ఒత్తిడి మంచిదే కానీ..

రోజూ ఇంట్లో, ఆఫీసులో ఎన్నో పనులు. ఎన్నో సమస్యలు, సవాళ్లు. మరెన్నో ఆటుపోట్లు. వీటన్నింటినీ ఎదుర్కొనే క్రమంలో కొంత మానసిక ఒత్తిడికీ (స్ట్రెస్‌) గురవుతాం.

Published : 30 Apr 2024 00:05 IST

రోజూ ఇంట్లో, ఆఫీసులో ఎన్నో పనులు. ఎన్నో సమస్యలు, సవాళ్లు. మరెన్నో ఆటుపోట్లు. వీటన్నింటినీ ఎదుర్కొనే క్రమంలో కొంత మానసిక ఒత్తిడికీ (స్ట్రెస్‌) గురవుతాం. ఇది ఆయా పరిస్థితులకు శరీరం స్పందించే తీరును దర్పణం పడుతుంది. నిత్య జీవితంలో ఎంతో కొంత ఒత్తిడి సహజం. ఇది శ్రుతిమించితే రకరకాల దుష్ప్రభావాలు పొంచి ఉన్న మాట నిజమే అయినా ఒత్తిడి అంతా చెడ్డదేమీ కాదు. సానుకూల ప్రభావమూ చూపుతుంది. దీన్నే యూస్ట్రెస్‌ అని పిలుచుకుంటారు. అంటే మంచి ఒత్తిడి  అన్నమాట.

ఉత్సుకత, అనూహ్య ఘటనలు, ప్రమాదాల వంటివి శరీరంలో రసాయన ప్రతిస్పందనలను ప్రేరేపిస్తాయి. మంచి ఒత్తిడికీ ఇవే కారణం. వినోదాత్మక సవాళ్లను ఎదుర్కొన్నప్పుడు నాడుల స్పందనలో భాగంగా పుట్టుకొస్తుంది. ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే మంచి ఒత్తిడి లేకపోతే హాయిగా జీవించటం కొరవడుతుంది. మనం చురుకుగా, ఉత్సాహంగా ఉండటానికి.. లక్ష్యాలను అందుకోవటానికి.. జీవితం పట్ల సానుకూలంగా ఉండటానికి.. తృప్తి కలగటానికిది దోహదం చేస్తుంది మరి. దీంతో ఆత్మ విశ్వాసమూ ఇనుమడిస్తుంది. స్వీయ సామర్థ్యం, స్వతంత్ర భావన, ధైర్యం పెంపొందుతాయి. వ్యాయామం వంటి వాటిని కొనసాగించేలా చేయటం ద్వారా శారీరక ఆరోగ్యానికీ దోహదం చేస్తుంది.

 ఇవీ నిదర్శనాలు

 మంచి ఒత్తిడి సరే. దీనికి ఉదాహరణలేంటి, దీన్ని గుర్తించటమెలా అని అనుకుంటున్నారా? దీన్ని జీవితంలో అన్ని పార్శ్వాల్లోనూ గమనించొచ్చు. ఉద్యోగం దగ్గరి నుంచి వ్యక్తిగత సంబంధాలు, ఇల్లు, కుటుంబం, అన్యోన్యత, అవకాశాల వరకూ అన్నింటిలోనూ ఇది ఇమిడి ఉంటుంది. ఉదాహరణకు..

 • ఆఫీసులో కొత్త ప్రాజెక్టును పొందారనుకోండి. మంచి ఒత్తిడి దాన్ని సాధించటానికి బలాన్నిస్తుంది. నైపుణ్యాలను సజావుగా వాడుకోవటానికి, కొత్త నైపుణ్యాలను నేర్చుకోవటానికి ఉత్సాహం చూపేలా చేస్తుంది. అయితే ఇలాంటి ప్రాజెక్టులు వాస్తవికమైనవి అయితేనే మంచి ఒత్తిడికి దారితీస్తాయి. అదే లక్ష్యాలు అసంబద్ధంగా ఉన్నప్పుడు, తలకు మించిన ప్రాజెక్టులు చేపట్టినప్పుడు, పని భారం పెరిగినప్పుడు, తోటి ఉద్యోగులు సహకరించనప్పుడు వ్యథకు (డిస్ట్రెస్‌) కారణమవుతుంది. ప్రతికూల పరిణామాలను చవిచూడాల్సి వస్తుంది.
 • మనకు సహజంగానే నేర్చుకునే గుణం ఉన్నప్పటికీ కొత్త విషయాలు అభ్యసించటం, నైపుణ్యం సాధించటం అంత తేలిక కాదు. చిన్న చిన్న విజయాలను సాధిస్తూ వస్తుంటే ఆత్మ విశ్వాసం ఇనుమడిస్తుంది. వాటి నుంచి స్ఫూర్తి పొందుతూ మెరుగు పరచుకోవటానికి దోహదం చేస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ముందుకు నడిపించేది మంచి ఒత్తిడే.
 • మన సామర్థ్యాన్ని సవాల్‌ చేసే కఠినమైన వ్యాయామాలూ మంచి ఒత్తిడికి నిదర్శనమని చెప్పుకోవచ్చు. ఇవి కష్టమైనవే అయినా వీటితో ఒనగూరే ప్రయోజనాలు ఉత్సాహాన్ని కలగజేస్తాయి. ఇది శ్రమను మరచిపోయేలా, కొనసాగించేలా చేస్తాయి.

ఎలా పెంచుకోవాలి?

మనలో మంచి ఒత్తిడి సహజంగానే ఉంటుంది. కానీ దీన్ని రోజువారీ జీవితంలో భాగం చేసుకుంటే మరింత ఫలితం కనిపిస్తుంది.

 •  చిన్నదో, పెద్దదో.. రోజూ ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవాలి.
 • సౌకర్యవంతమైన పరిధిని అధిగమించటానికి ప్రయత్నించాలి. కొత్త బాధ్యతలను స్వీకరించటానికి, కొత్త నైపుణ్యాలను నేర్చుకోవటానికిది తోడ్పడుతుంది.
 •  వ్యాయామం చేయటం తప్పనిసరి. ఇది శరీరానికే కాదు, మనసుకూ ఉత్సాహాన్ని కలగజేస్తుంది.
 •  సవాళ్లతో కూడిన, సహేతుకమైన లక్ష్యాలను నిర్ణయించుకునే తీరును నేర్చుకోవాలి. సాధిస్తున్న పురోగతిని గమనిస్తూ.. దానికి తామే బాధ్యులమని గుర్తించాలి.

 వ్యతిరేకం హానికర ఒత్తిడి

సానుకూల ఒత్తిడికి పూర్తి వ్యతిరేకమైంది ప్రతికూల ఒత్తిడి. ఇది మానసికంగానే కాదు, శారీరకంగానూ హాని చేస్తుంది. గడువులోగా పనులు పూర్తి చేయలేకపోవటం, ఆర్థిక సమస్యలు, ఆత్మీయులు దూరం కావటం, నిర్లక్ష్యానికీ వేధింపులకూ గురికావటం, జబ్బులు, గాయాలు, ఉద్యోగాల్లో ఇబ్బందులు, ఇతరుల గురించి బాధపడటం వంటివన్నీ దీనికి ఉదాహరణలే. ఇది కొన్నిసార్లు దీర్ఘకాలంగానూ వేధించొచ్చు. ఫలితంగా నిద్రలేమి, నీరసం, తలనొప్పులు, మూడ్‌ మారిపోవటం, ఆకలి పెరగటం లేదా తగ్గటం, ఆయాసం, ఛాతీనొప్పులు, అజీర్ణం, నిరుత్సాహం వంటివి తలెత్తుతాయి. అందువల్ల చెడు ఒత్తిడిని వీలైనంత త్వరగా తగ్గించుకోవాలి.

నివారించుకోవటమెలా?

హానికర ఒత్తిడి బారినపడటం కన్నా ముందు నుంచే దాన్ని నివారించుకోవటం మేలు. ఇందుకు రోజువారీ జీవితంలో కొన్ని జాగ్రత్తలు మేలు చేస్తాయి.

 • ధ్యానం, యోగా, ప్రాణాయామం వంటివి మానసిక ప్రశాంతతను కలగజేస్తాయి.
 • శరీర సంరక్షణ మీద దృష్టి పెట్టాలి. మంచి ఆహారం తినటం, వ్యాయామం చేయటం, కంటి నిండా నిద్రపోవటం ద్వారా ఒత్తిడిని సమర్థంగా ఎదుర్కోవచ్చు.
 • అన్నీ మన నియంత్రణలో ఉండవనే విషయాన్ని గుర్తించాలి. మార్చటానికి వీల్లేని పరిస్థితుల గురించి అదే పనిగా బాధపడటం కన్నా దాన్నుంచి బయటపడే మార్గాలను అన్వేషించాలి.
 • ఎక్కువ పనుల్లో కూరుకున్నప్పుడు, తీవ్ర ఒత్తిడిలో ఉన్నప్పుడు అదనపు బాధ్యతలను నిర్వర్తించటం కష్టం. ఇలాంటి వాటిని ఎలా నిరాకరించాలో నేర్చుకోవాలి.
 • మనకు ప్రశాంతత, ఆనందం కలిగించేవారితో.. బాధల్లో తోడుగా ఉండేవారితో.. వ్యావహారిక విషయాల్లో సాయం చేసేవారితో సన్నిహిత సంబంధాలు కలిగుండాలి. నమ్మకమైన స్నేహితులు, కుటుంబసభ్యులు, ఇరుగుపొరుగుతో మనసును బాధిస్తున్న విషయాలను చెప్పుకోవాలి. దీంతో మనసు తేలికపడుతుంది. ఒత్తిడి దరిజేరదు.

  ఎలా తగ్గించుకోవాలి?

 • ఒత్తిడి లక్షణాలు కనిపించినప్పుడు వ్యాయామం చేయటం మంచిది. కొద్దిసేపు నడిచినా మూడ్‌ మెరుగవుతుంది.
 •  రాత్రి పడుకునే ముందు ఆ రోజు చేసిన పనులను సమీక్షించుకోవాలి. ఏవైనా పూర్తి చేయకపోతే కారణమేంటో గుర్తించాలి. అప్పుడు ఆదుర్దా తగ్గి, ప్రశాంతత చేకూరుతుంది.
 •  రోజు, వారం, నెల వారీగా లక్ష్యాలను నిర్ణయించుకోవాలి. లక్ష్యాన్ని విభజించుకుంటే సాధించటం తేలికవుతుంది. దీర్ఘకాల లక్ష్యాలను సమయానికి చేరుకోవటం సాధ్యమవుతుంది.
 • ఒత్తిడి నుంచి బయటపడటం లేదని గుర్తిస్తే నిపుణుల సాయం తీసుకోవాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని