్సరం స్కాలర్‌షిప్‌ వర్తిస్తుంది.
నియమాలు...
పీజీ ప్రథమ సంవత్సరంలో కనీసం 60 శాతం మార్కులు సాధిస్తేనే ద్వితీయ సంవత్సరం స్కాలర్‌షిప్‌ వర్తిస్తుంది.
లైఫ్‌, ఫిజికల్‌, కెమికల్‌, ఎర్త్‌, మ్యాథమెటికల్‌, సోషల్‌ సైన్సులు, కామర్స్‌, లాంగ్వేజ్‌ కోర్సుల్లో వేటిలోనైనా పీజీలో చేరి ఉండాలి. ఎంబీఏ, ఎంసీఏ లాంటి ప్రొఫెషనల్‌ కోర్సులు చదువుతోన్నవారికి ఈ స్కాలర్‌షిప్‌ వర్తించదు.

జత చేయాల్సినవి...
యూజీ సర్టిఫికెట్‌, పీజీలో చేరినట్టు ధ్రువీకరణ సర్టిఫికెట్‌, యూనివర్సిటీ ప్రొవిజనల్‌ సర్టిఫికెట్‌. సంబంధిత యూనివర్సిటీలు కూడా సబ్జెక్టుల వారీ యూజీ టాపర్స్‌ వివరాలు, పీజీ ప్రథమ సంవత్సరం ప్రోగ్రెస్‌ రిపోర్ట్‌, స్కాలర్‌ యుటిలైజేషన్‌ సర్టిఫికెట్‌ అందించాలి.
దరఖాస్తులకు చివరి తేదీ: అక్టోబరు 31.

వెబ్‌సైట్‌: https//scholarships.gov.in/


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని