గుండె కొట్టుకోవటంలో విద్యుత్‌

ప్రచోదనాలు కీలకం. వీటిల్లో తలెత్తే సమస్యలతో గుండె లయ దెబ్బతింటుంది. కొందరిలో ఇది హఠాత్తుగా గుండె స్తంభించటానికీ కారణమవుతుంది. దీన్ని అంచనా వేయటం కష్టం.

Published : 30 Jan 2024 01:39 IST

ప్రచోదనాలు కీలకం. వీటిల్లో తలెత్తే సమస్యలతో గుండె లయ దెబ్బతింటుంది. కొందరిలో ఇది హఠాత్తుగా గుండె స్తంభించటానికీ కారణమవుతుంది. దీన్ని అంచనా వేయటం కష్టం. ఎందుకంటే గుండెలో ఏయే నిర్మాణాలు లేదా ఏయే లోపాలతో గుండె స్తంభించే ముప్పు పొంచి ఉంటుందోననేది తెలియదు. గుండె విద్యుత్‌ పనితీరును సవివరంగా పటంగా రూపొందించటమనేది అరుదు. ఇందుకోసం ప్రస్తుతం ఛాతీ కుహరంలోకి గొట్టాన్ని చొప్పించటమో.. లేదూ ఒకసారి వాడి పారేసే పరికరమో వాడుతున్నారు. ఇవి ఖరీదైనవి. సమయమూ ఎక్కువే పడుతుంది. ఇలాంటి పరిస్థితిని తప్పించటానికి బ్రిటన్‌కు చెందిన యూనివర్సిటీ కాలేజ్‌ లండన్‌ (యూసీఎల్‌) పరిశోధకులు వినూత్న ఎలక్ట్రోకార్డియోగ్రాఫిక్‌ ఇమేజింగ్‌ (ఈసీజీఐ) పొరను రూపొందించారు. ఛాతీ మీద పరచటానికి వీలుగా ఉండే దీన్ని మళ్లీ మళ్లీ వాడుకోవచ్చు. ఐదు నిమిషాల్లోనే ఫలితం చూపిస్తుంది. ఈ కోటులో 256 గ్రాహకాలుంటాయి. వీటితో అందే విద్యుత్‌ సమాచారాన్ని ఎంఆర్‌ఐతో తీసిన చిత్రాలతో సమ్మేళనం చేసి గుండె 3డీ డిజిటల్‌ నమూనాలు రూపొందించొచ్చు. గుండె ద్వారా ప్రసారమయ్యే విద్యుత్‌ తరంగాలను గుర్తించొచ్చు. గుండె స్కానింగ్‌ పరిజ్ఞానం ఇటీవల బాగా పుంజుకుంది. కానీ గుండె విద్యుత్‌ సంకేతాలను గుర్తించే విషయంలోనే అంత పురోగతి సాధించలేదు. ఈసీజీ ద్వారానే గుండె విద్యుత్‌ పనితీరును అంచనా వేస్తున్నారు. ఇది 50 ఏళ్లుగా పెద్దగా మారలేదు. ఈ నేపథ్యంలో ఈసీజీఐ పొర కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. ఇది త్వరగా, చవకగా గుండె విద్యుత్‌ పనితీరును తెలుసుకోవటానికి.. ప్రాణాలకు ముప్పు గల గుండెలయ సమస్య గలవారిని ముందే పట్టుకోవటానికి తోడ్పడగలదని భావిస్తున్నారు. మందులు, కొత్త గుండె పరికరాల సామర్థ్యాన్ని.. గుండె ఆరోగ్యం మీద జీవనశైలి అంశాల ప్రభావాన్ని తెలుసుకోవటానికీ ఉపయోగపడగలదని ఆశిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని