కర్మ.. దాని కథా కమామీషు

కర్మలు.. ఆగామి, సంచిత, ప్రారబ్ధ అంటూ మూడు రకాలు. చేసే పనుల ఫలితంగా వచ్చేవి ఆగామి కర్మలు. పితృదేవతల ద్వారా ప్రాప్తించేవి సంచిత కర్మలు.

Updated : 14 Mar 2023 13:43 IST

కర్మలు.. ఆగామి, సంచిత, ప్రారబ్ధ అంటూ మూడు రకాలు. చేసే పనుల ఫలితంగా వచ్చేవి ఆగామి కర్మలు. పితృదేవతల ద్వారా ప్రాప్తించేవి సంచిత కర్మలు. పూర్వజన్మ పాపపుణ్యాల వల్ల కలిగేవి ప్రారబ్ధ కర్మలు. పూజలు, యజ్ఞ యాగాలు, దైవ దర్శనం, మహాత్ముల సందర్శనం, పుష్కర స్నానాలు ఇత్యాదులతో ఆగామి కర్మల నుంచి విమోచనం పొందవచ్చు. తెలిసీ తెలియక సూక్ష్మజీవులను చంపడం లాంటి తప్పులు చేస్తాం. వాటి విమోచనకు పూజలు, వ్రతాలు చేసినట్లు పితృదేవతలకు తర్పణ ఆరాధన, యజ్ఞ, హోమాలతో సంచిత కర్మల నుంచి విముక్తి పొందవచ్చు. ప్రారబ్ధ కర్మలను మాత్రం అనుభవించి తీరాల్సిందే! అందుకే ‘ఎవరు చేసిన కర్మ వారనుభవింపక తప్పదన్నా..’ అన్నారు. మన సుఖదుఃఖాలకు మనోవాక్కాయ కర్మలే కారణం. సృష్టిక్రమంలో భగవంతుడి సంకల్పం, వేదవిజ్ఞానం ప్రకారం అందరికీ వర్తించే, ఎవరూ తప్పించుకోజాలని దేవుడి కఠిన చట్టం కర్మఫలం.
తక్షణమే ఫలితమందించే కర్మలు కొన్ని. ఆలస్యంగా ఫలితమందించేవి మరికొన్ని. ఈ సత్యాన్ని గుర్తించనివారు ‘దుర్మార్గం చేసి కూడా బాగున్నారు’ అంటుంటారు. కానీ దైవచట్టం ఎవరినీ విడిచిపెట్టదు. ఎప్పుడు, ఎలా- అంటే జవాబు దొరకదు. ప్రస్తుతం బాగున్నా.. శిక్ష అనుభవించే కాలం వస్తుంది. అదలా ఉంచితే కర్మఫలాన్ని కొంతమేర తప్పించుకునే మార్గం ఉంది. అదే దైవానుగ్రహం. ఇక్కడ గ్రహాలేమీ చేయలేవు. అందుకు మాటలూ, చేతలతో భగవంతుణ్ణి మెప్పించగలిగితే సరిపోతుంది.
డా.టేకుమళ్ల వెంకటప్పయ్య


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని