స్వీయ గాయ సూచికలివీ..

యుక్తవయసులో భావోద్వేగాలు ఉద్ధృతంగా ఉంటాయి. కొందరు వీటిని తట్టుకోలేక తమను తాము గాయపరచుకుంటుంటారు కూడా.

Updated : 07 May 2024 00:44 IST

యుక్తవయసులో భావోద్వేగాలు ఉద్ధృతంగా ఉంటాయి. కొందరు వీటిని తట్టుకోలేక తమను తాము గాయపరచుకుంటుంటారు కూడా. అవతలి వ్యక్తులు తిరస్కరించటం, స్నేహితులతో వాదనలు.. ఆన్‌లైన్‌లోనో, నిజ జీవితంలోనో వేధింపులు, ఎగతాళికి గురికావటం.. చదువుల్లో రాణించలేకపోవటం.. ఇంట్లో ఆర్థిక సమస్యలు.. ఇలాంటివేవైనా దీనికి పురికొల్పొచ్చు. ఇలాంటి ధోరణి తక్కువని చాలామంది భావిస్తుంటారు గానీ తరచూ చూస్తూనే ఉంటాం. ప్రతి ఐదుగురిలో ఒకరు వీటికి పాల్పడుతున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. దీనికి కారణాలేంటి? గుర్తించటమెలా?

తమను తాము రకరకాలుగా గాయ పరచుకోవచ్చు. కానీ వీటన్నింటిలోనూ ఉమ్మడిగా కనిపించేవి మచ్చలు. పదునైన వస్తువులతో కోసుకోవటం, గుచ్చుకోవటం.. చర్మం ఊడివచ్చేలా గోకటం, రుద్దటం, గిల్లటం, కొరకటం.. మంటలు, వేడి వస్తువులతో కాల్చుకోవటం, వాతలు పెట్టుకోవటం.. తమను తామే కొట్టుకోవటం.. గోడల వంటి దృఢమైన వస్తువులకు గుద్దుకోవటం ద్వారా గాయలు చేసుకుంటుంటారు. అయితే వీటి జాడలను గుర్తించటం అంత తేలికైన పనికాదు. పిల్లలు చాలా తెలివైనవారు. వాటిని దాచటానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు.

  • తొడల లోపలి భాగం, కడుపు వంటి బయటికి అంతగా కనిపించని చోట్ల గాయపరచుకోవచ్చు.
  • పొడవైన చొక్కాలు, ప్యాంట్లు ధరించటం ద్వారా మచ్చలు బయటపడకుండా చూసుకోవచ్చు. వేడిగా ఉన్న సమయాల్లోనూ ఇలాంటి దుస్తులు ధరిస్తుంటారు. కొందరు వెడల్పయిన బ్రాస్లెట్లను వేసుకుంటుంటారు కూడా.
  • ప్రమాదాలు జరిగినప్పుడు వాడుకునే బ్యాండేజీల వంటివి అతిగా వాడుకోవటమూ కనిపిస్తుంటుంది.
  • గాయపరచుకునేవారు మానసిక ఒత్తిడి, ఆందోళన, కుంగుబాటు వంటి సమస్యలతోనూ బాధపడుతుండొచ్చు. కాబట్టి వీరిలో తరచూ మూడ్‌ మారటమూ కనిపిస్తుంటుంది కూడా.
  • ఎప్పుడూ ఒంటరిగా ఉండటం మరో లక్షణం. కొందరు కుటుంబం, స్నేహితులతో గడపకుండా ఎంతసేపూ ఒంటరిగా ఉండటానికే  ప్రయత్నిస్తుంటారు. ఇది కుంగుబాటుకు సంకేతం కావొచ్చు. గాయపరచుకోవాలని అనుకోవటానికి సూచన కావొచ్చు.

ఇంతకుముందు లేకుండా కొత్తగా పిల్లల్లో ఇలాంటి ధోరణి కనిపిస్తే ఏదో తేడా ఉందని అనుమానించటం మంచిది. వారితో అనునయంగా మాట్లాడటం, భరోసా కల్పించటం.. అవసరమైతే మానసిక నిపుణలను సంప్రదించటం ద్వారా సమస్య నుంచి బయటపడేలా చేయొచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని