పాము విషానికి కొత్త విరుగుడు!

అత్యంత విషపూరిత పాము కరిచినా ఒక్క సూది మందుతో ప్రాణాలు నిలబడితే? త్వరలోనే ఇది నిజం కానుంది. పాముల విషంలోని ప్రధాన విషతుల్యాలను నిర్వీర్యం చేయగల యాంటీబాడీని స్క్రిప్స్‌ రీసెర్చ్‌ శాస్త్రవేత్తలు రూపొందించారు మరి.

Updated : 05 Mar 2024 10:59 IST

త్యంత విషపూరిత పాము కరిచినా ఒక్క సూది మందుతో ప్రాణాలు నిలబడితే? త్వరలోనే ఇది నిజం కానుంది. పాముల విషంలోని ప్రధాన విషతుల్యాలను నిర్వీర్యం చేయగల యాంటీబాడీని స్క్రిప్స్‌ రీసెర్చ్‌ శాస్త్రవేత్తలు రూపొందించారు మరి. దీని పేరు 95మ్యాట్‌5. దీన్ని ఎలుకలపై పరీక్షించగా.. నల్లతాచు, బ్లాక్‌మాంబా వంటి పాముల విషాన్ని నిర్వీర్యం చేసినట్టు బయటపడింది. ఇది ప్రాణాలనే కాదు.. అవయవాలు చచ్చుబడకుండానూ కాపాడటం గమనార్హం. పాము కాటు చికిత్సలో ఇది విప్లవాత్మక మార్పులు తీసుకురాగలదని, ఎంతోమంది ప్రాణాలను కాపాడగలదని భావిస్తున్నారు.

సాధారణంగా పాముకాటు చికిత్సలో యాంటీవీనమ్‌ ఇంజెక్షన్లు ఉపయోగిస్తుంటారు. వీటి తయారీ కష్టమైన ప్రక్రియ. ముందు పాము విషాన్ని సేకరించి, దాన్ని గుర్రాల వంటి జంతువులకు ఇస్తారు. అనంతరం విషాన్ని ఎదుర్కోవటానికి పుట్టుకొచ్చే యాంటీబాడీలను సంగ్రహించి, శుద్ధిచేసి ఇంజెక్షన్లను తయారుచేస్తారు. అయితే వీటితో కొన్ని లోపాలు లేకపోలేదు. తీవ్రమైన అలర్జీ ప్రతిచర్యలు తలెత్తటం, యాంటీబాడీలు కొన్నిరకాల విషాలకు అంతగా పనిచేయకపోవటం వంటి ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ఆయా ప్రాంతాల్లో కనిపించే పాములకు అనుగుణంగానే ఇంజెక్షన్లు రూపొందిస్తుంటారు. ఇక్కడే కొత్త యాంటీబాడీ ఆశలు రేకెత్తిస్తోంది. దీన్ని జంతువుల నుంచి కాకుండా ప్రయోగశాలలోనే తయారుచేయటం విశేషం. ఇది సార్వత్రిక పాము విరుగుడు ఇంజెక్షన్‌గా ఉపయోగపడగలదు.

పాము విషంలో మూడు వేళ్ల వంటి పొడవైన న్యూరోటాక్సిన్లు నాడులను దెబ్బతీసి, అవయవాలు చచ్చుబడేలా చేస్తాయి. ఈ యాంటీబాడీ సరిగ్గా వీటి మీదే దాడి చేసి, నిర్వీర్యం చేసేస్తుంది. పాము విషాన్ని సమర్థంగా నిలువరించటంతో పాటు అలర్జీ ప్రతిచర్యల ముప్పు తగ్గటానికీ తోడ్పడటం దీని ప్రత్యేకత. పెద్దఎత్తున తయారుచేసే వీలుండటం వల్ల మారుమూల ప్రాంతాల్లో యాంటీవీనమ్‌ కొరతనూ తగ్గించగలదు. హెచ్‌ఐవీ టీకా తయారీకి ఉపయోగించుకున్న పద్ధతుల స్ఫూర్తితోనే 95మ్యాట్‌5ని రూపొందించారు. పాము విషానికి సమర్థ చికిత్సల కోసం మన రోగనిరోధక వ్యవస్థను వాడుకోవచ్చనీ ఇది నిరూపించింది. అయితే కొన్ని సవాళ్లు లేకపోలేదు. పాము విషంలో రకరకాల విషతుల్యాలు ఉండటం వల్ల ఒకే ఒక్క యాంటీబాడీ అన్నిరకాల విషాలను నిర్వీర్యం చేయలేకపోవచ్చు. అందుకే పలు కృత్రిమ యాంటీబాడీలను సృష్టించి, సమగ్రమైన యాంటీ వీనమ్‌ను తయారుచేయటం మీద కూడా పరిశోధకులు దృష్టి సారించారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని