పేస్‌మేకర్‌ జాగ్రత్తలేంటి?

నా వయసు 55 ఏళ్లు. గుండె నెమ్మదిగా కొట్టుకుంటూ ఉండటం వల్ల డాక్టర్లు ఇటీవల నాకు ఛాతీలో పేస్‌మేకర్‌ అమర్చారు. దీని విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

Updated : 29 Feb 2024 17:03 IST

సమస్య: నా వయసు 55 ఏళ్లు. గుండె నెమ్మదిగా కొట్టుకుంటూ ఉండటం వల్ల డాక్టర్లు ఇటీవల నాకు ఛాతీలో పేస్‌మేకర్‌ అమర్చారు. దీని విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

వెంకటేశ్‌, హైదరాబాద్‌

సలహా: పేస్‌మేకర్‌ విద్యుత్‌ ప్రచోదనాలను వెలువరిస్తూ గుండె వేగం తగ్గకుండా చూస్తుంది. కాబట్టి దీని విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం తప్పనిసరి. అమర్చిన తర్వాత వారం వరకూ ఛాతీ మీద వేసిన బ్యాండేజీని మార్చుకోవాలి. తొలిరోజుల్లో అమర్చిన చోట దురద పెడుతున్నట్టు అనిపిస్తుంది. అయినా కూడా గోకటం, చేత్తో గట్టిగా రుద్దటం వంటివి చేయొద్దు. వారంలోనే రోజువారీ పనులన్నీ చేసుకోవచ్చు. అయితే 4-6 వారాల వరకూ కఠినమైన, తీవ్రమైన వ్యాయామాలు చేయొద్దు. ముఖ్యంగా పేస్‌మేకర్‌ను అమర్చిన వైపు చేత్తో బలమైన పనులు చేయొద్దు. ఆ తర్వాత అన్ని పనులు చేసుకోవచ్చు.

  • అయస్కాంతంతో కూడిన ఎలక్ట్రానిక్‌ పరికరాలు పేస్‌మేకర్‌ మీద ప్రభావం చూపొచ్చు. కాబట్టి స్మార్ట్‌ఫోన్లను పేస్‌మేకర్‌కు కనీసం 6 అంగుళాల దూరంలో ఉండేలా చూసుకోవాలి. సాధారణంగా చొక్కాలకు జేబులు ఎడమవైపున ఉంటాయి. పేస్‌మేకర్‌నూ చాలావరకు ఛాతీలో ఎడమవైపుననే అమరుస్తుంటారు. అందువల్ల ఎడమ జేబులో ఫోన్‌ పెట్టుకోవటం మంచిది కాదు. మాట్లాడేటప్పుడు అవతలి చెవి.. అంటే ఎడమవైపున పేస్‌మేకర్‌ అమర్చితే కుడి చెవి వద్ద ఫోన్‌ పెట్టుకోవాలి. స్పీకర్‌ ఆన్‌ చేసుకొని అయినా మాట్లాడొచ్చు. ఇ-సిగరెట్ల వంటివి వాడకపోవటం ఉత్తమం. ఇవీ పేస్‌మేకర్‌ పనితీరుకు భంగం కలిగించొచ్చు.
  • కనీసం ఆరు నెలలకు ఓసారైనా తనిఖీ చేసుకోవాలి. పేస్‌మేకర్‌ ఎలా పనిచేస్తోంది, బ్యాటరీ ఎంతవరకు ఉందనే విషయాలు ముందుగానే తెలుస్తాయి. అవసరమైతే డాక్టర్లు పేస్‌మేకర్‌ సెటింగ్స్‌ను మారుస్తారు. పేస్‌మేకర్‌ అమర్చినప్పుడు ఒక చిన్న కార్డు ఇస్తారు. ఇందులో పేస్‌మేకర్‌ రకం, తయారుచేసిన కంపెనీ వంటి వివరాలుంటాయి. దీన్ని వెంట ఉంచుకోవటం మంచిది. ఫోన్‌లో ఫొటో తీసి అయినా పెట్టుకోవచ్చు. ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తినా, ఇతరత్రా కారణాలతో ఆసుపత్రికి వెళ్లినా కార్డు చూపిస్తే చికిత్సలు, మందుల విషయంలో పొరపడటం తప్పుతుంది. శస్త్రచికిత్స చేస్తున్నప్పుడు రక్తస్రావం కాకుండా వాడే ఎలక్ట్రోకార్టీ పరికరం కొన్నిసార్లు పేస్‌మేకర్‌ మీద ప్రభావం చూపొచ్చు. కార్డును చూపిస్తే పేస్‌మేకర్‌ మోడ్‌ను తగినట్టుగా మారుస్తారు. ఎంఆర్‌ఐని తట్టుకునే పేస్‌మేకర్‌ అవునో కాదో కూడా కార్డుతో తెలుస్తుంది. ఎంఆర్‌ఐని తట్టుకునేది అయినా కూడా సెటింగ్స్‌లో కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుంది. ఇక్కడా కార్డు ఉపయోగపడుతుంది. కిడ్నీల్లో రాళ్లను తొలగించటానికి చేసే లిథోట్రిప్సీ, క్యాన్సర్‌ బాధితులకు ఇచ్చే రేడియేషన్‌ చికిత్స వంటివీ పేస్‌మేకర్‌ మీద ప్రభావం చూపొచ్చు. ముందే డాక్టర్‌కు విషయాన్ని చెప్పాలి. అవసరమైతే సెటింగ్స్‌ మారుస్తారు. అలాగే విమానాశ్రయాల్లో, మెట్రో రైలు స్టేషన్లలో మెటల్‌ డిటెక్టర్లు గుర్తించినప్పుడు కార్డును చూపిస్తే సిబ్బంది అడ్డుకోకుండానూ చూసుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని