Can Height Increases?: ఎంతెంత ఎత్తో..

అందరికీ ఎత్తు మీద మోజు! పొడవుగా ఉన్నవారు అన్నింట్లోనూ రాణిస్తారని, విజయం సాధిస్తారని అపోహ పడుతుంటారు. నిజానికి పొట్టిగా ఉన్నవారు సాధించిన విజయాలకు కొదవలేదు.

Updated : 28 Nov 2023 09:35 IST

అందరికీ ఎత్తు మీద మోజు! పొడవుగా ఉన్నవారు అన్నింట్లోనూ రాణిస్తారని, విజయం సాధిస్తారని అపోహ పడుతుంటారు. నిజానికి పొట్టిగా ఉన్నవారు సాధించిన విజయాలకు కొదవలేదు. అయినా కూడా కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలు పొడుగ్గా పెరగటానికి టానిక్కులు, మాత్రలు రాసివ్వాలని డాక్టర్లను అడుగుతుండటం కొత్తేమీ కాదు. నిరూపితం కాని, పరీక్షలకు నిలవని విటమిన్లు, పొడుల వంటివి పొడవు పెరగటానికి తోడ్పడతాయనే ప్రకటనలకూ కొదవలేదు. ఇవన్నీ మనల్ని తప్పుదారి పట్టించేవే. ఇంతకీ మన ఎత్తు దేని మీద ఆధారపడి ఉంటుంది? నిజంగా ఎత్తు పెరిగేలా చేసుకోవచ్చా?

ఒకే ఎత్తులో ఉండటానికి మనమేమీ ఫ్యాక్టరీల్లో తయారైన వస్తువులం కాదు. పొడవు, పొట్టిని నిర్ణయించటంలో రకరకాల అంశాలు పాలు పంచుకుంటాయి. ఇది వంశ పారంపర్యంగా సంక్రమించే ఏదో ఒక జన్యువు మీద ఆధారపడింది కాదు. పలు జన్యువులతో ముడిపడి ఉంటుంది. తల్లిదండ్రులిద్దరూ పొట్టిగా ఉంటే పిల్లలు పొడవుగా ఉండటం దాదాపు అసాధ్యమనే చెప్పుకోవచ్చు. కొందరికి తమ పిల్లలు పెద్దయ్యాక ఎంత పొడవుగా అవుతారో తెలుసుకోవాలనే ఆసక్తీ ఉంటుంది. దీన్ని లెక్కించటానికి రకరకాల పద్ధతులున్నాయి. ఒకటి- తల్లిదండ్రుల ఎత్తు. ఇద్దరి ఎత్తులను కొలిచి, రెండింటినీ కూడాలి. దీన్ని రెండుతో భాగిస్తే ఇద్దరి సగటు వయసు తెలుస్తుంది. దీనికి- అబ్బాయి అయితే 2.5 అంగుళాలు కలపాలి. అమ్మాయి అయితే 2.5 అంగుళాలు తీసేయ్యాలి. దీంతో చూచాయగా పిల్లలు పెద్దయ్యాక ఎంత పొడవు పెరుగుతారో తెలుస్తుంది. మరో పద్ధతి- రెండేళ్ల వయసు ఎత్తు. సాధారణంగా పిల్లలు రెండేళ్ల వయసులో ఎంత ఎత్తుంటారో, పెద్దయ్యాక దీనికి రెట్టింపు ఎత్తు వరకు పెరుగుతారు. ఒక అంగుళం అటూఇటూ కావొచ్చు. మూడోది- ఎముక వయసు. ఇది మరింత కచ్చితంగా గరిష్ఠ ఎత్తును తెలియజేస్తుంది. ఎడమ చేయి, మణికట్టు ఎక్స్‌రే తీసి.. ప్రామాణిక కొలతలతో లెక్కించి ఎముక వయసును గుర్తిస్తారు. ఆసుపత్రులు, క్లినిక్కుల్లో గ్రోత్‌ ఛార్ట్‌లూ అందుబాటులో ఉంటాయి. వీటి ద్వారా పెద్దయ్యాక ఎత్తును అంచనా వేయొచ్చు.

యవ్వనంలో ఉన్నట్టుండి

యవ్వనదశ ఆరంభంలో హార్మోన్ల ఉద్ధృతి మూలంగా ఉన్నట్టుండి పొడవు పెరుగుతారు. అమ్మాయిల్లో ఇది కాస్త ముందుగా మొదలవుతుంది. సాధారణంగా అమ్మాయిల్లో 15 ఏళ్లు, అబ్బాయిల్లో 18 ఏళ్లకు కాస్త అటూఇటూగా పొడవు పెరగటం ఆగిపోతుంది. ఈ వయసు తర్వాత శరీరంలో పొడవైన ఎముకల చివరి భాగం వృద్ధి కావటం నిలుస్తుంది. అందువల్ల ఒక వయసు తర్వాత ఎత్తు పెరగటమనేది సంక్లిష్టమనే చెప్పుకోవచ్చు. మరోవైపు వయసు మీద పడుతున్నకొద్దీ పొడవు తగ్గుతూ వస్తుంది. వృద్ధాప్యం వచ్చేసరికి సుమారు ఒకటి నుంచి మూడు అంగుళాల ఎత్తు తగ్గుతుంది. వెన్నెముకలోని డిస్కులు చదునుగా అవటం, కండరాలు క్షీణించటం, కీళ్ల మధ్య ఖాళీలు తగ్గటం, ఎముకలు పెళుసు బారటం వంటివన్నీ దీనికి కారణమవుతుంటాయి.

ఆహారమూ ముఖ్యమే

జీవితంలో అన్ని దశల్లోనూ పోషకాహారం చాలా ముఖ్యం. గర్భధారణ సమయంలో సరిగా తినకపోతే తల్లి, బిడ్డ ఇద్దరిలోనూ పోషణలేమి తలెత్తుతుంది. కాన్పు సమయంలో బిడ్డ చిన్నగా ఉండొచ్చు, పెద్దయ్యాక పొట్టిగా అవ్వచ్చు. పెద్దగా అయిన తర్వాతా పొడవు తగ్గకుండా చూసుకోవటానికి తగు పోషణ అవసరం. సహజ పదార్థాలు తినేలా చూసుకోవాలి. చక్కెర, ట్రాన్స్‌ఫ్యాట్స్‌ వంటివి కలిపి తయారుచేసే ఆహార ఉత్పత్తులకు దూరంగా ఉండాలి. జీవితాంతం రోజూ నాలుగైదు సార్లు తాజా పండ్లు, కూరగాయలు తినాలి. తగినంత బరువు ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి.

వ్యాయామ దన్ను

శారీరక శ్రమ, వ్యాయామంతో కండరాలతో పాటు ఎముకలూ బలోపేతమవుతాయి. ఇవి పిల్లలకూ అవసరమే. ముఖ్యంగా 13 నుంచి 19 ఏళ్ల వయసులో కడ్డీలు పట్టుకొని వేలాడటం వల్ల ఒకట్రెండు సెంటీమీటర్లు అదనంగా పొడవు పెరిగే అవకాశముంది. వ్యాయామంతో శరీర భంగిమ కూడా మెరుగవుతుంది. ఇదీ పొడవుగా కనిపించేలా చేస్తుంది. వెన్నెముక వంగిపోకుండానూ కాపాడుతుంది.

కంటి నిండా నిద్ర

నిద్రపోతున్నప్పుడే శరీరం ఎదుగుతుంది. ఎందుకంటే నిద్రించే సమయంలోనే గ్రోత్‌ హార్మోన్‌ విడుదలవుతుంది. కాబట్టి చిన్న పిల్లలకు మరింత ఎక్కువ నిద్ర అవసరం. ఒకవేళ పిల్లలు, ముఖ్యంగా 13-19 ఏళ్ల వయసులో తగినంత (రాత్రిపూట 8 నుంచి 10 గంటలసేపు) నిద్రపోకపోతే మొత్తంగా ఆరోగ్యమే కాదు.. పొడవు పెరగటమూ దెబ్బతింటుంది.

జబ్బుల ప్రభావమూ

ఒకవేళ పిల్లలు అసాధారణంగా పొట్టిగా ఉన్నా, సరిగా ఎదగకున్నా ఇతరత్రా సమస్యలేవైనా ఉన్నాయేమో చూడాలి. క్రాన్స్‌ లేదా సీలియాక్‌ జబ్బు, థైరాయిడ్‌ హార్మోన్‌ లోపం, డౌన్‌ సిండ్రోమ్‌ వంటి క్రోమోజోమ్‌ సమస్యలు, పీయూష గ్రంథి సమస్యల వంటివి పొడవు పెరగకుండా చేయొచ్చు. ఇలాంటి జబ్బులను ముందుగానే గుర్తించి, చికిత్స చేస్తే తగినంత ఎత్తు ఎదిగేలా చూసుకోవచ్చు.

పెంచుకోవాలనుకుంటే?

అవసరమైతే పొడవు పెంచటానికి కొన్ని మార్గాలు లేకపోలేదు. గ్రోత్‌ హార్మోన్‌ ఇంజెక్షన్లు, ఎముక పొడవు పెంచే శస్త్రచికిత్స దీనికి తోడ్పడతాయి. గ్రోత్‌ హార్మోన్‌ చాలా ఖరీదైంది. చికిత్సకు ఎక్కువ కాలం పడుతుంది. గుండె మీద విపరీత ప్రభావం చూపొచ్చు. తీవ్రమైన దుష్పరిణామాలకు దారితీయొచ్చు. ఎముక పొడవు పెంచే శస్త్రచికిత్స కూడా కష్టమైందే. దీన్ని చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. లేకపోతే విపరీత పరిణామాలు ఎదుర్కోవాల్సి రావొచ్చు.

పొట్టిగా ఉంటేనేం?

పొట్టిగా ఉన్నామని చింతించాల్సిన పనిలేదు. దీంతోనూ కొన్ని ప్రయోజనాలున్నాయి. వైద్యపరంగా చూస్తే- పొట్టివారిలో బరువు అదుపులో ఉంచుకున్నవారు ఎక్కువకాలం జీవించే అవకాశముంది. గుండెజబ్బు, పక్షవాతం, చివరికి క్యాన్సర్‌ వచ్చే అవకాశాలూ తక్కువే.
 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని