జన్మస్థానం ఏదైనా... చివరి మజిలీ సాగరమే!

ఏదైనా ఒక ప్రాంతంలో ప్రారంభమై, అత్యధిక దూరం ప్రయాణించి సముద్రంలో లేదా మహాసముద్రంలో కలిసే అతిపెద్ద నీటి ప్రవాహాన్ని ‘నది’గా పేర్కొంటారు.

Published : 23 Apr 2024 00:13 IST

ఏపీపీఎస్సీ,ఇతర పోటీ పరీక్షల ప్రత్యేకం
జాగ్రఫీ

ఏదైనా ఒక ప్రాంతంలో ప్రారంభమై, అత్యధిక దూరం ప్రయాణించి సముద్రంలో లేదా మహాసముద్రంలో కలిసే అతిపెద్ద నీటి ప్రవాహాన్ని ‘నది’గా పేర్కొంటారు. నదుల అధ్యయనాన్ని ‘పొటమాలజీ’ అని, సరస్సులు, చెరువుల అధ్యయనాన్ని ‘లిమ్నాలజీ’ అని అంటారు. జాగ్రఫీ నుంచి అడిగే ప్రశ్నల విభాగంలో భారత నదీ వ్యవస్థ ఒకటి. పోటీ పరీక్షల అభ్యర్థులకు దీనిపై అవగాహన అవసరం.

భారతదేశ నదీ వ్యవస్థ

ఒక నదికి నీటిని అందించే మొత్తం భౌగోళిక ప్రాంతాన్ని నదీ పరీవాహక ప్రాంతం అంటారు. ఒక నది, అందులో కలిసే ఉపనదులు, వాగులు, వంకలు, ఏరులు మొదలైన వాటిని నదీవ్యవస్థ అంటారు.

నదీ ప్రవాహ దశలు (Stages of Rivers)

యవ్వన దశ:

ఒక నది పుట్టిన ప్రాంతం నుంచి మైదానంలో చేరేవరకు ఉండే దశను ఆ నది యవ్వన దశ అంటారు.

  • యవ్వన దశలో నదీ ప్రవాహ వేగం ఎక్కువ. కాబట్టి ఆకస్మిక వరదలు అధికంగా ఉంటాయి.
  • యవ్వన దశలోనే నదులు జలపాతాలను ఏర్పరుస్తాయి.

జలపాతాలు రెండు రకాలు. అవి...

క్యాటరాక్ట్‌ జలపాతం: అత్యంత ఎత్తయిన ప్రాంతం నుంచి నిటారుగా దూకే నీటి ప్రవాహం. ఉదా: ఏంజెల్‌ జలపాతం, జోగ్‌ జలపాతం.
 ప్రపంచంలో అతి ఎత్తయిన జలపాతం ఏంజెల్‌ జలపాతం. ఇది వెనెజులా దేశంలో చురుణ్‌ నదిపై ఉంది. దీని ఎత్తు 979 మీటర్లు.

క్యాస్కేడ్‌ జలపాతం: ఎత్తయిన ప్రాంతం నుంచి నది నీరు నిటారుగా జాలువారకుండా మెట్లలా లేదా సోపానాల్లా జాలువారితే క్యాస్కేడ్‌ జలపాతం అంటారు. ఉదా: భారతదేశంలోని కుంచికల్‌ జలపాతం.
భారతదేశంలో అత్యంత ఎత్తయిన జలపాతం కర్ణాటకలోని కుంచికల్‌ జలపాతం. దీని ఎత్తు 455 మీటర్లు. ఇది వరాహి నదిపై ఉంది.

V ఆకారపు లోయలు: వాలు ఎక్కువగా ఉన్న పర్వత ప్రాంతాల్లో నదీ ప్రవాహం వేగంగా ఉండి కొండను లేదా పర్వతాన్ని నిలువుగా కోతకు గురిచేస్తుంది. దీని ఫలితంగా లోతైన లోయ ఏర్పడుతుంది. ఈ లోయ కింది భాగం సన్నగా, పైభాగం ఎక్కువ వెడల్పుగా ఉంటుంది.

V ఆకారపు లోయలు నిట్టనిలువు గోడలుగా మారితే ఆ లోయలను ‘గార్జ్‌’ అంటారు.

ఉదా: గోదావరి నది మీద పాపికొండల వద్ద ‘బైసన్‌ గార్జ్‌’ ఏర్పడింది.

‘ గార్జ్‌లు పైన ఎంత వెడల్పుగా ఉంటాయో కింద కూడా అంతే వెడల్పుగా ఉంటాయి.

కాన్యన్‌ అగాధదరి: గార్జ్‌లు ఏర్పడిన తరువాత నది నీటికొలత పెరిగితే లోతైన అగాధదరులు ఏర్పడతాయి.

  • అగాధదరి కింది భాగం కంటే పైభాగం ఎక్కువ వెడల్పుగా ఉంటుంది.
  • ప్రపంచంలో అతిపెద్ద అగాధదరి యూఎస్‌ఏలోని గ్రాండ్‌ కాన్యన్‌.
  • ఇది కొలరాడో నదీ ప్రవాహం వల్ల ఏర్పడింది. దీని పొడవు 466 కి.మీ., లోతు 1.6 కి.మీ., వెడల్పు 188 మీటర్ల నుంచి 29 కి.మీ.ల వరకు ఉంటుంది.
  • భారతదేశంలో అతి పెద్ద కాన్యన్‌ పెన్నా నది వల్ల ఏర్పడిన గండికోట కాన్యన్‌. వీటితోపాటు Pot holes, Rock Benchers లు కూడా నది యవ్వన దశలో ఏర్పడతాయి.

ప్రౌఢదశ:

నది మైదానంలోకి ప్రవేశించినప్పటి నుంచి తీర ప్రాంతానికి చేరేవరకు మధ్యనున్న నదీ ప్రవాహాన్ని దాని ప్రౌఢదశ అంటారు.

  • ప్రౌఢదశలో నది వేగం మితంగా ఉంటుంది. ఈ దశలోనే నదులు వరద మైదానాలను ఏర్పాటు చేస్తాయి.
  • ప్రౌఢదశలో నది వేగం తక్కువగా ఉండి వెడల్పు ఎక్కువగా ఉంటుంది.
  • ఈ దశలో నది ద్వారా మెట్లలాంటి స్వరూపాలు, వీవెనలు తయారవుతాయి. అంతేకాకుండా విసనకర్ర ఆకారంలో వండలి వీవెనలు ఏర్పడతాయి.
  • ఈ క్రమంలోనే నదికి అనేక ఉపనదులు చేరి నీటి పరిమాణం పెరుగుతుంది.

నది వృద్ధాప్య దశ:

నదీ ప్రవాహం తీర ప్రాంతాన్ని చేరినప్పటి నుంచి సముద్రంలో కలిసే వరకు ఉన్న దశను వృద్ధాప్య దశ అంటారు. ఈ దశలో నదీ ప్రవాహం చాలా తక్కువగా ఉండి, అనేక వంకరలు తిరిగి ప్రవహిస్తుంది.

నదీ ప్రవాహంలో జరిగే చర్యలు

ట్రాక్షన్‌: నదిలో నీటితో పాటు చిన్నచిన్న గులకరాళ్లు కొట్టుకుపోయే ప్రక్రియ.
సస్పెన్సిన్‌: నదిలో నీటి ప్రవాహంతో పాటు ఇసుక, మట్టి కొట్టుకుపోయే ప్రక్రియ.
సాల్టేషన్‌: నది నీటి ప్రవాహ వేగానికి పెద్దపెద్ద బండరాళ్లు కొట్టుకుపోయే ప్రక్రియ.
ద్రావణీకరణం: నది నీరు భూమిపై ప్రవహించే క్రమంలో భూమి పైపొర కింద దాగి ఉండే సున్నం, సోడియం, అనేక రసాయనాలు, లవణాలు నది నీటిలో కలిసి ప్రవహించే ప్రక్రియను ద్రావణీకరణం అంటారు.

డెల్టా (Delta)

డెల్టా అనేది గ్రీకు భాషా పదం. గ్రీకు భాషలో డెల్టా అంటే సారవంతమైన భూమి అని అర్థం. సాధారణంగా డెల్టాలు త్రిభుజాకారంగా ఏర్పడతాయి.

డెల్టాలు - రకాలు:

పక్షిపాద డెల్టా: మిసిసిపి నది పక్షిపాదం ఆకారంలో డెల్టాలను ఏర్పాటు చేస్తుంది.

ధనస్సు ఆకారపు డెల్టా: నది సముద్రంలో కలిసే ప్రాంతం U ఆకారంలో ఉండి, ఆ ప్రాంతంలో డెల్టా ఏర్పడితే దాన్ని ధనస్సు ఆకారపు డెల్టా అంటారు.
గోదావరి నది ఈ రకమైన డెల్టాను ఏర్పాటు చేస్తుంది.

ఎస్యురైన్‌ డెల్టా: నది తనతోపాటు తీసుకువచ్చిన సారవంతమైన మట్టిని పొడవైన, సన్నని డెల్టాగా నిక్షేపించే నిర్మాణాలు.
ఈ రకమైన డెల్టాలను ఏర్పాటు చేసే నదులు: నర్మద, తాపి, మాహీ.

డిజిటల్‌ డెల్టా: కంప్యూటర్‌ కీ బోర్డులోని అక్షరాల బిళ్లల రూపంలో చిన్నగా ఏర్పడిన అనేక డెల్టాల సమూహాన్ని ‘డిజిటల్‌ డెల్టా’ అంటారు.
౯ గంగానది డెల్టాలను డిజిటల్‌ డెల్టా అంటారు.

లోబెట్‌ డెల్టా: సముద్రంలో మునిగినట్టుగా కనిపించే డెల్టా.

  • ఈ రకమైన డెల్టాలను ఏర్పరిచే నదులు: కృష్ణా, పెన్నా.
  • ప్రపంచంలో అతిపెద్ద డెల్టా సుందర్‌బన్‌ డెల్టా. గంగా, బ్రహ్మపుత్ర నదులు బంగాళాఖాతంలో కలిసే చోట ఈ డెల్టా ఏర్పడుతుంది. ఇది బంగ్లాదేశ్‌, భారతదేశంలో విస్తరించి ఉంది.
  • ప్రపంచంలో రెండో పెద్ద డెల్టా థాయిలాండ్‌ దేశంలోని మెకంజి డెల్టా.

నదుల వర్గీకరణ

భారతదేశంలో నదులను నదీ పరీవాహక ప్రాంతం, జన్మస్థలం ఆధారంగా రెండు రకాలుగా విభజించవచ్చు.

నదీ పరీవాహక ప్రాంతం

నదీ పరీవాహక ప్రాంతం ఆధారంగా నదులను తిరిగి మూడు రకాలుగా వర్గీకరించవచ్చు.

ప్రధాన నదులు (Major Rivers) : పరీవాహక ప్రాంతం 20,000 చ.కి.మీ. లేదా అంతకంటే ఎక్కువ ఉన్న నదులను ప్రధాన నదులు అంటారు.
మన దేశంలోని ప్రధాన నదుల సంఖ్య 14. వీటి ద్వారా సుమారు 80% - 85% నీరు ప్రవహిస్తుంది.

నదులు: గంగా, సింధు, బ్రహ్మపుత్ర, సుబర్నరేఖ, బ్రాహ్మణి, మహానది, గోదావరి, కృష్ణా, పెన్నా, కావేరి, నర్మద, తపతి, మాహీ, సబర్మతి.

  • ఆంధ్రప్రదేశ్‌లో మూడు ప్రధాన నదులు ప్రవహిస్తాయి. అవి: గోదావరి, కృష్ణా, పెన్నా.
  • తెలంగాణలో రెండు ప్రధాన నదులు ప్రవహిస్తాయి. అవి: గోదావరి, కృష్ణా.
  • కర్ణాటకలో ప్రవహించే ప్రధాన నదులు కృష్ణా, పెన్నా, కావేరి.

మధ్యతరహా నదులు (Medium Rivers) :  నదీ పరీ వాహక ప్రాంతం 2000 నుంచి 20000 చ.కి.మీ. మధ్య ఉన్న నదులను మధ్యతరహా నదులు అంటారు.
భారతదేశంలో మధ్యతరహా నదులు సుమారు నాలుగు ఉన్నాయి. కానీ వీటి ద్వారా ప్రవహించే నీరు 7% శాతం మాత్రమే.

ఉదా: పెరియార్‌, కాళింది మొదలైనవి.

చిన్నతరహా నదులు: పరీవాహక ప్రాంతం 2000 చ.కి.మీ. కంటే తక్కువగా ఉండే నదులు. దేశంలో వీటి సంఖ్య సుమారు 187. ప్రవహించే నీరు 8%.

పుట్టుక ఆధారంగా భారతదేశ నదులు

జన్మస్థానం ఆధారంగా భారతదేశంలోని నదులను హిమాలయ, ద్వీపకల్ప నదులుగా విభజించవచ్చు.

హిమాలయ నదులు: వీటినే జీవనదులు అని అంటారు. ఈ నదులు హిమాలయ పర్వతాల్లో జన్మిస్తాయి. ఉదా: సింధు, గంగా, బ్రహ్మపుత్ర.

  • హిమాలయ నదులు పెద్దపెద్ద గార్జ్‌లను ఏర్పర్చి, అకస్మాత్తుగా తమ దిశలను మార్చుకుని జు ఆకారపు లోయలను ఏర్పరుస్తాయి.
  • అధిక వేగం కారణంగా ఈ నదుల్లో అకస్మాత్తుగా వరదలు సంభవిస్తాయి. 2021 ఫిబ్రవరిలో ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలోని ధౌళిగంగా నదికి సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా తపోవన్‌ జల విద్యుత్‌ ప్రాజెక్టు పూర్తిగా కొట్టుకుపోయింది.
  • ఈ నదులు ఎక్కువ పొడవుగా ఉండి, అధిక నీటి పరిమాణాన్ని కలిగి ఉంటాయి.
  • హిమాలయాలు ఏర్పడక ముందు నుంచి ఆ ప్రాంతాల్లో ప్రవహిస్తున్న నదులను ‘పూర్వవర్తి నదులు’ అంటారు.

ఉదా: సింధు, సట్లెజ్‌, బ్రహ్మపుత్ర, కోసి, గండక్‌, అలక్‌నంద.

హిమాలయాలు ఏర్పడిన తర్వాత ఆ ప్రాంతంలో పుట్టి ప్రవహించే నదులను ‘అంతర్‌వర్తిత నదులు’ అంటారు.

ఉదా: గంగా, యమున, రావి, బియాస్‌ మొదలైనవి.

భారతదేశంలోని హిమాలయ నదులన్నీ మనదేశంతో పాటు పొరుగు దేశాల్లో ప్రవహించి బంగాళాఖాతం లేదా అరేబియా సముద్రంలో కలుస్తాయి.

ద్వీపకల్ప నదులు: ద్వీపకల్ప భారతదేశంలోని పర్వత ప్రాంతాల్లో జన్మించే నదులను ద్వీపకల్ప నదులు అంటారు.

ఇవి వర్షాధార నదులు, తక్కువ వేగం కలిగి ఉంటాయి. నదీ వక్రతలు ఉండవు. కఠినమైన అగ్ని శిలలపై ప్రవహిస్తాయి. అందుకే తక్కువగా ఇంకిపోతాయి.

ఉదా: గోదావరి, కృష్ణా, పెన్నా, కావేరి, మహానది, నర్మద, తపతి.

  • భారతదేశంలోని నదుల ద్వారా ప్రవహించే నీరు 90% బంగాళాఖాతంలో, 10% అరేబియా సముద్రంలో కలుస్తుంది.
  • మన దేశంలోని నదుల్లో 77% నదులు తూర్పుగా ప్రవహించి బంగాళాఖాతంలో కలిస్తే, 23% నదులు పడమరగా ప్రవహించి అరేబియా సముద్రంలో కలుస్తాయి.

రచయిత: పి.కె. వీరాంజనేయులు , విషయ నిపుణులు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని