Updated : 12 Jul 2022 15:16 IST

నిలబడి నవ్వించేయండి!

హాస్యం పరమౌషధం. చక్కగా నవ్వితే జీవితం బావుంటుంది. అయితే అలా చక్కగా నవ్వించేవారికి జీతం కూడా బావుంటుందని నిరూపిస్తున్నారు నేటి స్టాండప్‌ కమెడియన్లు. సున్నితమైన హాస్యాన్ని పండించగల చతురత, గలగలా మాట్లాడే నైపుణ్యం, వేదికలెక్కి ధైర్యంగా ప్రసంగించగల సత్తా ఉన్నవారికి ఇప్పుడు కార్పొరేట్‌ ప్రపంచం ఆహ్వానం పలుకుతోంది.

పది పదిహేనేళ్ల క్రితం స్టాండప్‌ కామెడీని అంత సీరియస్‌గా తీసుకున్నవారు తక్కువ. మిమిక్రీ వంటి వాటిని ముఖ్యమైన కార్యక్రమాల్లో ఫిల్లర్స్‌గా మాత్రమే వినియోగించేవారు. సినిమాల్లో కామెడీకి ఉండాల్సిన ప్రాముఖ్యం ఉన్నా... బయట నిర్వహించే కార్యక్రమాల్లో మాత్రం అంతగా ఉండేది కాదు. అయితే గత పదేళ్లుగా పాశ్చాత్య దేశాల ప్రభావంతో మన దేశంలో స్టాండప్‌ కామెడీ సంస్కృతి పెరిగింది. కార్పొరేట్‌ కంపెనీలు తమ ఉద్యోగుల కోసం, క్లబ్‌లు- ఇతర సొసైటీలు తమ సభ్యుల కోసం ఈ ప్రదర్శనలు ఏర్పాటుచేస్తున్నాయి. 

* కరోనా విజృంభణ తర్వాత ఈ షోలను వీక్షించే వారి సంఖ్య మరింత పెరిగింది. తక్కువ ధరకే డేటా ప్యాకేజీలు అందుబాటులోకి రావడం, ఓటీటీ వీక్షకుల సంఖ్య పెరగడం కూడా ఈ మార్కెట్‌కు కలిసొచ్చింది. అందువల్ల గట్టిగా ప్రయత్నిస్తే ఇందులో మంచి పేరుప్రఖ్యాతులు సంపాదించే అవకాశం ఉంది. ప్రస్తుతం భారత్‌లో ఉన్న స్టాండప్‌ కమెడియన్లు టికెట్‌ సేల్స్‌ ద్వారా ఒక ప్రదర్శనకు లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. సోషల్‌ మీడియా ద్వారా చేసే బ్రాండింగ్, రీల్స్‌కు వచ్చే సొమ్ము దీనికి అదనం. మెట్రోనగరాల్లో, ఉన్నతశ్రేణి వర్గాల్లో ఈ ప్రదర్శనలకు చక్కటి ఆదరణ లభిస్తోంది.

స్టాండప్‌ కామెడీలో ప్రధానంగా 4 రకాలున్నాయి..

1. క్యారెక్టర్‌ కామెడీ - పేరులో ఉన్నట్లుగానే వివిధ రకాలైన పాత్రలను సృష్టించి వాటి అలవాట్లు, ఆహార్యం ద్వారా హాస్యాన్ని పండించేదే ఈ కామెడీ. మొహంలో స్పష్టమైన హావభావాలను పండించడం, గొంతును పాత్రకు తగినట్టు అనుకరించడం ద్వారా దీన్ని ఆసక్తికరంగా మలుస్తారు.

2. సెటైర్‌/ టాపికల్‌ కామెడీ - ఏదైనా ఒక అంశాన్ని తీసుకుని దానిపై వెటకారాన్ని కుమ్మరించడమే ఈ రకం. దీనికోసం సాధారణంగా రోజువారీ వచ్చే వార్తలనూ, చుట్టూ జరుగుతున్న విషయాలనూ ఎంచుకుంటూ ఉంటారు. నిజానికి అందరికీ తెలిసిన విషయంపై నవ్వించేలా మాట్లాడటం అంత సులభమైన పనికాదు. అందువల్ల దీన్ని ఇంటెలిజెంట్‌ కామెడీ అని కూడా అంటారు.

3. అబ్జర్వేషనల్‌ కామెడీ -  మన చుట్టూ జరిగే విషయాలను శ్రద్ధగా గమనించి, అందులో హాస్యభరితమైన అంశాలను వెతికి పట్టుకుని, దాన్ని నవ్వించేలా చెప్పగలగడం ఈ విధానంలోని గొప్పతనం. అందరూ సులువుగా అన్వయించుకునే వీలుండటం వల్ల ఈ తరహా కామెడీకి ఆదరణ ఎక్కువ.

4. ఇంప్రొవైజేషన్‌ కామెడీ - మొత్తం అన్ని ఫార్మాట్లలోనూ ఇది చేయడమే చాలా కష్టంగా చెబుతారు. కమెడియన్‌ వేదికపైకి వచ్చాక ప్రేక్షకుల్లోంచి ఒకరు ఏదైనా ఒక టాపిక్‌ ఇస్తారు. కమెడియన్‌ అప్పటికప్పుడు దానిపై మాట్లాడి అందరినీ నవ్వించాలి. ఇది సాధారణంగా సీనియర్లు మాత్రమే చేస్తుంటారు. ఇందులోనూ మెప్పించేవారికి ఈ రంగంలో తిరుగేలేదు.

* నిజానికి ఇది పూర్తిగా వ్యక్తిగత సామర్థ్యాలపై ఆధారపడిన రంగమే అయినా... కొత్తవారికి సహరించేందుకు కొన్ని ఆన్‌లైన్‌ కోర్సులు (ఉదా: www.udemy.com, https://alison.comz) అందుబాటులోకి వస్తున్నాయి. జోక్‌ రైటింగ్, సెకెన్ల వ్యవధిగల క్లిప్స్‌ చేయడం, పబ్లిక్‌ సీˆ్పకింగ్, పాత్రల తయారీ  అంశాల్లో వారాల వ్యవధిగల కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. వీటి ద్వారా ప్రాథమిక అంశాలు నేర్చుకోవచ్చు. రాణించాలంటే మాత్రం నిరంతర సాధన తప్పనిసరి. 

* ఇందులో పేరొందిన సీనియర్లు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో వర్క్‌షాప్స్, క్లాసులు నిర్వహిస్తున్నారు. వాటిలో చేరడం ద్వారా ఈ రంగం గురించి మరిన్ని విషయాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది.

* స్టాండప్‌లో ప్రదర్శన ఇచ్చేటప్పుడు ముందు ప్రేక్షకులను అర్థం చేసుకోవాలి. వారు ఎలాంటి సందర్భాలను తమకు తాము అన్వయించుకోగలరో గుర్తించగలగాలి. అప్పుడే షో రక్తికడుతుంది. 

* ఇందులో మనం వాడే భాష చాలా ముఖ్యం. ఎదుటివారు నొచ్చుకోకుండా సున్నితమైన చమత్కారం ఉండటం అవసరం. 

* అన్ని ప్రదర్శనల మాదిరిగానే దీనికి కూడా స్క్రిప్ట్‌ వర్క్‌ ప్రధానం. ముందు ఒక సందర్భం అనుకుని, దానికి కొన్ని జోక్స్‌ రాసుకుని, వాటిని వరస క్రమంలో వచ్చేలా ఒక కథలా అల్లుకోవడం ఎక్కువ మంది కమెడియన్లు ఆచరిస్తున్న విధానం. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని