తేమతోనూ ఇన్‌ఫెక్షన్‌ వ్యాప్తి

వాతావరణ మార్పు అనగానే పెరుగుతున్న ఉష్ణోగ్రతలే గుర్తుకొస్తాయి. తేమ కూడా తక్కువేమీ కాదని.. ఇన్‌ఫెక్షన్ల వ్యాప్తిలో ఇదీ కీలక పాత్ర పోషిస్తుందని పెన్‌ స్టేట్‌ పరిశోధకుల నేతృత్వంలోని అంతర్జాతీయ బృందం అధ్యయనంలో బయటపడింది.

Published : 05 Mar 2024 00:03 IST

వాతావరణ మార్పు అనగానే పెరుగుతున్న ఉష్ణోగ్రతలే గుర్తుకొస్తాయి. తేమ కూడా తక్కువేమీ కాదని.. ఇన్‌ఫెక్షన్ల వ్యాప్తిలో ఇదీ కీలక పాత్ర పోషిస్తుందని పెన్‌ స్టేట్‌ పరిశోధకుల నేతృత్వంలోని అంతర్జాతీయ బృందం అధ్యయనంలో బయటపడింది. ఉష్ణోగ్రత, తేమ మార్పులకు నులి పురుగుల వంటి పరాన్నజీవులు ఎలా స్పందిస్తాయో.. ఇన్‌ఫెక్షన్‌ ముప్పు ఎలా మారుతుందో.. భవిష్యత్తులో ఏర్పడబోయే కొత్త ఇన్‌ఫెక్షన్‌ కేంద్రాలేంటో తెలుసుకోవటానికి పరిశోధకులు ఒక నమూనా రూపొందించారు. ముఖ్యంగా పశువులు, వన్యప్రాణుల్లో కనిపించే పరాన్నజీవులను ఇందులో విశ్లేషించారు. ఇవి మనుషులకు ఇన్‌ఫెక్షన్‌ కలిగించే పరాన్నజీవుల మాదిరిగానే ప్రవర్తించే అవకాశమూ ఉండటం గమనార్హం. నులి పురుగుల వంటివి.. ముఖ్యంగా మట్టితో వ్యాపించే ఎలిక పాముల ఇన్‌ఫెక్షన్లు తరచూ కనిపిస్తుంటాయి. ప్రపంచవ్యాప్తంగా సుమారు 25% మంది వీటితో బాధపడుతున్నారన్నది ప్రపంచ ఆరోగ్యసంస్థ అంచనా. ఇవి పశువుల్లోనూ ఎక్కువగానే కనిపిస్తుంటాయి. ఆర్థికంగా తీవ్ర నష్టం కలగజేస్తుంటాయి. అయినా కూడా వాతావరణం, ఇన్‌ఫెక్షన్ల విషయంలో దోమల వంటి వాహకాల ద్వారా సంక్రమించే జబ్బుల మీదే ఎక్కువగా అధ్యయనాలు నిర్వహిస్తుంటారు. నులి పురుగుల వంటి పరాన్నజీవుల ఇన్‌ఫెక్షన్లను పెద్దగా పట్టించుకోరు. ఈ నేపథ్యంలో తాజా అధ్యయన ఫలితాలు మహమ్మారులు తలెత్తిన ప్రాంతాల్లో పశు రక్షణ, ప్రజారోగ్య కార్యక్రమాలను మెరుగు పరచటానికి దారి చూపగలవని అనుకుంటున్నారు. మట్టి ద్వారా వ్యాపించే ఎలిక పాముల జీవనచక్రం రెండు దశల్లో సాగుతుంది. ఒకటి గుడ్లు, లార్వా దశ. రెండోది జీవుల్లో ఎదిగే దశ. వాతావరణ మార్పులతో ఇవెలా ప్రభావితమవుతున్నాయో తాజా అధ్యయనంలో బయటపడింది. ఇవి పశువుల్లోనూ వేర్వేరు భాగాల్లో వేర్వేరుగా ప్రవర్తిస్తుండటం విచిత్రం. పేగుల్లోని పరాన్నజీవులు ఉష్ణోగ్రతకు బాగా ప్రభావితమవుతున్నాయని.. 50 డిగ్రీల ఫారన్‌హీట్‌ ఉష్ణోగ్రతలో ఎక్కువగా ఇన్‌ఫెక్షన్‌ కలిగించే స్థాయికి చేరుకుంటున్నాయని గుర్తించారు. అదే పొట్టలోని పరాన్నజీవులు తేమకు బాగా ప్రభావితమవుతున్నాయని.. తేమ 80%, అంతకన్నా ఎక్కువగా ఉన్నప్పుడు గరిష్ఠంగా ఇన్‌ఫెక్షన్‌ కలిగించే స్థాయికి చేరుకుంటున్నాయని కనుగొన్నారు. ఆయా కాలాలు, ప్రాంతాలు కూడా వీటిని ప్రభావితం చేస్తుండటం గమనార్హం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని