కరెంట్‌ అఫైర్స్‌

దొమ్మరాజు గుకేశ్‌ క్యాండిడేట్స్‌ టోర్నీలో విజేతగా నిలిచాడు. 2024, ఏప్రిల్‌ 22న హికరు నకముర (అమెరికా)తో గేమ్‌ను డ్రా చేసుకున్న గుకేశ్‌, మొత్తం 9 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు.

Updated : 24 Apr 2024 00:55 IST

దొమ్మరాజు గుకేశ్‌ క్యాండిడేట్స్‌ టోర్నీలో విజేతగా నిలిచాడు. 2024, ఏప్రిల్‌ 22న హికరు నకముర (అమెరికా)తో గేమ్‌ను డ్రా చేసుకున్న గుకేశ్‌, మొత్తం 9 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. క్యాండిడేట్స్‌ టోర్నీ గెలిచిన అతి పిన్న వయసు ఆటగాడిగా, విశ్వనాథన్‌ ఆనంద్‌ (2014) తర్వాత ఈ టోర్నీ నెగ్గిన రెండో భారతీయుడిగా గుకేశ్‌ చరిత్ర సృష్టించాడు. ఈ విజయంతో అతడు ప్రపంచ టైటిల్‌ కోసం డిఫెండింగ్‌ ఛాంపియన్‌ డిన్‌ లిరెన్‌ (చైనా)తో తలపడేందుకు అర్హత సాధించాడు.


రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ టర్నోవరు 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.10 లక్షల కోట్లకు చేరింది. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ కంపెనీగా ఇది నిలిచింది. 2022-23లో రూ.9.74 లక్షల కోట్లుగా ఉన్న టర్నోవరు, 2023-24లో 2.6% పెరిగింది.

  • 2023-24లో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ నికర లాభం రూ.69,621 కోట్లుగా నమోదైంది. 2022-23లో లాభం రూ.66,702 కోట్లుగా ఉంది.

మెరికాలో ఉంటున్న భారతీయుల్లో 65,960 మంది అధికారికంగా ఆ దేశ పౌరులు అయినట్లు కాంగ్రెషనల్‌ రిసెర్చ్‌ సర్వీస్‌ ‘అమెరికా నేచురలైజేషన్‌ పాలసీ’ నివేదికలో పేర్కొంది. పౌరసత్వం పొందుతున్న విదేశీయుల్లో మెక్సికో తొలిస్థానంలో ఉండగా, భారత్‌ రెండోస్థానంలో నిలిచింది.


దేశీయ నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు 2023-24 ఆర్థిక సంవత్సరంలో 17.7% పెరిగి రూ.19.58 లక్షల కోట్లకు చేరాయని పన్ను విభాగం 2024, ఏప్రిల్‌ 21న వెల్లడించింది. ఆదాయపు పన్ను, కార్పొరేట్‌ పన్నుల నికర వసూళ్లు బడ్జెట్‌ తొలి అంచనాల కంటే రూ.1.35 లక్షల కోట్లు (7.4%), సవరించిన అంచనాల కంటే రూ.13,000 కోట్లు (0.67%) అధికంగా నమోదైనట్లు తెలిపింది.

కరెంట్‌ అఫైర్స్‌ ఈబుక్స్‌ కోసం క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేయండి.


‘లా ఆన్‌ మ్యాట్రిమోనియల్‌ ఇష్యూస్‌ రిలేటింగ్‌ టు ఎన్‌ఆర్‌ఐ, ఓసీఐ’ అంశంపై అధ్యయనం చేసి తన నివేదికను ఇటీవల ఎవరి నేతృత్వంలోని లా కమిషన్‌ కేంద్ర న్యాయశాఖకు సమర్పించింది? (ప్రవాస భారతీయులు (ఎన్‌ఆర్‌ఐలు), భారత సంతతికి చెందిన విదేశీయులు (ఓసీఐ) - భారతీయ పౌరుల మధ్య మోసపూరిత వివాహాలు పెరుగుతుండటం ఆందోళనకరమని, ఈ ధోరణికి అడ్డుకట్ట వేయడానికి సమగ్రమైన చట్టం తేవాలని న్యాయ కమిషన్‌ సూచించింది. భారతీయులు - ఎన్‌ఆర్‌ఐలు, భారతీయులు - ఓసీఐల మధ్య పెళ్లిళ్లను విధిగా రిజిస్టర్‌ చేసే విధానం ఉండాలని స్పష్టం చేసింది. మోసపూరిత ఎన్‌ఆర్‌ఐ వివాహాలతో భారత యువతులు అధికంగా నష్టపోతున్నారని గుర్తు చేసింది. వైవాహిక స్థితిని కచ్చితంగా వెల్లడించేలా పాస్‌పోర్ట్‌ చట్టం - 1967లో సవరణలు చేయాలని పేర్కొంది. పాస్‌పోర్ట్‌లో మ్యారేజ్‌ రిజిస్ట్రేషన్‌ నంబరు కూడా ఉండాలని లా కమిషన్‌ సూచించింది.)

జ: జస్టిస్‌ రితురాజ్‌ అవస్థీ

  • పాత ఉపగ్రహాలతో ఆయా కక్ష్యల్లో పెరిగిపోతున్న అంతరిక్ష చెత్తను కొంతయినా తగ్గించే లక్ష్యంతో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో 2024, ఫిబ్రవరి 16న ఏ ఉపగ్రహాన్ని విజయవంతంగా భూ వాతావరణంలోకి తీసుకొచ్చి హిందూ మహాసముద్రంలో పడేలా చేసింది? (పట్టణ ప్రణాళికలకు సాయపడేలా అత్యంత స్పష్టమైన హై రిజల్యూషన్‌ ఇమేజ్‌లు తీసేందుకు 2007, జనవరి 10న 680 కేజీల ఈ ఉపగ్రహాన్ని 635 కిలోమీటర్ల ఎత్తులోని కక్ష్యలోకి ఇస్రో విజయవంతంగా పంపింది. ఈ ఉపగ్రహం 2019 వరకు దేశానికి సేవలు అందించింది.)

జ: కార్టోశాట్‌ - 2


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు