మెదడు.. అద్భుత ఫిల్టర్‌!

మన మెదడు అద్భుతమైంది. రణగొణధ్వనులతో కూడిన వాతావరణంలో ఇతరులతో మాట్లాడుతున్నప్పుడూ ఏది ముఖ్యమో, ఏది కాదో నిర్ణయించుకునేలా చేస్తుంది.

Updated : 26 Mar 2024 05:12 IST

మన మెదడు అద్భుతమైంది. రణగొణధ్వనులతో కూడిన వాతావరణంలో ఇతరులతో మాట్లాడుతున్నప్పుడూ ఏది ముఖ్యమో, ఏది కాదో నిర్ణయించుకునేలా చేస్తుంది. బ్రౌన్‌ యూనివర్సిటీకి చెందిన కార్నే ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ బ్రెయిన్‌ సైన్స్‌ పరిశోధకుల అధ్యయనంలో ఇదే విషయం వెల్లడైంది. ఏకాగ్రత కుదరకపోవటమంటే విషయగ్రహణ లేకపోవటం కాదని, నిజానికిది మెదడు సూక్ష్మగ్రాహ్యతకు రుజువని సూచిస్తోంది.

ఏదో హోటల్‌లో కూర్చుంటాం. ఒకపక్క పాత్రల చప్పుడు, వెయిటర్ల కేకలు. మరోపక్క చుట్టుపక్కల కూర్చున్నవారూ బిగ్గరగా మాట్లాడుకుంటుంటారు. అయినా కూడా మనం ఎదుటివారితో బాగానే మాట్లాడుతుంటాం. వాళ్లు చెప్పేది వింటూనే ఉంటాం, అర్థం చేసుకుంటాం. ఇదెలా సాధ్యం? దేన్ని గ్రహించాలో, దేన్ని వదిలేయాలో ఎలా నిర్ణయించుకుంటాం? దీనికి కారణం గజిబిజి వాతావరణంలోనూ ఏకాగ్రతగా ఉంచే మెదడు యంత్రాంగమేనని పరిశోధకులు గుర్తించారు. దీని మూలంగానే మనం అవసరమైన విషయాన్ని గ్రహించటాన్ని, అవసరంలేని అంశాలను వదిలేయటాన్ని వేరు  చేయగలుగు తున్నామని నిరూపించారు. అవసరాలకు అనుగుణంగా మారగలిగే ఇలాంటి విషయగ్రహణ సామర్థ్యాలను, అలాగే వీటికి గల పరిమితులను అర్థం చేసుకోవటానికి తాజా అధ్యయన ఫలితాలు ఉపయోగపడగలవని భావిస్తున్నారు. ఏకాగ్రతను దెబ్బతీసే ఏడీహెచ్‌డీ వంటి కొన్ని రకాల సమస్యల్లో వీటి ప్రభావాలను గుర్తించటానికి కూడా దోహదం చేయగలవని ఆశిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని