ఉల్లాసంగా.. ఉత్సాహంగా

జీవితం ఎప్పుడూ ఒకేలా సాగదు. ఆటుపోట్లు సహజం. అనుకోని ఘటనలు జరిగినప్పుడో, ఇబ్బందులు ఎదురైనప్పుడో.. ఎప్పుడో అప్పుడు విచారం, బాధ కలగటం మామూలే.

Updated : 29 Aug 2023 05:41 IST

జీవితం ఎప్పుడూ ఒకేలా సాగదు. ఆటుపోట్లు సహజం. అనుకోని ఘటనలు జరిగినప్పుడో, ఇబ్బందులు ఎదురైనప్పుడో.. ఎప్పుడో అప్పుడు విచారం, బాధ కలగటం మామూలే. జరిగిందేదో జరిగిందిలే అని అనుకోవటం, పరిస్థితులను చక్కదిద్దుకోవటం వంటి వాటితో వీటి నుంచి బయటపడటమూ తెలిసిందే. కానీ అదేపనిగా ఆందోళన, విచారం వేధిస్తుంటే.. ఇంట్లో, ఆఫీసులో చిక్కులు కలిగిస్తుంటే మాత్రం డాక్టర్‌ను సంప్రదించాల్సిందే. అలాగే కొన్ని జాగ్రత్తలతోనూ వీటి నుంచి బయటపడొచ్చు.


మిత్రులను కలుసుకోవటం

దగ్గరలో సన్నిహిత మిత్రులెవరైనా ఉంటే, వెళ్లి కలుసుకోవటం ఉత్తమమైన మార్గం. వేరే ఊళ్లో ఉంటే ఫోన్‌ చేసి అయినా మాట్లాడొచ్చు. మన మేలు కోరేవారితో మనసు విప్పి మాట్లాడుకుంటే ఒత్తిడి చాలావరకు తగ్గుతుంది. ఉత్సాహం చేకూరుతుంది. ఇది రోగనిరోధక వ్యవస్థనూ బలోపేతం చేస్తున్నట్టు పరిశోధనలు చెబుతున్నాయి. ఫలితంగా జబ్బులూ దరిజేరవు. గుండెకూ మంచిదే.


సంగీతం వినటం

సంగీతం విన్నా, సాధన చేసినా మెదడు మీద ప్రభావం చూపుతుంది. గొంతు ఎలా ఉన్నా సరే. మనకు మనమే కూనిరాగం తీస్తుంటే మెదడు సహజ నొప్పి నివారకాలను విడుదల చేస్తుంది కూడా. మనసూ ఉత్తేజిత మవుతుంది.


ఇతరులకు సాయం

ఎవరికైనా సాయం చేసినప్పుడు, మంచి పనులు చేసినప్పుడు ఒంట్లో ఎండార్ఫిన్లనే హార్మోన్లు విడుదలవుతాయి. నొప్పి తగ్గటానికి తోడ్పడే ఇవి ఆత్మ విశ్వాసం, ఆనందం కలిగిస్తాయి కూడా. , ఇతరులతో అనుబంధం ఏర్పరచుకోవటానికీ దోహదం చేస్తాయి.


తగినంత నీరు

ఒంట్లో నీటిశాతం తగ్గినప్పుడు అలసట, చికాకు వంటివి తలెత్తటం తెలిసిందే. ఆలోచనలూ చురుకుగా సాగవు. కాబట్టి తగినంత నీరు తాగటం మంచిది. పండ్లు, కూరగాయలు తిన్నా మేలే. వీటిల్లోనూ నీరు ఉంటుంది.


వ్యాయామం మేలు

శరీరానికే కాదు, మనసుకూ వ్యాయామం ఎంతగానో మేలు చేస్తుంది. అలాగని మరీ చెమటలు కార్చాల్సిన పనిలేదు. కేవలం 10 నిమిషాల సేపు నడిచినా చాలు. వ్యాయామం చేసేవారు మానసిక ఒత్తిడిని బాగా అధిగమిస్తున్నట్టు, మంచి ఆరోగ్యంతో ఉంటున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. ఆరు బయట వ్యాయామాలు చేస్తే ఇంకా మంచిది. వెంట స్నేహితులుంటే ప్రయోజనం రెట్టింపూ అవుతుంది.


ధ్యానంతో ప్రశాంతం

ధ్యానం, ప్రాణాయామం మానసిక బలాన్ని పెంపొందిస్తాయి. ఏకాగ్రతతో, ఒకే విషయం మీద మనసు పెట్టి శ్వాస తీసుకుంటున్నప్పుడు చికాకు పరచే ఆలోచనలు దూరమవుతాయి. కాబట్టి విచారం, బాధ కలిగినప్పుడు కాసేపు ధ్యానం చేయటం ఉత్తమం. అప్పుడప్పుడు మనసు దారి మళ్లినా తిరిగి శ్వాస మీద దృష్టి కేంద్రీకరించటాన్ని సాధన చేయాలి. దీంతో మనసుకు ప్రశాంతత చేకూరుతుంది. మనసు ఉల్లాస భరితమవుతుంది.


చాక్లెట్‌ తీపి

నలుపురంగు చాక్లెట్‌లో మెదడుకు మరింత రక్తం సరఫరా కావటానికి తోడ్పడే వృక్ష రసాయనాలు ఉంటాయి. మెదడుకు తగినంత రక్తం అందితే ఆలోచనలూ సాఫీగా సాగుతాయి. కాబట్టి కాస్త డార్క్‌ చాక్లెట్‌ను నోట్లో వేసుకొని చప్పరించొచ్చు. అలాగని మరీ ఎక్కువగా తినొద్దు. ఇందులో కొవ్వు, కేలరీలూ ఉంటాయి. చిన్న డార్క్‌ చాక్లెట్‌ ముక్కలో 70% కన్నా ఎక్కువగా కెఫీన్‌ కూడా ఉంటుంది. ఇది మితిమీరితే నిద్రలేమి వంటి ఇబ్బందులు తలెత్తొచ్చు. అందువల్ల మితం పాటించాలి.


ఒకింత నవ్వు

నవ్వినప్పుడు కండరాల్లో ఒత్తిడి తగ్గుతుంది. వేగంగా గాలి తీసుకున్నప్పుడు గుండె, ఊపిరితిత్తులు ఉత్తేజితమవుతాయి కూడా. అంతేకాదు, నవ్వుతున్నప్పుడు నొప్పి, ఇన్‌ఫెక్షన్‌తో పోరాడే రసాయనాలూ మెదడులో ఉత్పత్తి అవుతాయి. కాబట్టి కామిక్స్‌ చదవటమో.. టీవీలోనో, ఆన్‌లైన్‌లోనో హాస్యభరిత, ఇష్టమైన సన్నివేశాలు చూడటమో చేయాలి.


పెంపుడు జంతువులతో కాలక్షేపం

పెంపుడు జంతువులను పెంచుకునేవారు కాసేపు వాటిని గుండెలకు హత్తుకొని చూడండి. దీంతో ఒంట్లో ఆక్సిటోసిన్‌ అనే హార్మోన్‌ విడుదలవుతుంది. ఇది మూడ్‌ను ఉత్సాహ భరితం చేస్తుంది. ఇతరులతో అనుబంధాలనూ ఇనుమడింపజేస్తుంది.


కాస్త అలా బయటకి

ఎప్పుడూ ఇంట్లోనే ఉండిపోకుండా అప్పుడప్పుడు అలా బయటకు వెళ్లి కాసేపు నడవటం ఎంతో మేలు చేస్తుంది. దీంతో రక్తపోటు, గుండె వేగం, కండరాల బిగువు, మానసిక ఒత్తిడి తగ్గుతాయి. బయటకు వెళ్లినప్పుడు పెంపుడు జంతువులను వెంట తీసుకెళ్లినా, వ్యాయామం చేసినా ఇంకా మంచి ఫలితం కనిపిస్తుంది. ఆఫీసులోనైతే బల్ల మీద చిన్న కుండీలో మొక్క పెట్టుకోవటం, ఆహ్లాదకరమైన దృశ్యాలను చూడటంతోనూ ఆందోళన, చిరాకు తగ్గుతాయి.


శృంగార బలం

శృంగారంతో గుండె, మెదడు ఆరోగ్యం పుంజుకుంటాయి. ఒత్తిడీ తగ్గుతుంది. జీవిత భాగస్వామితో ఆత్మీయ అనుబంధం మనసుకు కొత్త శక్తినీ ప్రసాదిస్తుంది. శృంగారంతో తలనొప్పి, పార్శ్వనొప్పి వంటివి తగ్గుముఖం
పడతాయి కూడా.


విశ్రాంతీ ముఖ్యమే

మానసిక వేదన నుంచి బయటపడటానికి విశ్రాంతి చాలా ముఖ్యం. కంటి నిండా.. రాత్రిపూట 7-9 గంటల సేపు నిద్ర పోయేలా చూసుకోవాలి. దీంతో ఆందోళన తగ్గుతుంది. ఉత్సాహం, ఏకాగ్రత పెరుగుతాయి. ఒకవేళ నిద్ర పట్టటానికి ఇబ్బంది పడుతుంటే పడకగది చీకటిగా, చల్లగా ఉండేలా చూసుకోవాలి. పడుకోవటానికి గంట ముందే టీవీ, కంప్యూటర్‌ వంటివి కట్టేయాలి. రోజూ ఒకే సమయానికి పడుకోవటం, లేవటం అలవాటు చేసుకోవాలి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు