CRPF Jobs: సీఆర్‌పీఎఫ్‌లో 1.30లక్షల ఉద్యోగాలు.. వారికి 10శాతం రిజర్వేషన్‌!

సీఆర్‌పీఎఫ్‌లో భారీగా కానిస్టేబుల్‌ (జనరల్‌ డ్యూటీ) ఉద్యోగాల భర్తీ కోసం కేంద్ర హోంశాఖ గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

Updated : 10 Apr 2023 12:52 IST

దిల్లీ: నిరుద్యోగులకు శుభవార్త..!  సీఆర్‌పీఎఫ్‌(CRPF)లో భారీగా కానిస్టేబుల్‌ (జనరల్‌ డ్యూటీ) ఉద్యోగాల భర్తీకి కేంద్రం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. దాదాపు ౧.౩౦లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని నిర్ణయిస్తూ కేంద్ర హోంశాఖ(Union Home ministry) గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ ఉద్యోగ ఖాళీల్లో మాజీ అగ్నివీరులకు 10శాతం రిజర్వేషన్‌ కల్పించనున్నట్టు కేంద్రం వెల్లడించింది. కేంద్ర హోంశాఖ విడుదల చేసిన గెజిట్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం మొత్తం 1,29,929 ఉద్యోగాల్లో 1,25,262 పోస్టులకు పురుష అభ్యర్థులు, 4, 667 పోస్టులకు మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల వయస్సు 18 నుంచి 23 ఏళ్ల లోపు ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్ల పాటు వయో సడలింపు ఉంటుంది.అదే ఓబీసీలకు మూడేళ్ల పాటు సడలింపు ఇచ్చారు. 

ఈ ఉద్యోగాలకు వేతన శ్రేణిని రూ.౨౧,౭౦౦ నుంచి ౬౯,౧౦౦గా నిర్ణయించారు. పదవీ విరమణ విరమణ వయస్సును ౬౦ ఏళ్లు. కానిస్టేబుల్‌ (జనరల్‌ డ్యూటీ) ఉద్యోగాల్లో ౧౦శాతం ఉద్యోగాలను మాజీ అగ్నివీరులకు కేటాయిస్తూ నోటిఫికేషన్‌లో కేంద్ర హోంశాఖ పేర్కొంది. అభ్యర్థులు మెట్రిక్యులేషన్‌ లేదా తత్సమాన విద్యార్హతలు కలిగి ఉండాలి. ఫిజికల్‌ ఎఫిషియెన్సీ పరీక్షతో పాటు రాత పరీక్ష, మెడికల్‌ టెస్ట్‌లో అర్హత సాధించాల్సి ఉంటుంది. మాజీ అగ్నివీరులకు ఫిజికల్‌ ఎఫిషియెన్సీ పరీక్ష నుంచి మినహాయింపు కల్పించారు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు రెండేళ్ల పాటు ప్రొబేషన్‌ ఉంటుంది. అయితే, ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తుల ప్రక్రియకు సంబంధించిన తేదీలను మాత్రం గెజిట్‌ నోటిఫికేషన్‌లో పేర్కొనలేదు. ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన ఎస్‌ఎస్‌సీ/సీఆర్‌పీఎఫ్‌ పూర్తిస్థాయి నోటిఫికేషన్‌ విడుదల చేసే అవకాశం ఉంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని