రాస్తే.. ప్రయోజనాలెన్నో!

విషయం ఏదైనా సరే స్క్రీన్‌షాట్స్‌ తీసుకోవడం, డౌన్‌లోడ్‌ చేసుకోవడం, కంప్యూటర్‌లోనో ఫోన్‌లోనో సేవ్‌ చేసుకోవడం ఇప్పుడు చాలా మంది విద్యార్థులకు ఉన్న అలవాటు. మారుతున్న కాలమాన పరిస్థితుల వల్ల ఇది తప్పడం లేదు కూడా.

Published : 09 May 2024 00:51 IST

విషయం ఏదైనా సరే స్క్రీన్‌షాట్స్‌ తీసుకోవడం, డౌన్‌లోడ్‌ చేసుకోవడం, కంప్యూటర్‌లోనో ఫోన్‌లోనో సేవ్‌ చేసుకోవడం ఇప్పుడు చాలా మంది విద్యార్థులకు ఉన్న అలవాటు. మారుతున్న కాలమాన పరిస్థితుల వల్ల ఇది తప్పడం లేదు కూడా. అయితే చేతితో రాయడం అనేది అనేక రకాలుగా వారికి ఉపకరిస్తుంది అంటున్నారు నిపుణులు. ఎంత స్క్రీన్‌కు అలవాటుపడినా.. రాయడాన్ని మాత్రం తగ్గించకూడదని చెబుతున్నారు.

చాలా పరిశోధనల్లో తేలిన విషయం ఏంటంటే.. విద్యార్థులు ఎక్కువగా రాయడం వల్ల వారి అకడమిక్‌ ప్రదర్శన మెరుగుపడటం, ఆలోచనల్లో స్పష్టత పెరగడం, తద్వారా కళాశాలలోనూ కెరియర్‌లోనూ విజయావకాశాలు పెరగడం జరుగుతుందట. విద్యార్థులు తమ ఆలోచనల గురించి వివరించడానికి, అభిప్రాయాలను వెలిబుచ్చడానికి, విజ్ఞానాన్ని సంపాదించడానికి, సృజనాత్మకతను బయటపెట్టడానికి.. ఇలా అన్నింటికీ రాయడం ఒక ప్రధాన సాధనంగా ఉండగలదు. ఇతరుల నుంచి వేగంగా నేర్చుకోవడానికి, క్రిటికల్‌ థింకింగ్‌, ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది.

  • అంతేకాదు.. రాయడం అలవాటున్న విద్యార్థులకు మెరుగైన డాక్యుమెంటేషన్‌ నైపుణ్యాలు అలవడే వీలుంది. సైన్స్‌, టెక్నాలజీ, లాజిక్‌.. ఇటువంటి వాటిలో కొత్త విషయాలను వెర్బల్‌గా చెప్పడం కష్టం, వీటికి రాతనైపుణ్యాలు అవసరం. ఈ స్కిల్స్‌ ఉద్యోగావకాశాలను మెరుగుపరుస్తాయి. రాయడం ద్వారా కమ్యూనికేషన్‌ నైపుణ్యాలు పెరగడంతోపాటుగా జ్ఞాపకశక్తి సైతం మెరుగుపడుతుంది. చెప్పాలనుకునే విషయాన్ని స్పష్టంగా తెలియజేయడం ఎలాగో నేర్చుకోవచ్చు.
  • తరచూ రాస్తుండటం వల్ల చదివే అలవాటు కూడా మెరుగవుతుంది. భాషా జ్ఞానం పెరగడంతోపాటు ఆలోచనలకు రూపం ఇవ్వడం ఎలాగో తెలుస్తుంది. ఇది ఆత్మవిశ్వాసాన్ని పెంచడంతోపాటు ఒత్తిడిని తగ్గిస్తుంది. సమస్యాపూరణ నైపుణ్యాలను పెంచడంతోపాటు టైమ్‌ మేనేజ్‌మెంట్‌ తెలియాలంటే రాయడం మంచి ప్రాక్టీస్‌ అని చెబుతున్నారు నిపుణులు. ముఖ్యంగా మేనేజ్‌మెంట్‌, రిసెర్చ్‌, టెక్నికల్‌ రంగాలవైపు అడుగులు వేయాలని ఆశించే విద్యార్థులు తరచూ ఎంతో కొంత రాయడాన్ని సాధన చేస్తే మెరుగైన ఫలితాలు ఆశించవచ్చని వెల్లడిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని