అమ్మాయి మాతో మాట్లాడదా?

మా అమ్మాయికి మూడేళ్లు. తను రెండేళ్ల వయసులో ఉన్నప్పుడు మాటలు రావటం లేదని గమనించాం. యూట్యూబ్‌లో రైమ్స్‌ ఎక్కువగా చూసేది.

Updated : 14 Mar 2023 02:59 IST

సమస్య-సలహా

సమస్య: మా అమ్మాయికి మూడేళ్లు. తను రెండేళ్ల వయసులో ఉన్నప్పుడు మాటలు రావటం లేదని గమనించాం. యూట్యూబ్‌లో రైమ్స్‌ ఎక్కువగా చూసేది. వాటిని మాత్రమే రిపీట్‌ చేస్తుంది. మా మాటలకు స్పందించటం లేదు. పిలిచినా పలకదు. మా మాటలు అర్థం చేసుకోవటం లేదు. తనకు తాను అమ్మ, నాన్న అని పిలవలేదు. మేము చెప్పిస్తే అమ్మ, నాన్న అంటుంది. ఏదైనా కావాలన్నా వాటి దగ్గరికి మమ్మల్ని తీసుకెళ్లి ఏడుస్తుంది. ఎక్కువగా స్పర్శ కోరుకుంటుంది. శరీరాన్ని అంటిపెట్టుకోవటం, గరుకుగా ఉన్న చోట్ల తాకటం చేస్తుంటుంది. బయటకు తీసుకెళ్తే ఎలా పడితే అలా పరుగెడుతుంది. ఇసుకలో పుల్లలతో, రాళ్లతో ఆడుకుంటుంది. ఇది ఆటిజమేమోనని భయంగా ఉంది. కానీ పూర్తిగా ఆటిజం లక్షణాలు లేవు. స్పీచ్‌ థెరపీ, ఆక్యుపేషనల్‌ థెరపీ ఇప్పిస్తున్నాం. ఇతరత్రా డాక్టర్లకు చూపించలేదు. అమ్మాయి ఎప్పుడు మా మాటలు అర్థం చేసుకుంటుందో, తనకు కావాల్సింది మాకు అర్థమయ్యేలా ఎప్పుడు మాట్లాడుతుందో తెలియటం లేదు. తగు సలహా ఇవ్వగలరు.

డి. సురేశ్‌ (ఈమెయిల్‌)

సలహా: మీరు తెలిపిన లక్షణాలను బట్టి మీ అమ్మాయికి ఆటిజమ్‌ ఉండొచ్చని అనిపిస్తోంది. అలాగని వీటితోనే సమస్యను నిర్ణయించలేం. మీ అమ్మాయి మిగతా పిల్లలతో కలిసి ఆడుతుందో లేదో తెలియజేయలేదు. కానీ బయటకు తీసుకెళ్తే ఎలా పడితే అలా పరుగెడుతోందని, బాగానే ఆడుకుంటోందని చెబుతున్నారు. ఆటిజమ్‌ అందరిలో పూర్తిస్థాయిలో ఉండకపోవచ్చు. కొందరిలో కొన్ని లక్షణాలే కనిపిస్తుండొచ్చు. ఆటిజమ్‌ అనేది పలు లక్షణాలతో ముడిపడి ఉంటుంది. అందుకే ఆటిజమ్‌ స్పెక్ట్రమ్‌ డిజార్డర్‌ అని పిలుస్తుంటాం. ఆయా లక్షణాలు, ప్రవర్తన, మానసిక స్థితి వంటి అన్నింటినీ పరిశీలిస్తే గానీ కచ్చితంగా అంచనా వేయటం సాధ్యం కాదు. అందువల్ల మీరు అమ్మాయిని ముందుగా పిల్లల మానసిక నిపుణులకు చూపించటం మంచిది. లక్షణాలన్నింటినీ పరిశీలించి, మదింపు చేస్తారు. దీంతో ఆటిజమ్‌ ఉందో, లేదో తెలుస్తుంది. తర్వాతే తగు చికిత్స సాధ్యమవుతుంది. స్పర్శ కోరుకోవటం, శరీరాన్ని అంటిపెట్టుకోవటం, గరుకు చోట్లను తాకటం వంటి సెన్సరీ ఇంటిగ్రేషన్‌ సమస్యలు కూడా మీ అమ్మాయికి ఉన్నాయి. కాబట్టి వీటికీ చికిత్స అవసరం. చిన్న పిల్లలకు సాధారణంగా మందులు ఇవ్వరు. కొన్ని ఆహార నియమాలు, పోషకాల మందులతో మంచి ఫలితం కనిపిస్తుంది. ఏదేమైనా ఆటిజమ్‌ను తగ్గించటానికి మందులేవీ లేవని గుర్తుంచుకోవాలి. స్పీచ్‌, ఆక్యుపేషనల్‌, బిహేవియర్‌ థెరపీల వంటివే ఉపయోగపడతాయి. మీ అమ్మాయికి ఇప్పటికే స్పీచ్‌ థెరపీ, ఆక్యుపేషనల్‌ థెరపీ ఆరంభించారు. కాబట్టి పురోగతీ బాగానే ఉంటుంది. ఇలాంటి పిల్లలకు ఓపికగా చెప్పటం, అదేపనిగా సాధన చేయించటంతోనే పనులు అబ్బుతాయి. మూడేళ్ల వయసుకే మీరు నిరాశ పడాల్సిన పనిలేదు. చికిత్సలను అలాగే కొనసాగించాలి. మధ్యలో మానెయ్యొద్దు.

డా।। శ్రీలక్ష్మి పింగళి
ప్రొఫెసర్‌ ఆఫ్‌ సైకియాట్రీ


మీ ఆరోగ్య సమస్యలను, సందేహాలను మా ఈమెయిల్‌ sukhi@eenadu.in  కు పంపొచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని