సంజీవని విద్య నేర్చుకుందాం!

 రోజులకు రోజులు గడిచిపోతున్నాయి. క్యాలెండర్లో పేజీలకు పేజీలే మారిపోతున్నాయి. చూస్తుండగానే ఏడాది గడచిపోతోంది. కొద్ది రోజుల్లోనే కొత్త సంవత్సరం పలకరించబోతోంది. నిజానికి మనకు ప్రతి రోజూ కొత్తదే. ప్రతిరోజూ పాఠాలు నేర్పేదే.

Updated : 26 Dec 2023 02:33 IST

ఈ ఏటి మేటి పాఠం

 రోజులకు రోజులు గడిచిపోతున్నాయి. క్యాలెండర్లో పేజీలకు పేజీలే మారిపోతున్నాయి. చూస్తుండగానే ఏడాది గడచిపోతోంది. కొద్ది రోజుల్లోనే కొత్త సంవత్సరం పలకరించబోతోంది. నిజానికి మనకు ప్రతి రోజూ కొత్తదే. ప్రతిరోజూ పాఠాలు నేర్పేదే. ఏం నేర్చుకున్నా, నేర్చుకోకపోయినా ఆరోగ్యం విషయంలో కార్డియాక్‌ పల్మనరీ రిసస్టేషన్‌ (సీపీఆర్‌) నేర్చుకోవటం తప్పనిసరని ఈ సంవత్సరం చెబుతోంది. వ్యాయామం చేస్తూనో, ఆటలాడుతూనో, డ్యాన్స్‌ చేస్తూనో ఎంతోమంది గుండె స్తంభించి, ఉన్నట్టుండి కుప్పకూలుతున్న ఉదంతాలు ఇటీవల ఎక్కువయ్యాయి మరి. పత్రికల్లో, టీవీల్లో, సామాజిక మాధ్యమాల్లో ఎక్కడ చూసినా ఇలాంటి ఘటనలే. గుండె స్తంభిస్తే ఆసుపత్రికి తీసుకెళ్లేంత వ్యవధేమీ ఉండదు. సత్వరం స్పందించకపోతే ప్రాణాలు నిలవటం కష్టం. కాబట్టి కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులు, సహోద్యోగులు..  ఆ మాటకొస్తే అందరూ సీపీఆర్‌ చేసే తీరును నేర్చుకొని ఉండటం ఎంతైనా అవసరం. మనకు మనం ఇచ్చుకునే కొత్త సంవత్సరం గొప్ప బహుమతి ఇదే.

నిలువెత్తు మనిషి ఉన్నట్టుండి కుప్పకూలి, స్పృహ తప్పితే? శ్వాస ఆడకపోతే? గుండె కొట్టుకోవటం ఆగిపోతే? ప్రాణాల మీద ఆశ వదులుకున్నట్టే. కానీ అలాంటి మనిషిని కూడా తిరిగి స్పృహలోకి తెప్పిస్తే? తిరిగి శ్వాస ఆడేలా, గుండె కొట్టుకునేలా చేస్తే? పైగా ఆ విద్య మన చేతిలోనే ఉంటే? అద్భుతం అనాల్సిందే. పోయే ప్రాణాలను నిలబెట్టే సంజీవనిగా భావించాల్సిందే. సీపీఆర్‌ అలాంటి ప్రక్రియే. ఇదో అత్యవసర ప్రాథమిక చికిత్స. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న ప్రాణాలను కాపాడుకోవటానికి తోడ్పడే గొప్ప విద్య. మనదేశంలో ఏటా సుమారు 5 లక్షల నుంచి 6 లక్షల మంది హఠాత్తుగా గుండె స్తంభించటం (సడెన్‌ కార్డియాక్‌ అరెస్ట్‌) మూలంగా మరణిస్తున్నారని ప్రఖ్యాత లాన్సెట్‌ పత్రిక పేర్కొంటోంది. వీరిలో చాలామంది 50 ఏళ్ల లోపు వారే కావటం గమనార్హం. గుండె స్తంభించినవారు హఠాత్తుగా కుప్పకూలుతుంటారు. చాలామంది దీన్ని గుండెపోటుగానూ భావిస్తుంటారు. ఇవి రెండూ వేర్వేరు సమస్యలు. గుండెపోటు సాధారణంగా ఛాతీనొప్పితో మొదలవుతుంది. ఆసుపత్రికి వెళ్లటానికి కాస్త సమయం ఉంటుంది. అదే గుండె స్తంభించటం ఉన్నట్టుండి ముంచుకొస్తుంది. ముందస్తు లక్షణాలేవీ ఉండవు. కొందరిలో కొన్ని హెచ్చరిక సంకేతాలు కనిపించినప్పటికీ కుప్పకూలేసరికే సమయం మించిపోతుంది. గుండె లయ అస్తవ్యస్తం కావటం దీనికి మూలం. కొన్నిసార్లు గుండెపోటు మూలంగానూ గుండె లయ దెబ్బతిని, గుండె హఠాత్తుగా ఆగిపోవచ్చు. గుండెపోటు బాధితుల్లో గంటలోపు ప్రాణాలు పోవటానికి ప్రధాన కారణం ఇదే. ఇక్కడే సీపీఆర్‌కు ప్రాధాన్యం పెరుగుతోంది. సత్వరం దీన్ని ఆరంభిస్తే చాలామందిని కాపాడుకోవచ్చు. ఈ విద్యను ప్రతి ఒక్కరూ నేర్చుకొని ఉంటే అత్యవసర సమయాల్లో ఆదుకోవచ్చు.


అతి శీఘ్రం, అత్యవసరం

గుండె హఠాత్తుగా ఆగినప్పుడు మెదడుకు, ఇతర కీలక అవయవాలకు రక్తం సరఫరా కాదు. దీంతో నిమిషాల్లోనే చనిపోయే ప్రమాదముంది. మూడు సెకండ్ల కన్నా ఎక్కువ సేపు మెదడుకు ఆక్సిజన్‌ అందకపోతే స్పృహ తప్పుతారు. వెంటనే సీపీఆర్‌ చేస్తే జీవించే అవకాశం రెండింతలు, మూడింతలు పెరుగుతుంది. వీలైనంత త్వరగా మెదడుకు రక్తం సరఫరా అయితే నాడీకణాలు దెబ్బతినటమూ తగ్గుతుంది.


పునరుజ్జీవ ప్రక్రియ

కొన్నిసార్లు శ్వాస ఆగిపోయినా, గుండె కొట్టుకుంటూ ఉండొచ్చు. నీటిలో మునిగిపోయినవారిలో ఇలాంటిది చూస్తుంటాం. నిల్వ ఉన్న ఆక్సిజన్‌ను వాడుకుంటూ గుండె కాసేపు నెట్టుకుంటూ వస్తుంది. మింగిన నీటిని బయటకు రప్పించి, నోట్లో నోరు పెట్టి గాలిని ఊదితే బతికి బట్టకట్టటం చూస్తూనే ఉంటాం. అయితే కార్డియాక్‌ అరెస్ట్‌లో గుండెతో పాటు ఊపిరితిత్తులూ పనిచేయటం మానేస్తాయి. ఇక్కడే సీపీఆర్‌ ఉపయోగపడుతుంది. ఛాతీ మీద చేత్తో బలంగా నొక్కటం, నోట్లో నోరు పెట్టి గాలిని ఊదటం ఇందులో కీలకాంశాలు. ఛాతీ మీద చేత్తో నొక్కినప్పుడు గుండె రక్తాన్ని పంప్‌ చేస్తుంది. నోటి నుంచి గాలిని ఊదినప్పుడు శ్వాస అందుతుంది. ఇలా ఒకేసారి గుండె, ఊపిరితిత్తులు రెండింటికీ పునరుజ్జీవం కల్పిస్తుంది. చాలావరకు గుండెలోని విద్యుత్‌ వ్యవస్థలు గాడి తప్పటం వల్లనే సడెన్‌ కార్డియాక్‌ అరెస్ట్‌ వస్తుంది. గుండెలో ఏవీ నోడ్‌, ఎస్‌వీ నోడ్‌, హిస్‌పర్కంజీ వ్యవస్థలు విద్యుత్తు ఉత్పత్తి, ప్రసరణకు మూలం. ఎస్‌వీ నోడ్‌ ఆగిపోతే మెదడుకు ఆక్సిజన్‌ అందక, వెంటనే స్పృహ తప్పుతారు. వీరికి కొద్ది నిమిషాల సేపు సీపీఆర్‌ చేస్తే ఏవీ నోడ్‌, పర్కంజీ వ్యవస్థలు ఉత్తేజితమవుతాయి. ఏవైనా గుండె లయ సమస్యలున్నా కుదురుకుంటాయి. గుండె తిరిగి కొట్టుకోవటం మొదలవుతుంది. అంత సమర్థంగా కాకపోయినా ఎంతోకొంత రక్తాన్ని పంప్‌ చేస్తుంటుంది. గుండె తనంత తాను కొట్టుకోకపోయినా కూడా చేత్తో ఛాతీని నొక్కటం వల్ల గుండెలోంచి రక్తం పంప్‌ అవుతుంది. దీంతో మెదడుకు ఆక్సిజన్‌ అందుతుంది. స్పృహలోకి రావటానికి వీలు కల్పిస్తుంది. నోటితో గాలిని ఊదితే కృత్రిమ శ్వాస కల్పించినట్టూ అవుతుంది. ఇది మరింత త్వరగా కోలుకోవటానికి తోడ్పడుతుంది. ఎవరిలోనైనా గుండె తిరిగి కొట్టుకోకపోయినప్పటికీ అంబులెన్స్‌ వచ్చేంతవరకు ప్రాణాలైనా నిలుస్తాయి. అంబులెన్స్‌లో గుండెకు షాక్‌ ఇచ్చే డిఫిబ్రిలేటర్లు, కృత్రిమ శ్వాస కల్పించే యాంబూబ్యాగ్‌, అత్యవసర మందులు ఉంటాయి. వీటితో చికిత్స చేస్తే పూర్తి స్థాయిలో కోలుకోవటానికి అవకాశముంటుంది. అంతవరకూ ప్రాణాలు నిలబటానికి సీపీఆర్‌ తోడ్పడుతుంది.
కొన్నిసార్లు ఆసుపత్రుల్లోనూ అత్యవసరానికి డిఫిబ్రిలేటర్లు అందుబాటులో ఉండకపోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లోనూ సీపీఆర్‌ ఉపయోగపడుతుంది. కొందరికి విద్యుత్‌ వ్యవస్థ కుదురుకున్నా పంపింగ్‌ అంత బాగా జరగకపోవచ్చు. వీరికి కూడా పంపింగ్‌ సామర్థ్యం కుదురుకునేంతవరకు సీపీఆర్‌ చేస్తుంటారు.


పద్ధతిగా శిక్షణ

సీపీఆర్‌ను పద్ధతి ప్రకారం చేస్తేనే సమర్థంగా పనిచేస్తుంది. గుండె మామూలుగా 60, 70 సార్లు కొట్టుకుంటుంది కదా. ఛాతీని కూడా అంతే వేగంతో నొక్కాల్సి ఉంటుంది. సీపీఆర్‌ చేసేటప్పుడు సాధారణంగా నిమిషానికి 100 నుంచి 120 సార్లు వేగంగా నొక్కుతుంటారు. అయితే మరీ బలంగా నొక్కితే పక్కటెముక విరిగే ప్రమాదముంది. అందుకే వైద్య సిబ్బందికి మనిషి బొమ్మతో శిక్షణ ఇస్తుంటారు. ఇప్పుడు ప్రజలకూ చాలాచోట్ల సీపీఆర్‌ శిక్షణ ఇస్తున్నారు. ప్రభుత్వం కూడా దీని కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టింది. దీన్ని పద్ధతిగా నేర్చుకుంటే అత్యవసర సమయాల్లో ఉపయోగపడుతుంది. ఒకరి ప్రాణం కాపాడినా జీవితం సార్థకమవుతుంది.


ఎలా చేయాలి?

ఎవరైనా ఉన్నట్టుండి స్పృహ తప్పి, కూలిపోతే ముందుగా చుట్టుపక్కల ప్రమాదకర పరిస్థితులున్నాయేమో పరిశీలించాలి. వాహనాలు దూసుకొచ్చే అవకాశముంటే తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరైనా ఉన్నట్టుండి కుప్పకూలితే ముక్కు దగ్గర చేతి వేళ్లు పెట్టి గమనించాలి. దీంతో శ్వాస ఆడుతుందో లేదో తెలుస్తుంది. మణికట్టు దగ్గర వేళ్లతో తాకి  నాడిని గుర్తించొచ్చు.


1. అంబులెన్స్‌కు ఫోన్‌
స్పృహ తప్పినవారి భుజం తట్టి ‘ఏమైంది? ఎలా ఉన్నారు?’ అని గట్టిగా అడగాలి. ఏమాత్రం స్పందించకపోతే అంబులెన్స్‌కు (108) ఫోన్‌ చేయాలి. పక్కనున్నవారినైనా ఫోన్‌ చేయమని చెప్పాలి.


2. వెల్లకిలా పడుకోబెట్టటం

స్పృహ తప్పినవారిని జాగ్రత్తగా వెల్లకిలా పడుకోబెట్టాలి. వారి ఛాతీ పక్కన కూర్చోవాలి. చుబుకాన్ని కాస్త పైకెత్తి, నోటిని తెరవాలి. లోపల ఆహారం, వాంతి వంటివేమైనా అడ్డుగా ఉన్నాయేమో గమనించాలి. అలాంటివేవైనా కనిపిస్తే, అవి వదులుగా ఉంటే బయటకు తీయాలి. వదులుగా లేకపోతే బయటకు తీసే ప్రయత్నంలో మరింత లోపలికి వెళ్లే ప్రమాదముంది.


3. శ్వాస పరిశీలన

ముక్కు ముందు వేళ్లు పెట్టి చూడాలి. నోటి వద్ద కాసేపు చెవి ఆనించి వినాలి. శ్వాస తీసుకుంటుంటే వీటితో తెలుస్తుంది. శ్వాస ఆడకపోతే సీపీఆర్‌ ఆరంభించాలి. ఒకవేళ శ్వాస తీసుకుంటున్నట్టయితే సీపీఆర్‌ చేయొద్దు.


4. ఛాతీ మీద నొక్కటం

ఒక చేతి వేళ్లను మరో చేతి వేళ్ల మధ్యలోకి జొనిపి, కింది చేయి అరచేయిని స్పృహ తప్పినవారి ఛాతీ మీద మధ్యలో (రొమ్ములకు కాస్త కిందుగా) ఆనించాలి. మోచేతులను వంచకుండా కిందికి కనీసం 2 అంగుళాల లోతు వరకు నొక్కి, ఆ వెంటనే సడలించాలి. ఇలా వేగంగా నిమిషానికి కనీసం 100 సార్లు ఛాతీని నొక్కాలి. కిందికి నొక్కి, సడలించినప్పుడు ఛాతీ పైకి లేచేలా చూసుకోవాలి. (పిల్లలకైతే ఒక చేత్తోనే నొక్కాలి. శిశువులకైతే చూపుడు, మధ్యవేలితో నొక్కాలి. శిశువులకు 1.5 అంగుళాల లోతు వరకే నొక్కాలి)


5. నోటితో శ్వాస

గొంతులో ఏదీ అడ్డులేదని నిర్ధరించుకోవాలి. చుబుకాన్ని కాస్త పైకెత్తి, తలను వెనక్కి వంచాలి. ముక్కును పట్టుకొని, నోట్లో నోరు పెట్టి బలంగా గాలిని లోపలికి ఊదాలి. దీంతో ఛాతీ పైకి ఉబుకుతుంది. 30 సార్లు ఛాతీని నొక్కిన తర్వాత రెండు సార్లు నోటితో గాలిని ఊదాలి. సాయం చేయటానికి ఇద్దరు వ్యక్తులు అందుబాటులో ఉన్నట్టయితే ఒకరు ఛాతీని నొక్కటం, మరొకరు నోటితో గాలిని ఊదటం మంచిది. ఒకవేళ రెండుసార్లు గాలిని ఊదినా ఛాతీ పైకి లేవకపోతే గొంతులో ఏదో అడ్డుపడి ఉండొచ్చని భావించాలి. కేవలం ఛాతీని నొక్కినా ఫలితం కనిపించొచ్చు గానీ నోటితో గాలిని లోపలికి ఊదితే మరింత ఎక్కువ ప్రయోజనముంటుంది.


6. అలాగే కొనసాగించాలి

స్పృహ తప్పినవారు శ్వాస తీసుకోవటం ఆరంభించేంతవరకు లేదా అంబులెన్స్‌ వచ్చేంతవరకు 30 సార్లు ఛాతీని నొక్కి, రెండు సార్లు నోటితో గాలిని ఊదటం కొనసాగించాలి.  


డిఫిబ్రిలేటర్లతోనూ..

ప్రస్తుతం విమానాశ్రయాలు, సినిమా థియేటర్ల వంటి చోట్ల ఆటోమేటెడ్‌ ఎక్స్‌టర్నల్‌ డీఫిబ్రిలేటర్లు (ఏఈడీస్‌) అందుబాటులో ఉంచుతున్నారు. ఇవి షాక్‌ ఇవ్వటం ద్వారా గుండె తిరిగి కొట్టుకునేలా చేస్తాయి. అందుబాటులో ఉంటే వీటిని వాడు కోవచ్చు. డీఫిబ్రిలేటర్లను వాడే విధానం వాటిపై రాసి ఉంటుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని