యూజీ, పీజీ విద్యార్థులకు రిలయన్స్‌ స్కాలర్‌షిప్పులు

ప్రతిభావంతులను ప్రోత్సహించడానికి రిలయన్స్‌ ఫౌండేషన్‌ ముందుకొచ్చింది. తెలివైన విద్యార్థులను ఉన్నత విద్యావంతులను చేసి, దేశ అభివృద్ధిలో భాగమయ్యేలా తన వంతు సహాయంగా 5100 స్కాలర్‌షిప్పులను ప్రకటించింది.

Updated : 05 Jan 2023 00:26 IST

ప్రతిభావంతులను ప్రోత్సహించడానికి రిలయన్స్‌ ఫౌండేషన్‌ ముందుకొచ్చింది. తెలివైన విద్యార్థులను ఉన్నత విద్యావంతులను చేసి, దేశ అభివృద్ధిలో భాగమయ్యేలా తన వంతు సహాయంగా 5100 స్కాలర్‌షిప్పులను ప్రకటించింది. యూజీ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు 5000, పీజీ వాళ్లకు 100 ఉపకార వేతనాలను అందిస్తారు. పరీక్షలో చూపిన ప్రతిభ, అకడమిక్‌ నేపథ్యం, ఇంటర్వ్యూలతో ఎంపిక చేస్తారు. దరఖాస్తులు ఆహ్వానిస్తున్న నేపథ్యంలో స్కాలర్‌షిప్పుల పూర్తి వివరాలు...

వచ్చే పదేళ్లలో 50,000 మంది విద్యార్థులకు స్కాలర్‌షిప్పులను అందించాలని రిలయన్స్‌ ఫౌండేషన్‌ 2022లో లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఇందులో భాగంగా 2022-2023 విద్యా సంవత్సరంలో అండర్‌ గ్రాడ్యుయేట్‌, పోస్టు గ్రాడ్యుయేట్‌ కోర్సులు చదువుతున్న విద్యార్థులకు వీటిని అందించబోతున్నారు. ఎంపికైనవారికి కోర్సు వ్యవధి అంతా ఆర్థిక ప్రోత్సాహం కొనసాగుతుంది.  

యూజీ స్థాయిలో..

మెరిట్‌ కం మీన్స్‌ ప్రాతిపదికన అందిస్తున్నారు. మొదటి సంవత్సరం ఏదైనా యూజీ కోర్సులు చదువుతున్నవారు వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు. తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.15 లక్షల లోపు ఉన్నవారు అర్హులు. విద్యార్థినులు, దివ్యాంగులకు ప్రాధాన్యం. ఎంపికైనవారు తమ డిగ్రీ వ్యవధిలో సుమారు రూ.2 లక్షల వరకు ప్రోత్సాహం పొందవచ్చు. వీరికి రిలయన్స్‌ ఫౌండేషన్‌ నుంచి కెరియర్‌ పరమైన సహకారమూ లభిస్తుంది.

ఎంపిక

విద్యార్థులు పూర్తి వివరాలతో దరఖాస్తు చేసుకోవాలి. అర్హులకు ఆన్‌లైన్‌ ఆప్టిట్యూడ్‌ టెస్టు నిర్వహిస్తారు. ఇందుకోసం ఫీజు చెల్లించనవసరం లేదు. పరీక్ష వ్యవధి ఒక గంట. 60 మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలు వస్తాయి. వెర్బల్‌, ఎనలిటికల్‌ అండ్‌ లాజికల్‌, న్యూమరికల్‌ ఎబిలిటీ ప్రశ్నలు ఒక్కో విభాగం నుంచీ 20 ఉంటాయి. ప్రతి సెక్షన్‌నూ 20 నిమిషాల్లో పూర్తిచేయాలి. వెర్బల్‌ ఎబిలిటీలో.. స్పాటింగ్‌ ఎర్రర్‌, సెంటెన్స్‌ కంప్లీషన్‌, గ్రామర్‌, రీడింగ్‌ కాంప్రహెన్షన్‌ ప్రశ్నలు వస్తాయి. ఎనలిటిక్‌ అండ్‌ లాజికల్‌ ఎబిలిటీలో.. సమస్యను విశ్లేషించడం, కారణాలు కనుక్కోవడం, పరిష్కారాన్ని గుర్తించడంపై ప్రశ్నలుంటాయి. న్యూమరికల్‌ ఎబిలిటీలో.. రేషియో, పర్సంటేజీ, నంబర్‌ సీక్వెన్స్‌, డేటా ఇంటర్‌ప్రిటేషన్‌ నుంచి ప్రశ్నలు అడుగుతారు. పరీక్షకు వారం ముందు ప్రాక్టీస్‌ టెస్టు రాసే అవకాశం కల్పిస్తారు. ఆప్టిట్యూడ్‌ టెస్టు స్కోరు, అకడమిక్‌, పర్సనల్‌ సమాచారం ఆధారంగా అర్హులను ఎంపికచేస్తారు. ఆ వివరాలు మార్చిలో ప్రకటిస్తారు. నగదు ప్రోత్సాహంతోపాటు సాఫ్ట్‌ స్కిల్స్‌ ట్రైనింగ్‌, వర్క్‌షాపులు, పూర్వ విద్యార్థుల నెట్‌వర్క్‌తో అనుసంధానం మొదలైనవి ఉంటాయి.

అర్హత

ఇంటర్‌/ప్లస్‌ 2లో 60 శాతం మార్కులు ఉండాలి. ప్రస్తుతం ఏదైనా యూజీ రెగ్యులర్‌ కోర్సు ప్రథమ సంవత్సరం చదువుతుండాలి. తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.15 లక్షలకు మించరాదు. రూ.2.5 లక్షల లోపు ఉన్నవారికి ప్రాధాన్యం.

పీజీ స్థాయిలో..

దేశంలో ఏదైనా సంస్థలో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌, మ్యాథమెటిక్స్‌ అండ్‌ కంప్యూటింగ్‌, ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌, మెకానికల్‌, కెమికల్‌, రెన్యూవబుల్‌ అండ్‌ న్యూ ఎనర్జీ, మెటీరియల్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌, లైఫ్‌ సైన్సెస్‌ కోర్సులు చదువుతున్నవారు వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు. కోర్సు వ్యవధికి మొత్తం రూ.6 లక్షల వరకు అందిస్తారు. ఇందులో 80 శాతం విద్యా సంవత్సరం ప్రారంభంలో, మిగతా 20 శాతం ప్రొఫెషనల్‌ డెవలప్‌మెంట్‌, కాన్ఫరెన్సులు, పర్సనల్‌ డెవలప్‌మెంట్‌... తదితర ఖర్చుల కోసం చెల్లిస్తారు. నిపుణులతో సమావేశం, సంబంధిత రంగంపై అవగాహన పెంచడం ఈ స్కాలర్‌షిప్పులో భాగం.

ఎంపిక

రిలయన్స్‌ ఫౌండేషన్‌ వెబ్‌సైట్‌లో ఎలిజిబిలిటీ క్వశ్చనీర్‌ను పూర్తిచేయాలి. పర్సనల్‌, అకడమిక్‌, ఎక్స్‌ట్రా కరిక్యులర్‌ యాక్టివిటీస్‌ వివరాలు నమోదు చేసుకోవాలి. రెండు రిఫరెన్స్‌ లెటర్లు జతచేయాలి. వీటిలో ఒకటి అకడమిక్‌ నైపుణ్యాలు, రెండోది వ్యక్తిత్వం, నాయకత్వ లక్షణాలు తెలిపేది కావాలి. రెండు ఎస్సేలు ఒకటి పర్సనల్‌ స్టేట్‌మెంట్‌, రెండోది స్టేట్‌మెంట్‌ ఆఫ్‌ పర్పస్‌ రాసివ్వాలి. ఇండస్ట్రీ నిపుణులు, అకడమిషియన్లు, సంబంధిత విభాగంలో నాయకత్వ స్థాయిలో ఉన్నవారు బృందంగా ఏర్పడి దరఖాస్తులు పరిశీలిస్తారు. ఇలా పరిశీలనలో నిలిచినవారికి ఇంటర్వ్యూ ప్రిపరేషన్‌, వెబినార్లు ఉంటాయి. నిపుణుల బృందం వర్చువల్‌ విధానంలో ఇంటర్వ్యూ నిర్వహిస్తుంది. ఇందులో మేటి వంద మందికి స్కాలర్‌షిప్పులు మంజూరు చేస్తారు.

అర్హత

పీజీ తొలి సంవత్సరం కోర్సు చదువుతుండాలి. గేట్‌లో 550-1000 మధ్య స్కోర్‌, లేదా యూజీలో 7.5 సీజీపీఏ అవసరం.
దరఖాస్తులకు చివరి తేదీ: ఫిబ్రవరి 14
వెబ్‌సైట్‌: www. scholarships.reliancefoundation.org/


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు