ఒత్తిడితో జీవక్రియ రుగ్మత

అధిక రక్తపోటు, అధిక ట్రైగ్లిజరైడ్లు, బొజ్జ, పరగడుపున రక్తంలో గ్లూకోజు పెరగటం, మంచి కొలెస్ట్రాల్‌ తగ్గటం.. ఇవన్నీ జీవక్రియ రుగ్మత (మెటబాలిక్‌ సిండ్రోమ్‌) అంశాలే. వీటిల్లో మూడు, అంతకన్నా ఎక్కువుంటే జీవక్రియ రుగ్మత ఉన్నట్టే.

Published : 12 Mar 2024 00:48 IST

అధిక రక్తపోటు, అధిక ట్రైగ్లిజరైడ్లు, బొజ్జ, పరగడుపున రక్తంలో గ్లూకోజు పెరగటం, మంచి కొలెస్ట్రాల్‌ తగ్గటం.. ఇవన్నీ జీవక్రియ రుగ్మత (మెటబాలిక్‌ సిండ్రోమ్‌) అంశాలే. వీటిల్లో మూడు, అంతకన్నా ఎక్కువుంటే జీవక్రియ రుగ్మత ఉన్నట్టే. చాలామంది పెద్దగా పట్టించుకోరు గానీ ఇది మధుమేహం, గుండెజబ్బు, పక్షవాతం ముప్పు పెరిగేలా చేస్తుంది. జీవక్రియ రుగ్మతకు వయసు మీద పడటం, జన్యువుల వంటివి కారణమవుతుంటాయి. ఇవే కాకుండా మానసిక ఒత్తిడి కూడా కీలక పాత్ర పోషిస్తున్నట్టు తాజాగా బయటపడింది. దీని మూలంగా ఒంట్లో సూక్ష్మస్థాయిలో వాపుప్రక్రియ (ఇన్‌ఫ్లమేషన్‌) పెరుగుతున్నట్టు, ఇది జీవక్రియ రుగ్మత ముప్పు ఎక్కువయ్యేలా చేస్తున్నట్టు పరిశోధకులు కనుగొన్నారు. ఒత్తిడి వల్ల మంచి కొలెస్ట్రాల్‌ (హెచ్‌డీఎల్‌) మోతాదులు తగ్గే ప్రమాదముంది. అదే సమయంలో బరువు, ఇన్సులిన్‌ నిరోధకత, ట్రైగ్లిజరైడ్లు పెరుగుతాయి. ఇవన్నీ వాపుప్రక్రియతో ముడిపడిన మార్గాలను దెబ్బతీస్తాయి. ఇలా ఒత్తిడి పరోక్షంగా జీవక్రియ రుగ్మతకు కారణమవుతోందన్నమాట. కాబట్టి మానసిక ఒత్తిడిని తగ్గించుకోవటం మీద దృష్టి సారించటం అన్ని విధాలా మంచిది. ఇందుకు యోగా, ధ్యానం వంటి పద్ధతులు తోడ్పడతాయి. ఏకాగ్రత, వర్తమానంలో గడపటం, శరీరం ఎలా స్పందిస్తోందో గమనించటం మేలు చేస్తాయి. మన విలువలను గుర్తించి, నడచుకోవటమూ మేలు చేస్తుంది. ఒత్తిడిని తగ్గించుకోవటం జీవక్రియ రుగ్మతతో ముడిపడిన జబ్బుల చికిత్సలోనూ మేలు చేస్తున్నట్టు తేలింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని