ప్రణాళికలు అమలు చేస్తూ... ఆర్థిక వృద్ధి కాంక్షిస్తూ..!

ఆర్థిక వృద్ధి - ఆర్థికాభివృద్ధి ఉత్పత్తిలో పెరుగుదల సాధించేందుకు అవసరమైన సాంకేతిక, వ్యవస్థాపూరితమైన, సాంఘిక మార్పులతో కూడిన గుణాత్మకమైన మార్పును సూచించేదే ఆర్థికాభివృద్ధి. దీన్ని సాధించేందుకు ప్రపంచ దేశాలు పలు విధానాలను అనుసరిస్తాయి.

Published : 08 May 2024 00:34 IST

టీఎస్‌పీఎస్సీ, ఇతర పోటీ పరీక్షల ప్రత్యేకం
ఇండియన్‌ ఎకానమీ

ఆర్థిక వృద్ధి - ఆర్థికాభివృద్ధి ఉత్పత్తిలో పెరుగుదల సాధించేందుకు అవసరమైన సాంకేతిక, వ్యవస్థాపూరితమైన, సాంఘిక మార్పులతో కూడిన గుణాత్మకమైన మార్పును సూచించేదే ఆర్థికాభివృద్ధి. దీన్ని సాధించేందుకు ప్రపంచ దేశాలు పలు విధానాలను అనుసరిస్తాయి. ఈ క్రమంలో భారత్‌లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు ఆర్థికాభివృద్ధి సాధించేందుకు కొన్ని లక్ష్యాలను
నిర్దేశించుకున్నాయి..

ఆర్థికాభివృద్ధి లక్ష్యాలు

1) అధిక వృద్ధిరేటుతో ప్రజల జీవన ప్రమాణ స్థాయిని పెంచడం
2) ఆర్థిక స్వయం పోషకత్వం సాధించడం
3) సాంఘిక (సామాజిక) న్యాయం  
4) ఆధునికీకరణ   5) ఆర్థిక స్థిరత్వం
6) సుస్థిరాభివృద్ధి   7) సమ్మిళిత వృద్ధి

అధిక వృద్ధిరేటు

ధిక వృద్ధిరేటు సాధించేందుకు చైనా, భారత్‌తో సహా అన్ని అభివృద్ధి చెందుతున్న దేశాలు ప్రయత్నిస్తున్నాయి.

ఉదా: భారతదేశం అన్ని పంచవర్ష ప్రణాళికల్లో వాస్తవ జాతీయాదాయంలో అధిక వృద్ధిరేటు సాధించేందుకు ప్రాధాన్యం ఇచ్చింది.

  • మనదేశంలో 1951 - 56 మధ్య అమలు చేసిన మొదటి పంచవర్ష ప్రణాళికలో వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యం దక్కింది. ఈ ప్రణాళికలో వృద్ధిరేటు లక్ష్యం 2.1% కాగా సాధించిన వృద్ధిరేటు 3.6%.
  • రెండో పంచవర్ష ప్రణాళిక (1956-61)లో పారిశ్రామిక రంగానికి ప్రాధాన్యం ఇచ్చారు. ఈ ప్రణాళికా కాలంలో వృద్ధిరేటు లక్ష్యం 4.5% కాగా సాధించింది 4.21%.
  • స్వయం సమృద్ధి లక్ష్యంగా 1961 - 66 మధ్య మూడో పంచవర్ష ప్రణాళికను అమలు చేశారు. వృద్ధిరేటు లక్ష్యం 5.6 శాతం కాగా 2.8 శాతం మాత్రమే సాధ్యమైంది.
  • 1969 - 74 మధ్యకాలంలో అమలు చేసిన నాలుగో ప్రణాళికలో సుస్థిరతతో కూడిన వృద్ధి, స్వావలంబన లక్ష్యాలుగా చేపట్టిన పథకాలు నిరాశజనకంగా మారాయి.
  • గాడ్గిల్‌ ప్రణాళికగా పేరొందిన 4వ ప్రణాళికా కాలంలో శీఘ్ర ఆర్థికాభివృద్ధి సాధించడానికి ప్రయత్నించారు. అయితే 1962 చైనా యుద్ధం, ఇతర ఆటంకాల వల్ల ఆశించిన ఆర్థికాభివృద్ధి సాధించలేదు.
  • గరీబీ హఠావో నినాదం ప్రాచుర్యం పొందినా, ఆశించిన 5.7 శాతం వృద్ధిరేటును చేరుకోలేకపోయింది. కేవలం 2.05 శాతం మాత్రమే సాధించింది.
  • 1974- 79 కాలానికి అయిదో పంచవర్ష ప్రణాళికను ప్రవేశపెట్టినా రాజకీయ కారణాలతో 1978లోనే రద్దు చేశారు. ఆశించిన వృద్ధిరేటు 4.4 శాతం కాగా 4.83 శాతం సాధ్యమైంది.
  • 1978 - 80లో నిరంతర ప్రణాళికను అమలు చేశారు.
  • 1980- 85 మధ్యకాలంలో పేదరిక నిర్మూలన, సాంకేతిక స్వావలంబన లక్ష్యాలతో ఆరో పంచవర్ష ప్రణాళికను అమలు చేశారు. 5.2 శాతం వృద్ధిరేటు ఆశించగా 5.54 శాతం నమోదైంది.
  • స్వయం సమృద్ధి, ఉత్పాదక ఉపాధి అవకాశాల కల్పన లక్ష్యాలతో 1985 - 90 మధ్య ఏడో పంచవర్ష ప్రణాళికను అమలు చేశారు.
  • 5 శాతం వృద్ధిరేటు ఆశించగా, 6.02 శాతం సాధ్యమైంది.
  • 1992 - 97 మధ్య కాలంలో విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యమిచ్చి, ఉపాధి కల్పించే లక్ష్యంతో ఎనిమిదో ప్రణాళిక అమలు చేశారు.
  • నూతన ఆర్థిక సంస్కరణలు (1991 జులై 24) ప్రవేశపెట్టి ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దారు. 5.6 శాతం వృద్ధిరేటు ఆశించగా, 6.68 శాతం నమోదైంది.
  • 1997- 2002 మధ్య అమలు చేసిన తొమ్మిదో పంచవర్ష ప్రణాళికలో 6.5 శాతం వృద్ధిరేటు సాధించాలని లక్ష్యంగా పెట్టుకోగా 5.35 శాతం మాత్రమే సాధ్యపడింది. ఈ ప్రణాళికా కాలంలో సామాజిక న్యాయం, సమానత్వాల సాధన కోసం కృషి చేశారు.
  • పదో పంచవర్ష ప్రణాళిక (2002-07)లో తలసరి ఆదాయాన్ని రెట్టింపు చేయాలని, పేదరిక నిష్పత్తిని 15 శాతానికి తగ్గించాలని ప్రయత్నించారు. 8 శాతం వృద్ధిరేటు ఆశించగా, 7.6 శాతం పొందారు.
  • వేగవంతమైన సమ్మిళిత వృద్ధి సాధన లక్ష్యంతో 2007 - 12 మధ్య కాలంలో పదకొండో పంచవర్ష ప్రణాళిక అమలు చేశారు. 9 శాతం వృద్ధిరేటు ఆశించగా, 8 శాతం సాధ్యమైంది.
  • మరింత వేగవంతమైన సమ్మిళిత, నిలకడ గల వృద్ధిరేటు సాధించాలని 2012 - 17 మధ్య పన్నెండో పంచవర్ష ప్రణాళికను అమలు చేశారు. 8 శాతం వృద్ధిరేటు ఆశించగా, 7 శాతం సాధించారు. ప్రస్తుతం నీతి ఆయోగ్‌ విజన్‌ ప్రణాళికా కాలం కొనసాగుతోంది (2017 - 2032). నీ 2021 - 22 భారత ఆర్థిక సర్వే నివేదిక ప్రకారం మన దేశ వృద్ధిరేటు 9.2 శాతం ఉండగా, 2022 - 23లో 8 - 8.5 శాతం ఉండొచ్చని అంచనా వేసింది. భారత ఆర్థిక సమీక్ష 2024 నివేదిక ప్రకారం 2024లో వృద్ధిరేటు అంచనా 7.3 శాతం.

ఆర్థిక స్వావలంబన

స్వావలంబన, స్వయం సమృద్ధి అనేవి రెండు వేర్వేరు అంశాలు.

  • స్వయం సమృద్ధి అంటే ఒక దేశం తనకు అవసరమైన అన్ని వస్తు, సేవలను ఇతర దేశాలపై ఆధారపడకుండా తానే ఉత్పత్తి చేస్తుంది. ఈ దేశం దిగుమతులు చేసుకోదు.
  • స్వావలంబన అంటే ఒక దేశం తనకు అవసరమైన వాటిని కొనడానికి సరిపడే మిగులును సృష్టించుకుంటుంది.
  • తనకు అవసరమైన వాటిని కొనుగోలు చేయడానికి వనరుల కోసం ఇతర దేశాలపై ఆధారపడదు.
  • ఏ దేశం కూడా పూర్తి స్వయం సమృద్ధిని కలిగి ఉండదు. అయితే ఒక దేశం తాను చేసుకునే దిగుమతులకు చెల్లింపులు చేయడం ద్వారా స్వావలంబనను సాధించే ప్రయత్నం చేస్తుంది.
  • ప్రణాళికల ఆరంభంలో స్వదేశీ అవసరాల కోసం భారతదేశం అమెరికా నుంచి ఆహార ధాన్యాలను దిగుమతి చేసుకుంది.
  • అలాగే సత్వర పారిశ్రామిక అభివృద్ధి కోసం మూలధన వస్తువులైన భారీ యంత్రాలు, సాంకేతికతను దిగుమతి చేసుకుంది.
  • మనదేశంలో మౌలిక వసతులైన రోడ్లు, రైల్వేలు, ఇంధనం అభివృద్ధి కోసం పెట్టుబడి రేటును పెంచడానికి విదేశీ సహాయం మీద ఆధారపడుతున్నాం.
  • విదేశీ రంగంపై అధికంగా ఆధారపడటం ఆర్థిక వలస విధానానికి దారితీస్తుంది.
  • ఈ విషయంలో మూడో ప్రణాళికా నుంచి స్వయం పోషకత్వం సాధించే లక్ష్యాన్ని ప్రణాళికవేత్తలు పొందుపరిచారు.
  • నాలుగో ప్రణాళికలో స్వావలంబనకు ముఖ్యంగా ఆహార ధాన్యాల ఉత్పత్తికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు.
  • అయిదో ప్రణాళికలో సరిపడే విదేశీ మారక ద్రవ్యాన్ని సాధించడానికి ఎగుమతుల ప్రోత్సాహకం, దిగుమతుల ప్రత్యామ్నాయ విధానాన్ని అవలంబించే లక్ష్యాన్ని పెట్టుకున్నారు.
  • స్వావలంబన విషయంలో భారతదేశం చెప్పుకోదగిన ప్రగతిని సాధించింది. తర్వాతి కాలంలో చాలావరకు అభివృద్ధి చెందుతున్న దేశాలైన చైనా, బ్రెజిల్‌, దక్షిణాఫ్రికా, దక్షిణ కొరియా, వియత్నాంతో పాటు మరికొన్ని ఆఫ్రికా, ఆసియా, లాటిన్‌ అమెరికా దేశాలు స్వావలంబన లక్ష్యాన్ని సాధించాలని నిర్దేశించుకున్నాయి.

సామాజిక న్యాయం

దేశంలోని ఆదాయ, సంపదలు సమాజంలోని అన్ని వర్గాలకు సమానంగా పంపిణీ జరగాలన్నదే సామాజిక న్యాయం.
సమాజంలో పేద, బలహీన వర్గాల వారిపై శ్రద్ధ వహించి ఆర్థిక, సామాజిక న్యాయం అందించడం అనేది ఆర్థికాభివృద్ధి మరో లక్ష్యం.
పంచవర్ష ప్రణాళికలు నాలుగు సామాజిక న్యాయ అంశాలకు ప్రాధాన్యమిచ్చాయి. అవి:
1) దేశ రాజకీయ వ్యవస్థలో ప్రజాస్వామిక సూత్రాలు అమలు చేయడం.
2) సామాజిక, ఆర్థిక సమానత్వం సాధించడం, ప్రాంతీయ అసమానతలను తగ్గించడం.
3) ఆర్థికశక్తి కేంద్రీకరణ ప్రక్రియను సమాప్తం చేసి శక్తి వికేంద్రీకరణను సాధించడం.
4) వెనకబడిన, అణగారిన వర్గాల వారి పరిస్థితులను మెరుగుపరిచే ప్రయత్నం.
ఈ విధంగా పంచవర్ష ప్రణాళికల్లో అనేక ప్రజాకర్షక పథకాలను ప్రవేశపెట్టి ఎస్సీ, ఎస్టీల ఆర్థిక పరిస్థితులను మెరుగుపరిచేందుకు కృషి చేశారు.

  • భూపంపకంలో అసమానతలను తగ్గించడానికి భూసంస్కరణలు ప్రవేశపెట్టి అమలు చేశారు.
  • ప్రాంతీయ అసమానతలను తగ్గించేందుకు వెనకబడిన ప్రాంతాల్లో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు.
  • అభివృద్ధి చెందిన దేశాలు సమానత్వంతో కూడిన సామాజిక ఆర్థికాభివృద్ధి కోసం వాటి పన్ను వ్యవస్థలో మార్పులు తీసుకొస్తున్నాయి.

లక్ష్యాలు: ఆదాయం, సంపద, వినియోగాల్లో అసమానతలను తగ్గించడం

  • నిరుద్యోగాన్ని, పేదరికాన్ని తగ్గించడం
  • బలహీనవర్గాలను ఆదుకోవడం
  • భూసంస్కరణలను అమలు చేయడం.

ఆధునికీకరణ

స్వాతంత్య్రానికి పూర్వం మనదేశం వెనకబడిన ఆర్థిక వ్యవస్థ, భూస్వామ్య విధానాన్ని కలిగి ఉంది. స్వాతంత్య్రానంతరం ప్రణాళికా రూపకర్తలు, విధానకర్తలు దేశ ఆర్థిక వ్యవస్థను ఆధునికీకరించేందుకు వ్యవస్థాపరమైన, సంస్థాపరమైన మార్పులను తీసుకువచ్చారు.
లక్ష్యాలు: ప్రజల జీవన ప్రమాణాలు, గ్రామీణ వ్యవస్థ, సంస్థల్లో మార్పులు తీసుకురావడం.

  • ఉన్నత శాస్త్రీయ ఉత్పత్తి పద్ధతులను అనుసరించడం
  • జాతీయాదాయంలో పారిశ్రామిక ఉత్పత్తి వాటా, నాణ్యతను పెంచడం ్య వివిధ పరిశ్రమల స్థాపనతో స్వదేశీ పరిశ్రమలూ వృద్ధి చెందుతాయి. ్య వ్యవసాయ, పారిశ్రామిక రంగాల సేవల విస్తరణకు తోడ్పడుతుంది.
  • భూసంస్కరణల అమలుతో పాటుగా వ్యవసాయ రంగ ఆధునికీకరణ. ప్రస్తుతం ఆధునికీకరణ పెరగడానికి ముఖ్య కారణం సమాచార సాంకేతిక పరిజ్ఞానం వృద్ధి చెందడం
  • విప్లవాత్మక భూసంస్కరణలను అభివృద్ధి చెందుతున్న పలు దేశాలలో అమలు చేశాయి.

ఉదా: చైనా, వియత్నాం, భారత్‌.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని