సంతానానికి గింజ పప్పులు

సంతానలేని దంపతులను మానసిక ఒత్తిడి, కుంగుబాటు, ఆందోళనకు గురిచేస్తుంది. ఆత్మ విశ్వాసాన్నీ దెబ్బతీస్తుంది. సంతానలేమి సమస్య పెరిగిపోతున్న నేపథ్యంలో దీనిపై పరిశోధనలూ ఎక్కువగానే సాగుతున్నాయి

Published : 28 Nov 2023 02:08 IST

సంతానలేని దంపతులను మానసిక ఒత్తిడి, కుంగుబాటు, ఆందోళనకు గురిచేస్తుంది. ఆత్మ విశ్వాసాన్నీ దెబ్బతీస్తుంది. సంతానలేమి సమస్య పెరిగిపోతున్న నేపథ్యంలో దీనిపై పరిశోధనలూ ఎక్కువగానే సాగుతున్నాయి. ఆహారం వంటి మార్చుకోదగిన జీవనశైలి మార్పులపై దృష్టి సారిస్తున్నాయి. ఈ విషయంలో మోనాష్‌ యూనివర్సిటీ తాజా అధ్యయనం కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. బాదం, అక్రోట్ల వంటి గింజ పప్పులు (నట్స్‌) మగవారిలో వీర్యం నాణ్యత మెరుగు పడటానికి, ఫలితంగా సంతాన సామర్థ్యం పుంజుకోవటానికి తోడ్పడుతున్నట్టు తేలింది. రోజుకు రెండు గుప్పిళ్లు.. 60-75 గ్రాముల గింజపప్పులు తిన్నా మంచి ఫలితం కనిపిస్తుండటం విశేషం. మొత్తం నాలుగు అధ్యయనాలను సమీక్షించి దీన్ని గుర్తించారు. ఆహారంలో మిగతా మార్పులేవీ అవసరం లేకుండా కేవలం గింజపప్పులను జోడించుకున్నా చాలని పరిశోధకులు చెబుతున్నారు. వీటిల్లోని ఒమేగా-3 పాలీఅన్‌సాచ్యురేటెడ్‌ కొవ్వులు, పీచు పదార్థాలు, విటమిన్లు, ఖనిజాలు, వృక్ష రసాయనాలు పునరుత్పత్తి వ్యవస్థ ఆరోగ్యానికి దోహదం చేస్తున్నాయని వివరిస్తున్నారు. గింజపప్పులు తింటే లావెక్కుతామని చాలామంది భావిస్తుంటారు. నిజానికి నట్స్‌ తిననివారితో పోలిస్తే వీటిని రోజుకు ఒకట్రెండు గుప్పిళ్లు తినేవారు సన్నగా ఉంటున్నారని పరిశోధకులు అంటున్నారు. గింజపప్పుల్లో మోనోఅన్‌సాచ్యురేటెడ్‌ కొవ్వులు, యాంటీఆక్సిడెంట్లు, శరీరం తయారుచేసుకోలేని పోషకాలూ ఉంటాయని.. ఇవీ ఆరోగ్యానికి మేలు చేస్తాయని వివరిస్తున్నారు. అయితే ఉప్పు, చక్కెర కలిపినవి కాకుండా పచ్చి లేదా వేయించిన గింజపప్పులు తినటం మంచిదని సూచిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు