సమచిత్తమే సాధన..

రమణ మహర్షి ఆశ్రమంలో ఒకసారి భక్తుల మధ్య వివాదం వచ్చింది. చాలా కాలంగా అక్కడికి వస్తున్న భక్తులకూ, అప్పుడప్పుడే ఆశ్రమాన్ని సందర్శిస్తున్న భక్తులకూ మధ్య భేదాభిప్రాయాలు తలెత్తాయి

Updated : 18 Apr 2024 04:28 IST

రమణ మహర్షి ఆశ్రమంలో ఒకసారి భక్తుల మధ్య వివాదం వచ్చింది. చాలా కాలంగా అక్కడికి వస్తున్న భక్తులకూ, అప్పుడప్పుడే ఆశ్రమాన్ని సందర్శిస్తున్న భక్తులకూ మధ్య భేదాభిప్రాయాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో భక్తుల్లో రెండు వర్గాలు బయల్దేరి, ఒకరంటే మరొకరికి పడని పరిస్థితి ఏర్పడింది. పాతభక్తులు, కొత్తభక్తులు అంటూ విభజనను సృష్టించుకుని, రెండు వర్గాలుగా విడిపోయారు. సమయం చిక్కినప్పుడల్లా ఒకరిపై మరొకరు అసహనం ప్రదర్శించడం, పరస్పరం దూషించుకోవడం సాగుతోంది. ఇది రమణులు గమనించారు. ఓ రోజు సాయంత్రం మహర్షి గిరి ప్రదక్షిణకు బయల్దేరారు. భక్తులు ఆయనను అనుసరిస్తున్నారు. ఆశ్రమంలో ఎప్పటి నుంచో ఉంటున్న కొన్ని కుక్కలు, ఆశ్రమం గేటు బయట ఉన్న కుక్కల్ని చూసి మొరగసాగాయి. ఆ దృశ్యాన్ని చూసిన రమణులు ‘పాపం కుక్కలు కదూ! తామంతా ఒకటేనని తెలియక మూర్ఖత్వంతో పాతవి, కొత్తవిగా విడిపోయి అరుచుకుంటూ అలసి పోతున్నాయి’ అంటూ ముందుకు సాగారు. అంతే.. ఆ రోజు నుంచి ఆశ్రమంలో భక్తుల నోళ్లు మూతపడ్డాయి. ‘భజగోవిందం’ ప్రబోధంలో ఆదిశంకరాచార్యుల వారి శిష్యుడు మేధాతిథి ‘వేరొకరితో విభేదాలను పెంచుకోవటం; తమవారు, పరాయివారు- అంటూ పక్షపాత వైఖరి చూపడం సరికాదు. సర్వాంతర్యామి అయిన పరమాత్మను చేరుకోవాలంటే అందరిపై సమదృష్టిని చూపాలి’ అన్నారు. రమణులు కూడా ‘సమచిత్తమే పారమార్థిక సాధన’ అంటూ చెప్పేవారు.  

- చైతన్య


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని