నిద్రకు ఎనర్జీ డ్రింకుల దెబ్బ

తక్షణ శక్తినందించే ఎనర్జీ పానీయాలు తాగుతున్నారా? కాస్త జాగ్రత్త. ఇవి కాలేజీ విద్యార్థుల్లో నిద్ర నాణ్యత తగ్గటానికి, నిద్రలేమికి దారితీస్తున్నట్టు పెద్దఎత్తున నిర్వహించిన నార్వే అధ్యయనం హెచ్చరిస్తోంది.

Updated : 30 Jan 2024 06:46 IST

తక్షణ శక్తినందించే ఎనర్జీ పానీయాలు తాగుతున్నారా? కాస్త జాగ్రత్త. ఇవి కాలేజీ విద్యార్థుల్లో నిద్ర నాణ్యత తగ్గటానికి, నిద్రలేమికి దారితీస్తున్నట్టు పెద్దఎత్తున నిర్వహించిన నార్వే అధ్యయనం హెచ్చరిస్తోంది. వీటిని ఎంత తరచుగా తాగితే అంత ఎక్కువగా రాత్రి నిద్రకు భంగం కలుగుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు. నెలకు 1-3 సార్లు తాగినా నిద్రాభంగం ముప్పు పెరుగుతుండటం గమనార్హం. ఎనర్జీ పానీయాల్లో చక్కెర, విటమిన్లు, ఖనిజాలతో పాటు కెఫీన్‌ కూడా ఉంటుంది. సగటున ఒక లీటరుకు 150 మి.గ్రా. కెఫీన్‌ కలుపుతుంటారు. ఇవి శారీరక, మానసిక శక్తిని అందిస్తాయని ప్రచారం చేయటం వల్ల విద్యార్థులు, యువత వీటికి ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. అయితే కెఫీన్‌ నిద్రకు చేటు చేస్తుంది. ఎనర్జీ పానీయాలు నిద్రను తగ్గిస్తాయని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నప్పటికీ ఎంత మేరకు ప్రభావం చూపుతున్నాయన్నది తెలియదు. దీన్ని గుర్తించటానికే 18-35 ఏళ్లకు చెందిన 53,266 మందిని ఎంచుకొని అధ్యయనం నిర్వహించారు. ఎంత తరచుగా ఎనర్జీ పానీయాలు తాగుతున్నారు? ఎంత బాగా నిద్రపోతున్నారు? అనేవి పరిశీలించారు. ఈ పానీయాలను తాగనివారు, ఎప్పుడో అప్పుడు తాగేవారితో పోలిస్తే.. రోజూ తాగేవారు సుమారు అరగంట తక్కువగా నిద్ర పోతున్నట్టు తేలింది. నిద్ర పట్టిన తర్వాత మెలకువ రావటం, చాలాసేపటి వరకు తిరిగి నిద్ర పట్టకపోవటం కూడా వీరిలో కనిపిస్తున్నట్టు బయటపడింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే నిద్రలేమి(ఇన్‌సోమ్నియా)కి దారితీస్తుంది.  వారానికి కనీసం మూడు రాత్రుల చొప్పున.. ఇలా  మూడు నెలల పాటు నిద్ర పట్టక సతమతం కావటం, నిద్ర పట్టినా త్వరగా మేల్కోవటం, అలాగే పగటిపూట కునికిపాట్లు పడటం, అలసటగా ఉండటాన్ని నిద్రలేమిగా నిర్ధరిస్తారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని