కరెంట్‌ అఫైర్స్‌

సలీమా టెటె (గోల్‌కీపర్‌ సవిత పునియా స్థానంలో మిడ్‌ఫీల్డర్‌ సలీమా టెటె భారత మహిళల హాకీ కెప్టెన్‌గా నియమితురాలైంది.

Published : 08 May 2024 00:40 IST

మాదిరి ప్రశ్నలు

భారత మహిళల హాకీ కెప్టెన్‌గా ఎవరు నియమితులయ్యారు?

జ: సలీమా టెటె (గోల్‌కీపర్‌ సవిత పునియా స్థానంలో మిడ్‌ఫీల్డర్‌ సలీమా టెటె భారత మహిళల హాకీ కెప్టెన్‌గా నియమితురాలైంది.)


ఏ దేశంలో కొత్తరకం ఎంపాక్స్‌ విజృంభణ కారణంగా ‘ఆరోగ్య అత్యవసర పరిస్థితి’ని ప్రకటించారు?

జ: కాంగో (ఈ మహమ్మారికి సంబంధించిన ఒక కొత్త రకం వేరియంట్‌ను శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇది ప్రజల మధ్య చాలా వేగంగా వ్యాపించగలదని తేల్చారు. ఈ మహమ్మారి నేపథ్యంలో దేశంలో ‘ఆరోగ్య అత్యవసర పరిస్థితి’ని ప్రకటించారు. గత ఏడాది అక్టోబరు నుంచి జనవరి మధ్య తూర్పు కాంగోలోని కమిటుగాలో ఎంపాక్స్‌తో ఆసుపత్రిపాలైన రోగులను శాస్త్రవేత్తలు విశ్లేషించారు. మానవుల్లో తీవ్రస్థాయిలో వ్యాప్తిచెందడం వల్ల ఈ వైరస్‌లో ఇటీవల జన్యు ఉత్పరివర్తనలు చోటుచేసుకునట్లు గుర్తించారు.)


తమిళనాడు తీరంలో కొత్తగా కనుగొన్న ఒక జీవికి దేని పేరు పెట్టారు?

జ: చంద్రయాన్‌ వ్యోమనౌక (ఈ జీవికి ‘బాటలిప్స్‌ చంద్రయానీ’ అని నామకరణం చేశారు. ఇది మెరైన్‌ టార్డిగ్రేడ్‌ జాతికి చెందింది. కేరళలోని కొచ్చిన్‌ యూనివర్సిటీ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ శాస్త్రవేత్తలు దీన్ని కనుగొన్నారు. ఇది సాధారణ టార్డిగ్రేడ్ల పరిమాణంలోనే ఉంది. దీని పొడవు 0.15 మిల్లీమీటర్లు. వెడల్పు 0.04 మిల్లీమీటర్లు. దీనికి నాలుగు జతల కాళ్లు ఉన్నాయి.)


చందమామ అవతలి భాగంపై పరిశోధనకు చాంగే-6 వ్యోమనౌకను ఏ దేశం ప్రయోగించింది?

జ: చైనా (మనకు కనిపించని చందమామ అవతలి భాగం నుంచి మట్టి, శిలలను సేకరించి, భూమికి తెచ్చేందుకు చైనా చాంగే-6 అనే వ్యోమనౌకను ప్రయోగించింది. ఇప్పటివరకూ ఆ భాగం నుంచి ఏ దేశమూ నమూనాలను సేకరించలేదు. తాజా ప్రాజెక్టు విజయవంతమైతే ఆ ఘనతను సాధించిన తొలి దేశంగా చైనా గుర్తింపు పొందుతుంది. చాంగే-6ను వెన్‌చెంగ్‌ శాటిలైట్‌ లాంచింగ్‌ సెంటర్‌ నుంచి లాంగ్‌మార్చ్‌-5 రాకెట్‌ ద్వారా ప్రయోగించారు.)


ఆంధ్రప్రదేశ్‌ నూతన డీజీపీగా హరీష్‌కుమార్‌ గుప్తా 2024, మే 6న బాధ్యతలు చేపట్టారు. ఈయన 1992 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి. ప్రస్తుతం హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు.

జమ్మూకశ్మీర్‌కు చెందిన హరీష్‌కుమార్‌ గుప్తా ఖమ్మం ఏఎస్పీగా తన తొలి పోస్టింగ్‌ పొందారు. 2022 మే నుంచి హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా కొనసాగుతున్నారు.


ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో 2024 చరిత్రలోనే తొలి 5 అత్యంత తీవ్ర ఉష్ణ సంవత్సరాల్లో ఒకటిగా నిలుస్తున్నట్లు ‘క్లైమేట్‌ ట్రెండ్స్‌’ సంస్థ తన నివేదికలో తెలిపింది. ముందస్తు రుతుపవనాల జల్లులు, ఉరుములతో కూడిన వర్షాలు లేకపోవడంతో ఏప్రిల్‌ నెలలో భారత దక్షిణ ద్వీపకల్పంలో 1901 తరువాత అయిదో అత్యంత తక్కువ వర్షపాతం నమోదైందని వెల్లడించింది. ‘‘దేశంలో మరోసారి వేసవిలో ఎన్నికలు నిర్వహించేందుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు అనుకూలిస్తాయా?’’ అనే అంశం పేరిట ఈ నివేదిక విడుదల చేసింది.


ఆర్సీబీ కెప్టెన్‌ ఫాఫ్‌ డుప్లెసిస్‌ టీ20ల్లో 10,000 పరుగులు పూర్తి చేసుకున్న 14వ బ్యాటర్‌గా, తొలి సౌతాఫ్రికన్‌ క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. 2024, మే 4న గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో అర్ధసెంచరీతో ఈ ఘనత సాధించాడు.

టీ20 కెరీర్‌లో 369 మ్యాచ్‌లు ఆడిన డుప్లెసిస్‌, 134.30 స్ట్రయిక్‌రేట్‌తో 32.17 సగటున 10,039 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలు, 67 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి.

కరెంట్‌ అఫైర్స్‌ ఈబుక్స్‌ కోసం క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేయండి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని