సద్గురువును ఆశ్రయిస్తేనే..

సన్యాసి అయినా, గృహస్థు అయినా సద్గురువు మార్గదర్శకత్వంలోనే ఆధ్యాత్మిక పురోగతిని సాధించగలరు.

Published : 25 Jan 2024 00:03 IST

న్యాసి అయినా, గృహస్థు అయినా సద్గురువు మార్గదర్శకత్వంలోనే ఆధ్యాత్మిక పురోగతిని సాధించగలరు. అర్హత లేని గురువును ఆశ్రయిస్తే.. ఆశ్రయం పొందిన వారు, ఇచ్చినవారూ కూడా భ్రష్టులవుతారు. దీనికి గురుదేవులు రామకృష్ణ పరమహంస చక్కని దృష్టాంతం చెప్పారు. వారు ఓ రోజు తాము పూజారిగా ఉన్న కోల్‌కతా దక్షిణేశ్వరంలో పంచవటి దిశగా వెళ్తుండగా.. సమీపంలోని సరుగుడు తోపు నుంచి ఓ కప్ప దీనారావం వినిపించింది. ఆయన కుటీరంలో చాలా సేపు ధ్యానం చేసుకొని తిరిగి వస్తున్నప్పుడు కూడా కప్ప అలాగే అరుస్తోంది. అది ఎందుకలా దీనంగా శబ్దం చేస్తోందని పరమహంస అటుగా వెళ్లారు. చిన్న పాము కప్పను నోట చిక్కించుకుంది. పాము సన్నగా ఉండటంతో కప్పను మింగలేకపోతోంది. అలాగని వదలడంలేదు. అందుకే కప్ప అరుస్తోంది. సద్గురువు కాని వ్యక్తి చేతిలో పడిన శిష్యుల పరిస్థితి.. బతకలేక, మోక్షం పొందలేక అన్నట్టు ఇలాగే ఉంటుందంటూ చెప్పారు పరమహంస. ‘సద్గురువు లభిస్తే.. శిష్యుడి సంశయాలన్నీ తీరి, బంధాలన్నీ తొలగి ప్రశాంతత పొందుతాడు. అదే శిష్యుడు అర్హత లేని గురువును ఆశ్రయిస్తే.. శిష్యుడికి ఉన్న కష్టాలకు తోడు మరిన్ని కష్టాలు వచ్చిపడతాయి. సంశయాలు తీరకపోగా, కొత్త సందేహాలు జత చేరతాయి. అవస్థ తప్పదు. సద్గురువులు బోధ గురువులు, అర్హత లేని గురువులు బాధ గురువులు’ అంటూ వివరించారు పరమహంస.

ప్రహ్లాద్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు