కాళ్లు హాయిగా

కాళ్లలో ఏదో పాకుతున్నట్టో, దురద పెడుతున్నట్టో ఉండొచ్చు. లేదూ లాగుతున్నట్టో, మండుతున్నట్టో, సూదులతో పొడుస్తున్నట్టో అనిపించొచ్చు. మొత్తమ్మీదో ఏదో అసౌకర్యంగా ఉంటుంది.

Published : 14 Feb 2023 00:09 IST

కాళ్లలో ఏదో పాకుతున్నట్టో, దురద పెడుతున్నట్టో ఉండొచ్చు. లేదూ లాగుతున్నట్టో, మండుతున్నట్టో, సూదులతో పొడుస్తున్నట్టో అనిపించొచ్చు. మొత్తమ్మీదో ఏదో అసౌకర్యంగా ఉంటుంది. వెంటనే అప్రయత్నంగా కాళ్లను కదిలించటం మొదలవుతుంది. ఇలా అదేపనిగా కాళ్లను కదిపే సమస్య (రెస్ట్‌లెస్‌ లెగ్‌ సిండ్రోమ్‌- ఆర్‌ఎల్‌ఎస్‌) తరచూ చూసేదే. చాలామంది ఇదేమీ హాని చేయదనే భావిస్తుంటారు. నిజానికిది తీవ్రమైన సమస్యేమీ కాదు కూడా. కానీ నిద్రను బాగానే ప్రభావితం చేస్తుంది. సాయంత్రం, రాత్రి వేళల్లోనే దీని లక్షణాలు తీవ్రమవుతుంటాయి. అయితే కొన్ని చిట్కాలతో దీన్నుంచి ఉపశమనం పొందే అవకాశం లేకపోలేదు.

ఆలస్యంగా నిద్రించటం

* రాత్రిపూట కాస్త ఆలస్యంగా నిద్రకు ఉపక్రమించి, పొద్దున కాస్త ఆలస్యంగా లేవటం మంచి ఫలితం చూపిస్తుంది. తెల్లవారు జామున పట్టే గాఢ నిద్ర పొద్దున హుషారు, హాయి భావనను  కలిగిస్తుంది.

వేళకు పడుకోవటం

* రోజూ ఒకే సమయానికి పడుకోవటం, లేవటం అలవాటు చేసుకుంటే కొంతవరకు కాళ్లను కదిలించటాన్ని సరిచేసుకోవచ్చు. ఎంతసేపు నిద్రపోతే హాయిగా ఉంటుందనేది ఎవరికి వారే తెలుసుకొని, ఆచరించాలి. చాలామందికి రోజుకు 7-9 గంటల నిద్ర అవసరమవుతుంది.

పడుకోవటానికి ముందు సాగదీత

* రాత్రి పడుకోవటానికి ముందు కాలి కండరాలను నెమ్మదిగా సాగదీసే ప్రయత్నం చేయాలి. ఇందుకు పిక్క సాగదీత వ్యాయామం బాగా ఉపయోగపడుతుంది. తిన్నగా నిల్చొని, ఒక కాలును ముందుకు జరపాలి. వెనక కాలు, వీపును తిన్నగా ఉంచుతూ ముందు కాలు మీద బరువు వేసి వంగాలి. కాసేపు అలాగే ఉండి.. రెండో కాలుతోనూ ఇలాగే చేయాలి. దీంతో పిక్క కండరాలు సాగి అసౌకర్యం తగ్గుతుంది. కాలి కండరాలను సాగదీసే యోగాసనాలూ ఉపయోగపడతాయి.

మర్దన

* పడుకునే ముందు పిక్క కండరాలను నెమ్మదిగా మర్దన చేసినా మంచి ఫలితం కనిపిస్తుంది. ఇది కాళ్లకు హాయిని కలిగించటమే కాదు, నిద్ర బాగా పట్టటానికీ తోడ్పడుతుంది.

కెఫీన్‌ తగ్గించాలి

* కాఫీ, టీ, చాక్లెట్‌, కోలా వంటి వాటిల్లో కెఫీన్‌ ఉంటుంది. ఇవి తక్షణ ఉత్సాహం ఇస్తుండొచ్చు గానీ కాళ్లలో అసౌకర్యాన్ని ఎక్కువ చేస్తాయి. కెఫీన్‌ను తీసుకున్న తర్వాత 12 గంటల వరకూ దీని ప్రభావం ఉండొచ్చు. కాబట్టి కాఫీ వంటివి తగ్గించుకోవాలి. దీంతో నిద్ర పట్టే అవకాశముంటుంది.
* పొగ, మద్యం అలవాట్లకూ దూరంగా ఉండాలి. ఇవి సమస్యను ఎక్కువ చేయటమే కాదు.. నిద్ర పట్టకుండానూ చేస్తాయి. మద్యంతో మొదట్లో మత్తు వచ్చినా మధ్యలో మెలకువ వచ్చేస్తుంది. తిరిగి నిద్ర పట్టటమూ కష్టమవుతుంది. సిగరెట్లలోని నికొటిన్‌ కాళ్లలో అసౌకర్యాన్ని ప్రేరేపిస్తుంది.

గోరు వెచ్చటి నీటి స్నానం

* పడుకోవటానికి ముందు గోరు వెచ్చటి నీటితో స్నానం చేయటం మంచిది. ఆర్‌ఎల్‌ఎస్‌ లక్షణాలు తగ్గటానికీ తోడ్పడుతుంది.

వేడి కాపు

* కాలి కండరాల్లో ఉష్ణోగ్రత మార్పులతో ఊరట కలగొచ్చు. కొందరికి వేడి కాపు హాయిగా అనిపించొచ్చు. కొందరికి ఐస్‌ ప్యాక్‌తో ఉపశమనం కలగొచ్చు. ఏది పనిచేస్తే దాన్ని ఉపయోగించొచ్చు. కొందరికి చన్నీటి స్నానంతోనూ హాయి చేకూరొచ్చు.

మెదడకు మేత

* కదలకుండా కూర్చుంటే కాళ్లను కదపాలనే కోరిక ఎక్కువవుతుంది. సాయంత్రం వేళ టీవీ చూస్తున్నప్పుడో, బస్సులో కూర్చున్నప్పుడో కొందరికి దీని లక్షణాలు పెరుగుతుంటాయి. కాబట్టి వీటి నుంచి ధ్యాసను మళ్లించే ప్రయత్నం చేయాలి. పజిళ్లు పూరించటం, పుస్తకం చదవటం, వీడియో గేమ్‌ ఆడటం వంటివి లక్షణాలు తగ్గటానికి తోడ్పడొచ్చు.

గాఢంగా శ్వాస

* మానసిక ఒత్తిడితో అసౌకర్యం ఎక్కువవుతుంది. నెమ్మదిగా, గాఢంగా శ్వాస తీసుకోవటం, వదలటం ద్వారా ప్రశాంతత చేకూరుతుంది. ఒత్తిడీ తగ్గుతుంది. పడుకోవటానికి ముందు మసక వెలుతురులో శ్రావ్యమైన సంగీతాన్ని వినటమూ మేలు చేస్తుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని