‘ఏనా’డో విరిసిన విజయం!

ఎగుడు దిగుడు రహదారులు.. ఎక్కడ చూసినా పేడ! కనీస వసతులూ కష్టం. గూళ్లలాంటి గుడిసెలు. పాతకాలం నాటి మిద్దెలు! పల్లెటూళ్లు అంటే మన మదిలో దాదాపు ఇవే దృశ్యాలు దర్శనమిస్తాయి.

Published : 17 May 2023 00:26 IST

ఎగుడు దిగుడు రహదారులు.. ఎక్కడ చూసినా పేడ! కనీస వసతులూ కష్టం. గూళ్లలాంటి గుడిసెలు. పాతకాలం నాటి మిద్దెలు! పల్లెటూళ్లు అంటే మన మదిలో దాదాపు ఇవే దృశ్యాలు దర్శనమిస్తాయి. కానీ ఓ గ్రామం, నగరాలతో పోటీ పడుతోంది. పరిశుభ్రతకు పట్టం కడుతోంది. మరి ఆ ఊరి సంగతులేంటో తెలుసుకుందామా నేస్తాలూ!!

గుజరాత్‌ రాష్ట్రం సూరత్‌ జిల్లాలోని ఏనా గ్రామం. ఈ ఊరికి ఓ ముద్దు పేరు ఉంది. దీన్ని ఎన్‌.ఆర్‌.ఐ.ల గ్రామం అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఈ గ్రామంలో 250 కుటుంబాలుంటే, కనీసం ఇంటికి ఒక్కరైనా ఎన్‌.ఆర్‌.ఐ. ఉన్నారు మరి. ఈ గ్రామంలోని వీధులు చాలా పరిశుభ్రంగా ఉంటాయి. చూద్దామన్నా చెత్త కనిపించదు. పచ్చదనం, ప్రశాంతమైన వాతావరణం మనల్ని పలకరించి స్వాగతం పలుకుతుంది.

అద్దంలా మెరిసే...

ఏనా గ్రామంలోని ప్రధాన రహదారితోపాటు వీధుల్లోని రోడ్లు కూడా అద్దంలా మెరిసిపోతుంటాయి. ఎక్కడా గుంతలు కనిపించవు. విలాసవంతమైన, విశాలమైన ఇళ్లకు ఈ ఊళ్లో కొదవలేదు. కొన్ని వీధుల్లో మనం నడుస్తుంటే ఎక్కడో విదేశాల్లో ఉన్నామా మనం.. అనే భావన కలుగుతుంది. దాదాపు ప్రతి ఇంటి ముందు ఓ కారు పార్క్‌ చేసి కనబడుతుంది.

ఏ దేశమేగినా..!

విదేశాల్లో స్థిరపడ్డ ఏనా గ్రామానికి చెందిన ఎన్‌.ఆర్‌.ఐ.లకు సంవత్సరాలు గడుస్తున్నా... తమ ఊరిపై ప్రేమ మాత్రం తగ్గడం లేదు. అందుకే ఊరి అభివృద్ధి కోసం తమ వంతుగా పెద్ద ఎత్తున విరాళాలు పంపిస్తున్నారు. తాము విదేశాల్లో ఏవైతే సౌకర్యాలు అనుభవిస్తున్నామో, తమ ఊరిలో ప్రజలు కూడా వాటిని పొందాలనే వారు ఇలా చేస్తున్నారు. ఊళ్లో గుడి, పార్క్‌, మైదానం, డ్రైనేజీ వ్యవస్థ, తాగునీటి వసతి, రహదారులు ఇలా సకల సౌకర్యాలూ విదేశాల నుంచి ఈ గ్రామానికి చెందిన ఎన్‌.ఆర్‌.ఐ.లు పంపిన డబ్బుతోనే సాధ్యమైంది. అందుకే పచ్చని పల్లె పరవశించింది. ఇక్కడ విజయం విరిసింది. నేస్తాలూ... మొత్తానికి ఇవీ ‘ఏనా’ సంగతులు. మన దేశంలోని ప్రతి గ్రామమూ ఏనాడో ఒకనాడు ‘ఏనా’లా అభివృద్ధి చెందాలని మనమూ మనసారా కోరుకుందామా మరి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని