ఆరోగ్య వైభోగమే

కొత్త సంవత్సరం. కొత్త ఆశలు, కొత్త ఆశయాలు. పడుచు వారి దగ్గరి నుంచి పండు ముదుసలి వరకూ అందరికీ ఒకటే కోరిక. ఆరోగ్యంగా, ఆనందంగా, హాయిగా జీవించాలనే. కాస్త జాగరూకతతో వ్యవహరిస్తే ఇదేమంత కష్టమైంది కాదు

Updated : 02 Jan 2024 07:22 IST

కొత్త సంవత్సరం. కొత్త ఆశలు, కొత్త ఆశయాలు. పడుచు వారి దగ్గరి నుంచి పండు ముదుసలి వరకూ అందరికీ ఒకటే కోరిక. ఆరోగ్యంగా, ఆనందంగా, హాయిగా జీవించాలనే. కాస్త జాగరూకతతో వ్యవహరిస్తే ఇదేమంత కష్టమైంది కాదు. చిన్న వయసులో గుండెపోటు బారినపడకుండా కాపాడుకోవచ్చు. వృద్ధాప్యంలో బాధలు పడకుండా చూసుకోవచ్చు. తీసుకున్న నిర్ణయాలను కచ్చితంగా సాధించొచ్చు. వీటి కోసం నిపుణులు సూచిస్తున్న మార్గాలివీ.

మలి బాల్యం మంచిగ

వృద్ధాప్యం మలి బాల్యం! పిల్లల మాదిరిగానే వృద్ధులూ కోమలమే. కుటుంబ సభ్యులు వీరినీ కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిందే. వయసు మీరినవారు కూడా తమను తాము కాపాడుకోవటానికి విధిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. కొత్త సంవత్సరంలోకి అడుగిడిన వేళ వీటి గురించి అవగాహన కలిగుండటం మంచిది. కొన్ని తెలిసిన సంగతులే కావొచ్చు. కానీ ఆచరణలో పెట్టటం ముఖ్యం.

ప్రస్తుతం 65 ఏళ్లు పైబడ్డవారిని వృద్ధులుగా పరిగణిస్తున్నారు. వీరిని వృద్ధులు అనటం కన్నా వయసు పైబడ్డవారని అనటమే సమంజసం. వృద్ధాప్యాన్ని మూడు రకాలుగా భావిస్తారు. 1. పుట్టిన రోజు దగ్గరి నుంచి ఏళ్లు లెక్కపెట్టటం (క్రోనొలాజికల్‌ ఏజ్‌). 2. శరీరంలో మార్పులను బట్టి (బయాలాజికల్‌ ఏజ్‌).    3. మానసిక పరిణామాలను బట్టి (సైకలాజికల్‌ ఏజ్‌). ఆహార లభ్యత, ఆరోగ్య విషయాలపై అవగాహన, చిన్నప్పటి నుంచి వ్యాధి నిరోధక టీకాలు వేయించుకోవటం, జబ్బులను నివారించే మంచి మందులు అందుబాటులోకి రావటం, ఆర్థిక స్థితిగతులు కొంతవరకు మెరుగుపడటం వంటి వాటి మూలంగా మనదేశంలో జీవనకాలం గణనీయంగా పెరిగింది. ఇప్పుడు మనదేశ జనాభాలో 10% మంది వృద్ధులని, మరో 20 ఏళ్లలో వీరి సంఖ్య 20 శాతానికి ఎగబాకుతుందని అంచనా. కాబట్టి వయసు మీరిన వారి ఆరోగ్య సంరక్షణ రోజురోజుకీ ప్రాధాన్యం సంతరించుకుంటోంది. వయసు మళ్లినవారిలో సహజంగానే కొన్ని శారీరక మార్పులు వస్తాయి. చర్మం ముడతలు పడటం, వినికిడి తగ్గటం, చూపు మందగించటం, కండరాల బలహీనత, మెడ నరముల నొప్పి, నడుం నొప్పి, కీళ్ల నొప్పులు, మతిమరుపు, ఆందోళన, అలజడి, నిద్రపట్టక పోవటం, అలసట, నీరసం, ఆయాసం, నడకలో తూలటం, కింద పడటం వంటివి కనిపిస్తుంటాయి. వీటికి తోడు అధిక రక్తపోటు, మధుమేహం సరేసరి. కుంగుబాటు (డిప్రెషన్‌) మరో పెద్ద సమస్య. ముందు నుంచీ జాగ్రత్తగా లేకపోతే ఆర్థిక సమస్యలూ వేధిస్తాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండటం తప్పనిసరి.

ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవటం అన్నింటికన్నా ముఖ్యం. చూపు, వినికిడి తగ్గటాన్ని చిన్న సమస్యలనుకోవద్దు. అవసరాన్ని బట్టి కళ్లజోడు, వినికిడి సాధనం వాడుకోవాలి. చూపు సరిగా లేకపోతే రోడ్డు మీద నడుస్తున్నప్పుడు గుంతలు, అడ్డుగా ఉన్న వస్తువులు కనిపించక కాలికి తగలొచ్చు. కింద పడితే ఎముకలు విరగొచ్చు. రాత్రివేళ పడకగదిలో చిన్న లైటు వెలిగించి ఉంచుకోవాలి. లేకపోతే మంచం కోడు కొట్టుకొని కింద పడిపోవచ్చు.
కండరాలు బలహీనం కావటం వల్ల బ్యాలెన్స్‌ తప్పొచ్చు, తూలిపోవచ్చు. కాబట్టి నడిచేటప్పుడు.. ముఖ్యంగా రోడ్డు మీద నడిచేటప్పుడు చేతికర్ర వాడుకోవాలి. మొహమాటానికి పోవద్దు. ఎవరైనా చేయూతనిస్తే అందిపుచ్చుకోవటం శ్రేయస్కరం. కండరాలు బలహీనం కాకుండా చూసుకోవటానికి, కొంత శక్తి పుంజుకోవటానికి వ్యాయామం.. ముఖ్యంగా నడక తప్పనిసరి. రోజుకి అరగంట చొప్పున (ఉదయం 15 నిమిషాలు, సాయంత్రం 15 నిమిషాలు) నడవాలి. కనీసం 3వేల నుంచి 4వేల అడుగులేయాలి.
 పొద్దున నిద్రలేవగానే మంచం మీది నుంచి వెంటనే లేచి నిల్చోవద్దు. ఇది చాలా ముఖ్యమైన విషయం. రాత్రంతా పడుకొని, ఉదయం ఒక్కసారే లేచి నిలబడితే శరీరంలోని రక్తమంతా కాళ్లలోకి, పొట్టలోని రక్తనాళాల్లోకి చేరుకుంటుంది. అప్పుడు మెదడుకు తగినంత రక్త ప్రసరణ జరగక స్పృహ తప్పి పడిపోవచ్చు. కాబట్టి మెలకువ రాగానే ఒక నిమిషం అలాగే ఉండి, ఒక పక్కకి తిరిగి లేవాలి. నిటారుగా లేస్తే వెన్నుపూసలకు ప్రమాదం రావొచ్చు. ఆ తర్వాత మంచం మీద ఒకట్రెండు నిమిషాలు అలాగే కూర్చొని, అప్పుడు గోడ పట్టుకొని గానీ మంచాన్ని ఆనుకొని గానీ నిల్చోవాలి. ఒక నిమిషం తర్వాత యథావిధిగా పనులు చేసుకోవచ్చు.

 •  నలుగురితో కలవాలి, మాట్లాడాలి. దీంతో మానసిక ఉల్లాసం, ఉత్సాహం కలుగుతాయి. ఈ రోజుల్లో చాలావరకు చిన్న చిన్న కుటుంబాలే. భార్యాభర్తలు ఉద్యోగానికి, పిల్లలు బడికి వెళ్తారు. ఇంట్లో మాట్లాడటానికి ఎవరూ ఉండరు. కాబట్టి వృద్ధులు తమ వయసువారిని కలుపుకొని, ఒకచోట చేరి మాట్లాడుకోవాలి. అపార్ట్‌మెంట్లలో నివసించేవారు ప్లేయింగ్‌ ఏరియాను దీనికోసం ఎంచుకోవాలి. ఒంటరితనాన్ని పోగొట్టుకోవటానికి పుస్తకాలు, పత్రికలు చదవాలి. టీవీలో ఆధ్యాత్మిక, ప్రవచన కార్యక్రమాలు చూడాలి.
 •  మరో ఇబ్బందికరమైన విషయం- పక్క తడపటం, బట్టల్లో మూత్రం పోయటం. కాబట్టి డైపర్‌ ధరించాలి. ఇది ఖరీదనుకుంటే పాత తువ్వాలును గోచీలాగా వాడుకోవచ్చు.
 •  వృద్ధాప్యంలో నిద్ర అవసరం తక్కువని అనుకోవద్దు. ఎవరికైనా రాత్రిపూట 6-8 గంటల నిద్ర కావాలి. రోజూ ఒకే సమయానికి నిద్ర పోవటం, నిద్ర లేవటం అలవాటు చేసుకోవాలి. దీంతో సరిగా నిద్రపట్టే అవకాశముంటుంది.
 •  వృద్ధాప్యంలో చాలామంది చేసే పొరపాటు వేళకు మందులు వేసుకోకపోవటం. వీటిని ఉదయం, మధ్యాహ్నం, రాత్రి.. ఇలా వేర్వేరుగా పెట్టుకుంటే సమయానికి వేసుకోవటానికి వీలుంటుంది. సొంత వైద్యం అసలే వద్దు. తమకు తామే మోతాదు తగ్గించటం, పెంచటం చేయొద్దు.
 •  ఎక్కడికీ ఒంటరిగా వెళ్లొద్దు. ఎవరో ఒకరు వెంట ఉండేలా చూసుకోవాలి. చీకటి పడిన తర్వాత ఎక్కడికీ వెళ్లొద్దు. చిరునామా, ఫోన్‌ నంబరు, కుటుంబ సభ్యులు, బంధువుల పేర్లు, వారి చిరునామాలను రెండు కాగితాల మీద రాసుకొని ఒకటి జేబులో, మరోటి పర్సులో పెట్టుకోవాలి.
 • నాలుగు ‘ఎ’లను (అడ్జస్ట్‌, అడాప్ట్‌, అకామడేట్‌, ఆక్సెప్ట్‌) అనుసరించాలి. అంటే సర్దుకుపోవటం, అనుకూలంగా ఉండటం, పరిస్థితులను అంగీకరించటం వంటివి అలవాటు చేసుకోవాలన్నమాట. అందరితో సఖ్యతగా ఉండాలి. ఇతరుల విషయాలలో అనవసరంగా తలదూర్చొద్దు. అడిగితే తప్ప సలహాలేవీ ఇవ్వద్దు. ప్రశాంతంగా, ఆనందంగా జీవితాన్ని గడపాలి.

గుండె పదిలం!

యువతే దేశానికి గుండె కాయ. యువత బలంగా ఉంటేనే అభవృద్ధి సాధ్యం. ఇంతటి కీలకమైన యువ గుండెకిప్పుడు పెద్ద దెబ్బే తగులుతోంది. ఎంతోమంది 30, 40 ఏళ్లలోనే గుండెపోటుకు గురవుతుండటం ఆందోళనకరం. జన్యువులకు తోడు జీవనశైలి మారటం అగ్నికి ఆజ్యం పోస్తోంది. లక్షణాలను గుర్తించలేకపోటం, ఇతర జబ్బులుగా పొరపడటమూ పరిస్థితి విషమించేలా చేస్తున్నాయి. కొత్త సంవత్సరంలోనైనా కాస్త కళ్లు తెరచి, గుండెను పదిలంగా కాపాడుకుందాం.

చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం? గుండెజబ్బు విషయంలో ఇది ముమ్మాటికీ నిజం. సమస్య మొదలయ్యాక బాధపడటం కన్నా ముందే నివారించుకోవటం ముఖ్యం. ముప్పు కారకాలను ముందే గుర్తించటం, జబ్బును ఆరంభంలోనే పసిగట్టటం కూడా కీలకమే. అత్యవసర చికిత్సలు అందుబాటులో ఉన్నా కూడా తొలిదశలో గుర్తించలేకపోవటం మూలంగానే మరణాలు సంభవిస్తున్నట్టు అభివృద్ధి చెందిన దేశాల అనుభవాలు సూచిస్తున్నాయి. ఇతరత్రా సమస్యలుగా భావించి ఆలస్యం చేయటం, అంబులెన్స్‌కు ఫోన్‌ చేయకపోవటం వంటివి ప్రాణాల మీదికి తెస్తున్నాయి. ఎవరికివారు తొలిదశలోనే అనుమానించి, జబ్బును గుర్తించటం ముఖ్యమనే విషయాన్ని ఇవి చెప్పకనే చెబుతున్నాయి. కాబట్టి తెలివిగా వ్యవహరించటం అత్యావశ్యకం.

 • చాలామంది ఆయాసం వంటి లక్షణాలేవీ లేవు కదా, గుండెజబ్బు ఎందుకొస్తుందని భావిస్తుంటారు. ఇది తప్పు. అందరిలోనూ గుండెజబ్బు లక్షణాలు ఉండకపోవచ్చు. ఒకవేళ ఉన్నా అంత తీవ్రంగా ఉండక పోవచ్చు. గుండెజబ్బు లక్షణాలు శారీరక శ్రమ తీవ్రత మీదా ఆధారపడి ఉంటాయి. ఇప్పుడు చాలామంది అంతగా శ్రమలేని ఉద్యోగాలే చేస్తున్నారు. దీని మూలంగా స్వల్ప స్థాయి లక్షణాలు గుర్తించలేకపోతున్నారు. ముఖ్యంగా మధుమేహం గలవారిలో వ్యాయామం, శారీరక శ్రమ చేస్తున్నప్పుడు లక్షణాలు పెద్దగా కనిపించకపోవచ్చు. కాబట్టి డాక్టర్‌ను సంప్రదించకుండా, తమకు తామే అంతా బాగుందని అనుకోవటం తగదు.
 • గుండెపోటును ఇతరత్రా సమస్యలుగా పొరపడటమూ తీవ్రతకు కారణమవుతోంది. గుండెనొప్పి అనగానే ఛాతీ మధ్యలో గట్టిగా చేత్తో బిగపట్టి, విలవిల్లాడే దృశ్యమే గుర్తుకొస్తుంది. నిజానికి గుండెనొప్పి ఒక్క ఛాతీలోనే రావాలనేమీ లేదు. కింది దవడ దగ్గరి నుంచి బొడ్డు వరకు ఎక్కడైనా రావొచ్చు. నొప్పి అంత తీవ్రంగానూ ఉండకపోవచ్చు. ఇది తెలియకపోవటం వల్ల చాలామంది ఛాతీమంట, మెడనొప్పి, కండరాల నొప్పిగా పొరపడుతుంటారు. దంత, ఎముక, జీర్ణకోశ నిపుణులను సంప్రదిస్తుంటారు. దీంతో సమస్యను గుర్తించేసరికే ఆలస్యమైపోతుంది. కొద్దిపాటి పనిచేసినా తీవ్రంగా అలసిపోతున్నా.. నీరసం, ఆయాసం వస్తున్నా.. తల తేలిపోతున్నట్టు, కళ్లు తిరుగుతున్నట్టు అనిపిస్తున్నా.. మరీ వేగంగా గుండె కొట్టుకుంటున్నా తేలికగా తీసుకోవద్దు. ముఖ్యంగా పనిచేస్తున్నప్పుడో, వ్యాయామం చేస్తున్నప్పుడో, మెట్లు ఎక్కుతున్నప్పుడో అంతకుముందు లేకుండా కొత్తగా ఇలాంటి లక్షణాలు కనిపిస్తే అసలే తాత్సారం చేయొద్దు. తమకు తామే ఏవేవో కారణాలను ఆపాదించుకోవద్దు. ఒకసారి డాక్టర్‌ను సంప్రదించి, పరీక్ష చేయించుకోవాలి.
 • అధిక రక్తపోటు, మధుమేహం, అధిక కొలెస్ట్రాల్‌ వంటివన్నీ గుండెజబ్బు ముప్పును తెచ్చిపెట్టేవే. ఇలాంటి ముప్పు కారకాలను ముందే గుర్తించి, జాగ్రత్త పడటం చాలా ముఖ్యం. చిత్రమేంటంటే- వీటిల్లో లక్షణాలేవీ ఉండకపోవటం. పరీక్షించుకుంటే తప్ప సమస్య ఉందన్న విషయమే తెలియదు. కాబట్టి వయసును బట్టి అప్పుడప్పుడు డాక్టర్‌ను సంప్రదించి అవసరమైన పరీక్షలు చేయించుకోవాలి. వీటి కోసం ఖర్చు చేయటం దుబారా అనుకోవద్దు. వాహనాలను సర్వీసింగ్‌కు ఇచ్చినట్టుగానే ఆరోగ్య పరీక్షలూ చేయించు కోవాలి. చిన్నవయసులోనైతే.. అంటే 30, 35 ఏళ్ల వారు ఐదేళ్లకోసారి, వయసు మీద పడినవారు ఏడాదికోసారి పరీక్షించుకుంటే సరిపోతుంది. ఏవైనా సమస్యలున్నట్టు తేలితే తగు చికిత్స తీసుకోవాలి. రక్తపోటు, గ్లూకోజు, కొలెస్ట్రాల్‌ అదుపులో ఉంచుకుంటే గుండెను చాలావరకు కాపాడుకోవచ్చు. ఆయాసం వంటివి ఉన్నప్పుడు ఈసీజీ, ఎకో, ట్రెడ్‌మిల్‌ పరీక్షలు చేయించుకుంటే గుండెజబ్బు ఆనవాళ్లు ముందే బయటపడతాయి. తగు మందులతో జబ్బు ముదరకుండా, హఠాత్తుగా ప్రాణాల మీదికి రాకుండా చూసుకోవచ్చు. అలాగే అధిక బరువుంటే నియంత్రణలో ఉంచుకోవాలి. పొగతాగే అలవాటుంటే మానెయ్యాలి. సుమారు 30% గుండెపోటు కేసులకు పొగ అలవాటే కారణమవుతోంది మరి. మద్యం తాగేవారు పరిమితం చేసుకోవాలి. ఈ అలవాటు లేనివారైతే దాని జోలికి వెళ్లొద్దు.
 • కాలుష్యం బారినపడకుండా చూసుకోవటమూ ముఖ్యమే. సిగరెట్లు కాల్చే అలవాటు లేనివారిలోనూ కాలుష్యం మూలంగా రోజుకు 10 సిగరెట్లు తాగేవారితో సమానంగా గుండెజబ్బు ముప్పు పొంచి ఉంటున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి.
 •  ఆరోగ్యకరమైన జీవనశైలి లేనివారిలో ఒక ముప్పు కారకం మరిన్ని ముప్పు కారకాలకు దారితీస్తుందనే విషయాన్నీ గుర్తించాలి. ఉదాహరణకు- శారీరక శ్రమ తగ్గితే బరువు పెరుగుతుంది. దీంతో కొలెస్ట్రాల్‌, గ్లూకోజు, రక్తపోటు కూడా ఎక్కువవుతాయి. ఉప్పు, కొవ్వు, తీపి పదార్థాలు ఎక్కువగా తినటమూ వీటికి దారితీస్తుంది.
 • ఇటీవల కొందరు వ్యాయామం చేస్తూ హఠాత్తుగా కుప్పకూలటం చూస్తున్నాం. దీంతో వ్యాయామంతో గుండెపోటు వస్తుందనే భావన పెరిగింది. ఇది నిజం కాదు. అప్పటికే గుండెజబ్బులుంటే వ్యాయామం చేస్తున్నప్పుడే కాదు.. ఏ క్షణంలోనైనా బయటపడొచ్చు. ఇలాంటివారు తమకు జబ్బున్న విషయం తెలియకుండా ఎక్కువగా శ్రమ చేస్తే ఒంట్లో కాటకోలమైన్స్‌ విడుదలయ్యి, గుండెపోటుకు దారితీయొచ్చు. అంతే తప్ప వ్యాయామం చేస్తే గుండెపోటు వస్తుందనుకోవటానికి లేదు. అంతకుముందు పెద్దగా శ్రమ అలవాటు లేనివారు వ్యాయామం చేయాలనుకుంటే ముందుగా డాక్టర్‌ను సంప్రదించి గుండె సామర్థ్యాన్ని పరీక్షించుకోవటం మంచిది.

  లక్ష్యం నెరవేరేలా..

రోజూ ఉదయం నడుస్తాను.. క్రమం తప్పకుండా జిమ్‌కు వెళ్తాను.. ఈసారి బరువు తగ్గటం ఖాయం.. పొగ మానెయ్యటం గ్యారెంటీ.. మద్యం జోలికి అసలే వెళ్లను.. ఇలా కొత్త సంవత్సరంలో ఎన్నెన్నో ఆరోగ్య నిర్ణయాలు తీసుకుంటారు. గొప్ప గొప్ప లక్ష్యాలను నిర్దేశించుకుంటారు. కానీ ఆచరణ దగ్గరికి వచ్చేసరికి కొద్దిరోజుల్లోనే తేలిపోతుంటారు. మానసికంగా దృఢంగా ఉంటే అలవాట్లను మార్చుకోవటం, లక్ష్యాలకు కట్టుబడి ఉండటం పెద్ద కష్టమేమీ కాదు. ఇందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం మంచిది.

మితిమీరిన మించిన లక్ష్యాలు పెట్టుకోవద్దు. ఎక్కువ కాలం కొనసాగించటానికి వీల్లేనివి, సత్యదూరమైనవి ఎంచుకుంటే పురిట్లోనే సంధికొట్టే ప్రమాదముంది. అలాగే నెమ్మదిగా ఆరంభించాలి. ఉదాహరణకు-  వ్యాయామం చేయాలనుకున్నారనుకోండి. లేడికి లేచిందే పరుగన్నట్టు వేగంగా కాకుండా నెమ్మదిగా మొదలుపెట్టాలి. రోజుకు అరగంట చొప్పున వారానికి మూడు రోజులు చేయొచ్చు. అప్పుడది క్రమంగా అలవాటుగా మారుతుంది.

 •  స్వభావాన్ని, గుణాన్ని, మానసిక ధోరణిని మార్చుకోవటం మంచిది. చాలామంది చేసే పొరపాటు- ఎంచుకున్న లక్ష్యాన్ని చేరుకోవటానికి చాలా కష్టపడాలని అనుకోవటం. అంటే సఫలం కాలేమని ముందే ఒక నిర్ణయానికి వచ్చేస్తున్నారనే అర్థం. ప్రత్యామ్నాయ మార్గాలు, తేలికైన పద్ధతులున్నాయని తెలుసుకోలేకపోవటం దీనికి కారణం.
 • ఫలితాన్ని ఊహించుకోవటం మరో పద్ధతి. ఉదాహరణకు- బరువు తగ్గిన తర్వాత ఎంత చురుగ్గా ఉంటామో, శరీరం ఎంత ఫిట్‌గా ఉంటుందో, అందం ఎంతలా ఇనుమడిస్తోందోనని ఊహించుకుంటే ఎక్కడలేని ఉత్సాహం కలుగుతుంది. పొగ తాగటం మానేస్తే ఊపిరితిత్తుల జబ్బులు, క్యాన్సర్ల ముప్పు తగ్గటం.. ఆయుష్షు పెరగటం, కుటుంబసభ్యులతో ఎక్కువ రోజులు హాయిగా గడపటం వంటివి తలచుకుంటే కొత్త హుషారు కలుగుతుంది. ఇది లక్ష్య సాధనకు కట్టుబడి ఉండేలా, బాధ్యతలను గుర్తించేలా చేస్తుంది.
 •  లక్ష్యాన్ని కచ్చితంగా నిర్దేశించుకోవాలి. ఏదో వ్యాయామం చేస్తాను, తీపి పదార్థాలు తగ్గిస్తానని అనుకోకుండా కచ్చితంగా ఈ సమయంలో ఇంతవరకు సాధిస్తానని నిర్ణయించుకోవాలి. ఏడాదిలో సాధించాల్సిన దాన్ని ఒక వారంలోనో, నెలలోనో సాధించాలనుకుంటే మొదటికే మోసం వస్తుంది. రోజులు, నెలల వారీగా లక్ష్యాన్ని విభజించుకుంటే చేరుకోవటం తేలికవుతుంది. ఉదాహరణకు- 12 కిలోల బరువు తగ్గాలనుకుంటే నెలకు అరకిలో చొప్పున తగ్గితే చాలు కదా. అప్పుడది చిన్నదిగా, తేలికగా కనిపిస్తుంది. ఒకేసారి సిగరెట్లు మానెయ్యటం కష్టం కావొచ్చు గానీ రోజుకు ఒకటి చొప్పున తగ్గించుకుంటూ రావటం సులువే కదా.
 • ఒక అలవాటును మానెయ్యటం కన్నా మొదలు పెట్టటం సులువని పరిశోధనలు చెబుతున్నాయి. కాబట్టి దృష్టిని మళ్లించటం అలవాటు చేసుకోవాలి. ఉదాహరణకు- పొగ తాగటం మానెయ్యాలని అనుకునేవారు సిగరెట్లను కాల్చే సమయంలో వేరే పనులు చేయొచ్చు. బబుల్‌గమ్‌ నమలటం, పిప్పరమెంటు బిళ్లలు చప్పరించటం, బటానీలో, పప్పులో నోట్లో వేసుకోవటం వంటివి చేయొచ్చు. ఒకవేళ ఆరోగ్యకరమైన ఆహారం తినాలని నిర్ణయించుకుంటే ఫాస్ట్‌ఫుడ్‌ను మొత్తంగా మానెయ్యటానికి బదులు పండ్లు, కూరగాయలు ఇంకాస్త ఎక్కువగా తినొచ్చు. కూల్‌డ్రింకులకు బదులు నీరు తాగటం అలవాటు చేసుకోవచ్చు. రాత్రిపూట సోషల్‌ మీడియాలో తలదూర్చటం కాకుండా ఆ సమయాన్ని యోగా చేయటానికి వాడుకోవచ్చు.
 •  చిత్తశుద్ధి ముఖ్యం. దృష్టిని మళ్లించే అంశాలకు తావివ్వకుండా చూసుకోవాలి. ఉదాహరణకు- జిమ్‌కు వెళ్లాలని నిర్ణయించుకుంటే కుంటి సాకులకు తావివ్వొద్దు. ‘ఉదయం నిద్ర లేచే సరికే పొద్దు పోతుంది. ఆఫీసు నుంచి ఇంటికి వచ్చాక పిల్లలతోనే సరిపోతుంది. ఇక జిమ్‌కు వెళ్లటానికి టైమ్‌ ఎక్కడ దొరుకుతుంది?’ అనుకుంటే అంతే సంగతులు. ఏవైనా అడ్డుంకులు ఎదురవుతుంటే వాటిని గుర్తించి, పరిష్కరించుకోవాలి. మనసుంటే మార్గం దొరక్కపోదు.
 • లక్ష్యాల విషయంలో కాస్త సడలింపులకూ అనువుగా ఉండాలి. ఒక్క వ్యాయామం చేయటం ద్వారానే కాదు.. ఆహార నియమాలతోనూ బరువు తగ్గుతుంది కదా. కాబట్టి వ్యాయామం చేయటానికి కుదరని రోజున కాస్త తిండిని తగ్గించుకుంటే కొంతవరకైనా లక్ష్యం నెరవేరుతుంది. ఆరుబయటకు వెళ్లటం వీలు కాకపోతే ఇంటి పని, తోట పని చేయొచ్చు. ట్రెడ్‌మిల్‌ మీద నడవొచ్చు. ఇలా పరిస్థితులకు అనుగుణంగా మార్చుకుంటే కఠినమైన లక్ష్యమైనా తేలికగానే కనిపిస్తుంది.
 • తీసుకున్న నిర్ణయాన్ని ఎంతవరకు సాధిస్తున్నామో ఎప్పటికప్పుడు నోటుబుక్కులో రాసిపెట్టుకోవాలి. దీంతో సమీక్షించుకోవటానికి అవకాశం కలుగుతుంది. ఎక్కడ తప్పులు చేస్తున్నామో గుర్తించటానికి, వాటిని సవరించుకోవటానికి వీలవుతుంది.
 • ఇష్టాన్ని పెంచుకోవటం ప్రధానం. ఉదాహరణకు కొన్నిసార్లు కష్టమైనా వ్యాయామం తప్పనిసరి కావొచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో వ్యాయామం మీద ఇష్టం పెంచుకోవాలి. కావాలంటే ఒకేసారి కాకుండా రోజులో రెండు మూడు సార్లు చేయొచ్చు. ఇదేదో తప్పనిసరి వ్యవహారమని కష్టపడుతూ చేస్తుంటే మనకోసం కాకుండా ఇతరుల కోసం చేస్తున్న భావన కలుగుతుంది. సంతోషం, ఉత్సాహం, హుషారు కొరవడతాయి. ఫలితంగా మధ్యలోనే ఆపేసే ప్రమాదముంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు