విమాన ప్రయాణమా?

విమానంలో ప్రయాణించటం సరదాగానే అనిపిస్తుంది. సమయమూ ఆదా అవుతుంది. ఇది సరే గానీ విమాన ప్రయాణం కొన్ని ఆరోగ్య సమస్యలకూ దారితీయొచ్చు.

Updated : 06 Apr 2024 15:26 IST

విమానంలో ప్రయాణించటం సరదాగానే అనిపిస్తుంది. సమయమూ ఆదా అవుతుంది. ఇది సరే గానీ విమాన ప్రయాణం కొన్ని ఆరోగ్య సమస్యలకూ దారితీయొచ్చు. విమానంలో పీడనం, ఉష్ణోగ్రత, ఆక్సిజన్‌ మోతాదులు మారిపోతుంటాయి. తేమ కూడా సముద్ర మట్టం కన్నా తక్కువగా ఉంటుంది. ఇవన్నీ శరీరం పనితీరు మీద ప్రభావం చూపుతాయి. వేర్వేరు టైమ్‌జోన్ల గుండా సాగటం, చుట్టూ చాలామంది ఉండటమూ కొన్ని చిక్కులు తెచ్చిపెడతాయి. కాబట్టి వీటి గురించి తెలుసుకొని, కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం మంచిది.

ఒంట్లో నీటిశాతం తగ్గటం

విమానం కేబిన్‌లో తేమ చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే కేబిన్‌లో తిరిగే గాలిలో సుమారు 50% తేమ బయటకు పోతుంది. మరీ ఎత్తుగా విమానం ప్రయాణిస్తున్నప్పుడైతే తేమ దాదాపు పూర్తిగానూ తగ్గుతుంది. దీంతో గొంతు, ముక్కు, చర్మం ఎండిపోయినట్టు అనిపిస్తుంది.

ఏం చేయాలి?: చేతి సంచీలో ఖాళీ వాటర్‌ బాటిల్‌ను పెట్టుకోవటం మంచిది. చెకింగ్‌ పూర్తయ్యాక బాటిల్‌లో నీళ్లు నింపి, విమానంలోకి తీసుకెళ్లటానికి వీలుంటుంది. విమానంలో ఇచ్చే తీపి పానీయాలకు బదులు అప్పుడప్పుడూ బాటిల్‌లో నీళ్లు తాగొచ్చు. గంటలకొద్దీ ప్రయాణం చేసేటప్పుడు ఇదెంతగానో ఉపయోగపడుతుంది. కాంటాక్టు లెన్సులు ధరించేవారు వీటికి బదులు అద్దాలు పెట్టుకోవాలి. దీంతో కళ్లకు అసౌకర్యం కలగకుండా చూసుకోవచ్చు. ముక్కు, కళ్లు, చర్మం పొడిబారతాయని భయపడేవారు ముక్కులో, కళ్లలో వేసుకునే చుక్కల మందు.. చర్మానికి రాసుకునే లోషన్లు వెంట తీసుకెళ్లటం మేలు.

శక్తి తగ్గటం

అధిక ఎత్తుల్లో గాలిలో పీడనం తగ్గుతుంది. దీనర్థం శరీరం ఆక్సిజన్‌ను తక్కువగా తీసుకుంటుందనే. నిజానికి విమాన సంస్థలు కేబిన్‌లో గాలి పీడనం తగ్గకుండా తగు చర్యలు తీసుకుంటాయి. అయినా కూడా సముద్ర మట్టంతో పోలిస్తే పీడనం తక్కువగానే ఉంటుంది. అందువల్ల విమాన ప్రయాణం చేస్తున్నప్పుడు ఒంట్లో ఆక్సిజన్‌ మోతాదులు పడిపోతాయి. దీంతో శక్తి సన్నగిల్లినట్టు అనిపిస్తుంది. ఒంట్లో నీటిశాతం తగ్గటమూ నిరుత్సాహానికి గురిచేస్తుంది. వేర్వేరు టైమ్‌జోన్లలో ప్రయాణించటం జెట్‌ ల్యాగ్‌కూ దారితీస్తుంది.

ఏం చేయాలి?: తగినంత నీరు తాగటం ముఖ్యం. ఒకట్రెండు గంటల కన్నా ఎక్కువసేపు ప్రయాణం చేయాల్సి వస్తే అప్పుడప్పుడు సీటులోంచి లేచి, కేబిన్‌లో అటూఇటూ నాలుగడుగులు వేయటం మంచిది. సీటులో కూర్చున్నప్పుడూ కాళ్లూ చేతులూ సాగదీయొచ్చు. నేల మీది నుంచి వస్తువులను కాలి వేళ్లతో పట్టుకుంటున్నట్టు చేయొచ్చు. వేళ్లను, మడమలను కదిలించొచ్చు. వీటితో రక్త ప్రసరణ మెరుగవుతుంది. ఒకవేళ ఒకట్రెండు రోజుల పాటు వేర్వేరు టైమ్‌ జోన్లలో ప్రయాణిస్తున్నట్టయితే మన టైమ్‌ జోన్‌ ప్రకారం నిద్ర వేళలను పాటించాలి.

చెవి దిబ్బడ

విమానం కేబిన్‌లో పీడనం మారుతున్నకొద్దీ లోపలి చెవుల్లోని గాలి పీడనం దానికి అనుగుణంగా సరిదిద్దుకోవటానికి ప్రయత్నిస్తుంది. దీని మూలంగానే శరీరం తూలకుండా ఉంటుంది. విమానం గాల్లోకి లేస్తున్నప్పుడు, కిందికి దిగుతున్నప్పుడు వేగంగా పీడనంలో మార్పులు తలెత్తుతాయి. ఈ సమయాల్లో మధ్య చెవి, యూస్టేషియన్‌ గొట్టాల చుట్టూ ఒత్తిడి పెరుగుతుంది. దీన్ని సరిచేసుకునే క్రమంలో చెవులు దిబ్బడేస్తాయి. కదలికలకు సంబంధించి మెదడుకు విరుద్ధ సంకేతాలు అందటం వల్ల కొందరికి వికారం వచ్చినట్టూ అనిపించొచ్చు.

ఏం చేయాలి?: విమానం గాల్లోకి లేస్తున్నప్పుడు, కిందికి దిగుతున్నప్పుడు గుటక వేయటం లేదా ఆవలించటం ద్వారా మధ్య చెవి మీద ఒత్తిడి నియంత్రణలోకి వస్తుంది. చెవి దిబ్బడ తొలగుతుంది. వికారం రాకుండా ఉండటానికి రెక్కల వద్ద ఉండే విండో సీటులో కూర్చోవటం మంచిది. ఇక్కడ కదలిక కోణం తక్కువగా ఉంటుంది. ఆకాశం, భూమి కలిసే దృశ్యం కనిపిస్తుంది.

కడుపుబ్బరం

విమానం గాల్లో ఎగురుతున్నప్పుడు కేబిన్‌లో పీడనం తగ్గుతుంది. దీంతో పొట్టలోని గ్యాస్‌ విస్తరిస్తుంది. జీర్ణకోశంలో, పేగుల్లో నిండిపోతుంది. దీంతో కడుపు ఉబ్బినట్టు అనిపిస్తుంది. బెల్టు బిగుతుగా అవుతుంది.

ఏం చేయాలి?: చిక్కుళ్లు, ఉల్లి, వెల్లుల్లి, కొన్నిరకాల గింజ పప్పులు, పాల ఉత్పత్తులు, పండ్లు గ్యాస్‌ ఏర్పడేలా చేస్తాయి. ప్రయాణానికి ముందు రోజు నుంచే ఇలాంటి పదార్థాలు తినకుండా చూసుకోవాలి. ప్రయాణంలోనూ సరిపోయే ఆహారాన్నే తినాలి. తగినంత నీరు తాగాలి. కాఫీ, టీ తగ్గించుకోవాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని