పక్షవాతానికో రక్తపరీక్ష!

కొలెస్ట్రాల్‌ పరీక్షతో గుండెపోటు ముప్పును అంచనా వేస్తుంటారు కదా. మున్ముందు పక్షవాతం ముప్పునూ ఇలాగే పసిగట్టినా ఆశ్చర్యపోనవసరం లేదు.

Published : 07 May 2024 00:18 IST

కొలెస్ట్రాల్‌ పరీక్షతో గుండెపోటు ముప్పును అంచనా వేస్తుంటారు కదా. మున్ముందు పక్షవాతం ముప్పునూ ఇలాగే పసిగట్టినా ఆశ్చర్యపోనవసరం లేదు. అమెరికా పరిశోధకులు అలాంటి తేలికైన రక్త పరీక్షనే ప్రతిపాదించారు మరి. ఇది వాపు ప్రక్రియను ప్రేరేపించే ఇంటర్‌ల్యూకీన్‌(ఐఎల్‌)-18 ప్రొటీన్‌తో ముడిపడిన ఆరు సూచికల మోతాదుల ఆధారంగా పక్షవాతం ముప్పును అంచనా వేయటానికి తోడ్పడుతుంది.

ప్రస్తుతం మెదడు ఎంఆర్‌ఐ స్కాన్‌, కుటుంబంలో ఎవరైనా పక్షవాతం బారినపడటం, అధిక రక్తపోటు వంటి ఇతరత్రా ముప్పు కారకాల ఆధారంగా పక్షవాతం ముప్పును నిర్ధిస్తున్నారు. అయితే అప్పటికే పక్షవాతం వచ్చి ఉండటం లేదా మెదడులో రక్తస్రావం వంటి మార్పులతోనే చాలామందిలో ముప్పును పసి గడుతున్నారు. ఈ నేపథ్యంలో కొత్త పరీక్ష చాలా ఆసక్తి కలిగిస్తోంది. పక్షవాతానికీ ఐఎల్‌-18కూ మధ్య సంబంధం ఉంటున్నట్టు ఇప్పటికే రుజువైంది కూడా. ఉదాహరణకు- ఐఎల్‌-18 జన్యుమార్పులు గలవారికి పక్షవాతం ముప్పు పెరుగుతున్నట్టు చైనాలోని చింగ్‌డావ్‌ యూనివర్సిటీ పరిశోధకులు నిరూపించారు. రక్తంలో ఐల్‌-18 మోతాదులు పెరగటం మూలంగా తీవ్ర పక్షవాతం వస్తున్నట్టు షాంఘై జియావో టాంగ్‌ యూనివర్సిటీ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌ అధ్యయనంలోనూ బయటపడింది. దీని మోతాదులను పక్షవాతానికి జీవ సూచికలుగా పరిగణించాలనీ అది అప్పుడే సూచించింది. ఇన్‌ఫెక్షన్లతో పోరాడటం, స్వీయ రోగనిరోధక సమస్యలు, వాపు ప్రక్రియ (ఇన్‌ఫ్లమేషన్‌) వంటి పనుల్లో ఐఎల్‌-18 ప్రొటీన్‌ కీలక పాత్ర పోషిస్తుంది. తాజా అధ్యయనంలో దీంతో ముడిపడిన ఐదు మూలకాలను నిశితంగా విశ్లేషించారు. వీటి మోతాదుల ఆధారంగా స్కోరును కేటాయించారు. స్కోరు ఎక్కువగా వచ్చినవారికి 84% వరకూ పక్షవాతం వచ్చే అవకాశమున్నట్టు తేలింది. వీరికి పక్షవాతం ముప్పు 51% వరకూ ఎక్కువగా ఉంటుండటం గమనార్హం. అయితే ఈ పక్షవాతం ముప్పు స్కోరును తగ్గించుకునే అవకాశముందో లేదో అనేది స్పష్టంగా తెలియరాలేదు. కానీ పక్షవాతం రాకముందే ముప్పును అంచనా వేయటం సాధ్యమేననే విషయాన్ని ఇది రుజువు చేసింది. ఈ పరీక్ష అందుబాటులోకి వస్తే తేలికైన రక్త పరీక్షతో పక్షవాతం ముప్పును ముందుగానే తెలుసుకోవచ్చు. పెద్ద ప్రమాదాన్ని ముందుగానే గుర్తించి, తగు నివారణ చర్యలు తీసుకోవచ్చు. అంతకన్నా కావాల్సిందేముంది?


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు