రోగనిరోధక వ్యవస్థకూ పొగ!

క్యాన్సర్లు, గుండెజబ్బు, సంతానలేమి, పోషకాల లోపం.. ఇలా చెబుతూ పోతే పొగతాగటం వల్ల కలిగే అనర్థాలు ఎన్నెన్నో. అంతేనా? ఇది రోగనిరోధక వ్యవస్థ మీదా దీర్ఘకాలం విపరీత ప్రభావం చూపుతున్నట్టు ఇన్‌స్టిట్యూట్‌ పాశ్చర్‌ తాజా అధ్యయనంలో బయటపడింది

Published : 20 Feb 2024 01:01 IST

క్యాన్సర్లు, గుండెజబ్బు, సంతానలేమి, పోషకాల లోపం.. ఇలా చెబుతూ పోతే పొగతాగటం వల్ల కలిగే అనర్థాలు ఎన్నెన్నో. అంతేనా? ఇది రోగనిరోధక వ్యవస్థ మీదా దీర్ఘకాలం విపరీత ప్రభావం చూపుతున్నట్టు ఇన్‌స్టిట్యూట్‌ పాశ్చర్‌ తాజా అధ్యయనంలో బయటపడింది. పొగ తాగటం మానేసిన తర్వాతా 10-15 ఏళ్ల వరకు దీని దుష్ప్రభావాలు కొనసాగుతున్నట్టు వెల్లడైంది. సూక్ష్మక్రిములు దాడి చేసినప్పుడు రోగనిరోధక వ్యవస్థ స్పందించే తీరు అందరిలో ఒకేలా ఉండదు. వయసు, లింగభేదం, జన్యువుల వంటి వాటిని బట్టి ఇది ఆధారపడి ఉంటుంది. ఇవే కాకుండా ఇతర అంశాలూ రోగనిరోధక ప్రతిస్పందనను ప్రభావితం చేస్తుంటాయి. వీటిల్లో పొగ తాగటం ఒకటని పరిశోధకులు గుర్తించారు. మిలియు అంటెరియా కోహార్ట్‌ అధ్యయనంలో సేకరించిన సమాచారం ఆధారంగా.. సూక్ష్మక్రిములు దాడి చేసినప్పుడు రోగనిరోధక వ్యవస్థ విడుదల చేసే సైటోకైన్లు, ప్రొటీన్ల మోతాదులను పరిగణనలోకి తీసుకొని ఈ విషయాన్ని పసిగట్టారు. ఇందులో శరీర ఎత్తు బరువుల నిష్పత్తి (బీఎంఐ), నిద్ర, పొగ తాగటం, శ్రమ, టీకాలు, బాల్యంలో జబ్బుల వంటి వాటిల్లో ఏయే అంశాలు రోగనిరోధక వ్యవస్థ మీద బలంగా ప్రభావం చూపుతున్నాయో పరిశీలించారు. ఇన్ఫెక్షన్‌తో ప్రేరేపితమైన వాపుప్రక్రియ (ఇన్‌ఫ్లమేషన్‌) ప్రతిస్పందన పొగతాగేవారిలో మితిమీరి ఉంటున్నట్టు గుర్తించారు. అంతేకాదు.. ఆయా క్రిములను గుర్తుంచుకోవటానికి రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడే కణాల పనితీరూ మందగించినట్టు బయటపడింది. అంటే సహజ (ఇన్నేట్‌) రోగనిరోధక వ్యవస్థనే కాకుండా సంతరిత (అడాప్టివ్‌) నిరోధక శక్తినీ పొగ అలవాటు దెబ్బతీస్తోందన్నమాట. పొగ అలవాటు కొనసాగిస్తున్న, మానేసిన వారిలో తేడాలనూ పరిశోధకులు గుర్తించారు. పొగ తాగటం మానేసిన వెంటనే వాపుప్రక్రియ తిరిగి మామూలు స్థాయికి వచ్చినప్పటికీ సంతరిత రోగనిరోధక శక్తి మీద 10-15 ఏళ్ల వరకూ దీని విపరీత ప్రభావం కొనసాగుతుండటం గమనార్హం. ఆరోగ్యవంతులు, వివిధ జబ్బులతో బాధపడేవారి రోగనిరోధక వ్యవస్థ మీద పొగ తాగటం ఎలాంటి ప్రభావం చూపుతుందో అర్థం చేసుకోవటానికి ఈ అధ్యయన ఫలితాలు తోడ్పడగలవని భావిస్తున్నారు. వీలైనంత త్వరగా పొగ మానెయ్యటం ఎంత ముఖ్యమో కూడా ఇవి సూచిస్తున్నాయి. పొగ మానేస్తే ఆయుష్షు పెరుగుతున్నట్టు కెనడాలో నిర్వహించిన మరో అధ్యయనమూ చెబుతోంది. పొగ తాగటం ఏ వయసులో మానేసినా కూడా ఈ ఫలితాలు వెనువెంటనే కనిపిస్తుండటం విశేషం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని