ఇవీ కుంగుబాటు లక్షణాలే..

ఎప్పుడో అప్పుడు ఆందోళన, దిగులు పడటం మామూలే. కానీ ఇలాంటి భావనలు వారాల కొద్దీ విడవకుండా వేధిస్తుంటే కుంగుబాటు (డిప్రెషన్‌) కావొచ్చని అనుమానించాలి.

Updated : 26 Mar 2024 01:33 IST

ఎప్పుడో అప్పుడు ఆందోళన, దిగులు పడటం మామూలే. కానీ ఇలాంటి భావనలు వారాల కొద్దీ విడవకుండా వేధిస్తుంటే కుంగుబాటు (డిప్రెషన్‌) కావొచ్చని అనుమానించాలి. ఇది మానసిక సమస్యే అయినా శరీరం మీదా ప్రభావం చూపుతుంది. గుండె, కిడ్నీలు, నాడులు, రోగనిరోధక వ్యవస్థ.. ఇలా అన్నింటినీ విపరీతంగా ప్రభావితం చేయొచ్చు. ఇవి వివిధ లక్షణాల రూపంలోనూ కనిపిస్తుంటాయి.

 నిద్ర సమస్యలు

మనసు ప్రశాంతంగా ఉండకపోవటం వల్ల కుంగుబాటు బాధితుల్లో చాలామంది రాత్రిపూట సరిగా నిద్ర పట్టక సతమతమవుతుంటారు. అయితే కొందరు మరీ ఎక్కువగా నిద్రపోతుండొచ్చు కూడా.

కండరాలు, కీళ్ల నొప్పులు

దీర్ఘకాలంగా నొప్పులతో బాధపడేవారికి కుంగుబాటు ముప్పు ఎక్కువ. అలాగే కుంగుబాటు మూలంగానూ కండరాలు, కీళ్ల నొప్పులు బయలుదేరొచ్చు. ఎందుకంటే ఇవి రెండూ మెదడులోని ఒకేరకం సమాచార వాహకాలతో ముడిపడి ఉంటాయి. కుంగుబాటు గలవారికి తరచూ నొప్పులు వేధించే ముప్పు మూడు రెట్లు ఎక్కువ. వీరికి వెన్నునొప్పి వచ్చే అవకాశం నాలుగు రెట్లు అధికంగా ఉంటుంది.

తలనొప్పి

తీవ్ర కుంగుబాటు గలవారికి పార్శ్వనొప్పి వచ్చే అవకాశం మూడు రెట్లు ఎక్కువని అధ్యయనాలు చెబుతున్నాయి. అలాగే పార్శ్వనొప్పి గలవారికి కుంగుబాటు ముప్పు ఐదు రెట్లు అధికం. డిప్రెషన్‌ మూలంగా కండరాలు బిగుసుకు పోతుంటాయి. ముఖ్యంగా మెడ, భుజం కండరాలు బిగుసుకోవటం వల్ల తలనొప్పి తలెత్తుతుంది. మెదడులో సెరటోనిన్‌, డొపమిన్‌, నార్‌ఎపినెఫ్రిన్‌ వంటి నాడీ సమాచార వాహక రసాయనాల మోతాదులు అస్తవ్యస్తం కావటం వల్ల మూడ్‌ కూడా మారుతుంది. నొప్పి భావన తీవ్రమవుతుంది. ఇదీ తలనొప్పికి దారితీయొచ్చు. ఒత్తిడిని నియంత్రించే హార్మోన్ల మార్పులు.. కుంగుబాటు కారణంగా మారిపోయే జీవనశైలి.. కొన్నిరకాల కుంగుబాటు మందులతోనూ తలనొప్పి రావొచ్చు.

వ్యాయామంతో కళ్లెం

క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం ద్వారా కుంగుబాటు లక్షణాలు తగ్గుముఖం పట్టేలా చూసుకోవచ్చు. వ్యాయామంతో మెదడులో హాయి భావన కలిగించే రసాయనాలు విడుదలవుతాయి. నొప్పిని సహించే సామర్థ్యమూ పెరుగుతుంది. కుంగుబాటు మూలంగా కొన్నిసార్లు వ్యాయామం చేయటానికి తగినంత ఉత్సాహం ఉండకపోవచ్చు. అయినా గానీ ప్రయత్నించటం మంచిది. ఇది నిస్సత్తువ తగ్గటానికి, నిద్ర బాగా పట్టటానికీ తోడ్పడుతుందని గుర్తుంచుకోవాలి.
ోయే అవకాశమూ ఉంది.

ఛాతీనొప్పి

గుండె, ఊపిరితిత్తులు, పొట్ట సమస్యల్లో ఛాతీ నొప్పి రావటం చూస్తుంటాం. కొన్నిసార్లు ఇది కుంగుబాటు లక్షణమూ కావొచ్చు. కుంగుబాటుతో గుండె జబ్బు ముప్పూ పెరుగుతుంది. అంతేకాదు.. గుండెపోటు బారినపడ్డవారు కుంగుబాటులోకి జారీ పోయే అవకాశమూ ఉంది.

నిస్సత్తువ, అలసట

రాత్రిపూట కంటి నిండా నిద్రపోయినా కూడా అదేపనిగా అలసట, నిస్సత్తువకు గురవుతుంటే తప్పకుండా అనుమానించాల్సిందే. అలసటతో రోజువారీ పనులు చేసుకోవటమూ కష్టమైపోతుంటే కుంగుబాటు కారణం కావొచ్చు. డిప్రెషన్‌, నిస్సత్తువ రెండూ ఒకదాంతో మరోటి ముడిపడి ఉంటాయి. ఒకటి తీవ్రమైతే మరోటీ తీవ్రమవుతుంది.

జీర్ణ సమస్యలు

మన మెదడు, జీర్ణకోశ వ్యవస్థలు రెండూ అనుసంధానమై ఉంటాయి. అందుకేనేమో ఒత్తిడికి గురైనప్పుడు, విచారం కలిగినప్పుడు చాలామందికి కడుపునొప్పి, వికారం తలెత్తుతుంటాయి. మరోవైపు కుంగుబాటు మూలంగానూ తిన్నది జీర్ణం కాకపోవటం, వికారం, విరేచనాలు, మలబద్ధకం వంటివి వేధిస్తుంటాయి

ఆకలి తగ్గటం, బరువు పెరగటం

కుంగుబాటు గలవారిలో కొందరిలో ఆకలి తగ్గుతుంది. దీంతో ఏదీ తినాలనిపించదు. ఫలితంగా బరువూ తగ్గుతారు. బలహీనమవుతారు. అయితే కొందరు అదేపనిగా ఏదో ఒకటి నోట్లో వేసుకొని నములుతుంటారు. ఏం తిన్నా ఆకలి తీరదు. అందువల్ల బరువూ పెరుగుతుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని