అమ్మాయిలకు ఆసరా

తపన ఉన్నప్పటికీ.. ఎందరో ప్రతిభావంతులు పేదరికం కారణంగా నిరాటంకంగా చదువులు కొనసాగించలేకపోతున్నారు. అందులోనూ ఆడపిల్లల విషయంలో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంది.

Published : 21 Sep 2023 00:15 IST

సంతూర్‌ స్కాలర్‌షిప్పులు

తపన ఉన్నప్పటికీ.. ఎందరో ప్రతిభావంతులు పేదరికం కారణంగా నిరాటంకంగా చదువులు కొనసాగించలేకపోతున్నారు. అందులోనూ ఆడపిల్లల విషయంలో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల విద్యార్థినులు ఆసక్తి ఉన్నప్పటికీ ఆర్థిక వనరులు లేక ఉన్నతవిద్యలో చేరలేకపోతున్నారు. ఇలాంటి వారిని ఆర్థికంగా ఆదుకొని, చదువులో రాణించేలా ప్రోత్సహించడానికి విప్రో సంస్థ సంతూర్‌ ఉపకారవేతనాలను అందిస్తోంది. వీటికి ఇంటర్మీడియట్‌ పూర్తిచేసి, యూజీ కోర్సుల్లో చేరిన బాలికలు దరఖాస్తు చేసుకోవచ్చు.

నేటి మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారు. ప్రతిభ ఉన్నప్పటికీ ఆర్థిక నేపథ్యం కారణంగా గ్రామీణ, వెనుకబడిన ప్రాంతాల్లో చాలామంది బాలికలు బాల్యంలోనే చదువులకు దూరమవుతున్నారు. ఇలాంటి వారిని ఆర్థికంగా ప్రోత్సహించి, చదువుల్లో రాణించేలా సహాయపడేందుకు సంతూర్‌ స్కాలర్‌షిప్పులు ఎంతగానో ఉపయోగపడతాయి. వీటిని విప్రో కేర్స్‌, విప్రో కన్సూమర్‌ కేర్‌ అండ్‌ లైటెనింగ్‌ గ్రూప్‌ కలిసి అందిస్తున్నాయి. ఇవి 2016-2017 విద్యా సంవత్సరం నుంచి మొదలయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటక, ఛత్తీస్‌ఘడ్‌ ఈ నాలుగు రాష్ట్రాల నుంచి ఈ ఏడాదికి 1900 మందికి ఈ ప్రోత్సాహకాలు అందిస్తారు. గత ఏడేళ్లలో 6000 మంది విద్యార్థినులు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులూ లేకుండా ఈ తోడ్పాటుతో ఉన్నత విద్యలో రాణిస్తున్నారు. హ్యుమానిటీస్‌, లిబరల్‌ ఆర్ట్స్‌, సైన్స్‌ కోర్సుల్లో చేరినవారికీ, వెనుకబడిన జిల్లాలకు చెందినవారికీ ఎంపికలో కొంత ప్రాధాన్యం దక్కుతుంది. అకడమిక్‌ మెరిట్‌ ప్రాతిపదికన అర్హులను ఎంపిక చేస్తారు.

ఏ అర్హతలుండాలి?

పదో తరగతి, ఇంటర్మీడియట్‌లను ప్రభుత్వ పాఠశాల, కళాశాలల్లోనే చదివుండాలి. పేద బాలికలే ఈ స్కాలర్‌షిప్పులకు అర్హులు. 2022-23 విద్యాసంవత్సరంలో ఇంటర్‌ లేదా సమాన స్థాయి కోర్సులు పూర్తిచేసినవారై ఉండాలి. అలాగే 2023-24లో ఏదైనా బ్యాచిలర్‌ డిగ్రీ మొదటి సంవత్సరం కోర్సుల్లో చేరి ఉండాలి. కనీసం మూడేళ్లు, ఆపై వ్యవధితో ఉన్న డిగ్రీ కోర్సుల్లో చేరినవారే ఈ స్కాలర్‌షిప్పు పొందడానికి అర్హులు.

స్కాలర్‌షిప్‌

ఎంపికైన విద్యార్థినులకు మూడేళ్లు లేదా కోర్సు పూర్తయినంత వరకు ప్రతినెలా రూ.రెండు వేల చొప్పున ప్రోత్సాహం అందిస్తారు. డబ్బు నేరుగా వారి బ్యాంకు ఖాతాలో జమవుతుంది. ట్యూషన్‌ ఫీజు, పుస్తకాలు, ఇతర సదుపాయాల కోసం దీన్ని ఉపయోగించుకోవచ్చు.


దరఖాస్తు

రఖాస్తు ఫారాన్ని సంస్థ వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకుని, ప్రింటవుట్‌ తీసుకోవాలి. అందులో పూర్తి వివరాలను నింపి పోస్టు ద్వారా పంపాలి. దరఖాస్తు ఫీజు లేదు.

దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: సెప్టెంబరు 30

చిరునామా: విప్రో కేర్స్‌- సంతూర్‌ స్కాలర్‌షిప్‌, దొడ్డకన్నెల్లి, సర్జాపూర్‌ రోడ్డు, బెంగళూరు - 560035, కర్ణాటక

వెబ్‌సైట్‌: https://www.santoorscholarships.com/


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని