సుబ్రహ్మణ్య షష్ఠి

పరమేశ్వరుడి తనయుడైన కుమారస్వామినే స్కందుడని, కార్తికేయుడని, సుబ్రహ్మణ్యేశ్వరుడని, తెలుగునాట సుబ్బరాయుడని వ్యవహరిస్తారు. మార్గశిర శుక్ల షష్ఠినాడు కుమారస్వామి తారకాసురుని సంహరించి తారకాధిపతిలా ప్రకాశించాడని, ఈ తిథి అతడికి ప్రియమైనదని భవిష్యోత్తరం చెబుతోంది.

Updated : 14 Mar 2023 18:39 IST

నవంబర్‌ 29

పరమేశ్వరుడి తనయుడైన కుమారస్వామినే స్కందుడని, కార్తికేయుడని, సుబ్రహ్మణ్యేశ్వరుడని, తెలుగునాట సుబ్బరాయుడని వ్యవహరిస్తారు. మార్గశిర శుక్ల షష్ఠినాడు కుమారస్వామి తారకాసురుని సంహరించి తారకాధిపతిలా ప్రకాశించాడని, ఈ తిథి అతడికి ప్రియమైనదని భవిష్యోత్తరం చెబుతోంది. కుమారస్వామి జన్మించిన షష్ఠి గనుక దీన్ని సుబ్రహ్మణ్య షష్ఠిగా వ్యవహరిస్తారని వ్రత చూడామణి పేర్కొంటోంది. కార్తికేయుడు దేవసేనాధిపత్యం పొందిన తిథిగానూ కొన్ని పురాణాలు చెబుతున్నాయి.

కుమారస్వామి జననం గురించి పురాణాలు భిన్న గాథలు పేర్కొంటున్నాయి. శివపార్వతులు మన్మథ క్రీడలో ఉండగా తనను మించిన ప్రభావవంతుడు ఉదయిస్తాడని ఇంద్రుడు భయపడి వారికి అంతరాయం కలిగించడానికి అగ్నిని నియమిస్తాడు. అగ్నిని చూసిన శివుడు పార్వతికి దూరం కాగా భూమిపై పడనున్న శివతేజాన్ని అగ్ని గ్రహించి దాన్ని భరించలేక గంగలో వదిలాడు. గంగ దాన్ని తన తీరంలోని రెల్లుపొదల్లో జారవిడిచింది. ఆ శరవనంలో జన్మించడం వల్ల శరవణుడయ్యాడు. కృత్తికలుగా పిలిచే ఆరుగురు ముని కన్యలు ఆ శిశువును తీసుకొనిపోయి బదరికావనం చేర్చారు. కృత్తికలు పెంచినవాడు కనుక కార్తికేయుడయ్యాడు.

బ్రహ్మ మానస పుత్రుల్లో సనత్కుమారుడు ఒకడు. ఆయన సంపూర్ణ వైరాగ్యమూర్తి. తన తపస్సు తప్ప ప్రపంచం, సుఖదుఃఖాలను గురించిన చింత లేనివాడు. అటువంటివాడికి ఒకనాడు ఒక కల వచ్చింది. కలలో తాను దేవసేనాధిపత్యం వహించి రాక్షసులతో యుద్ధం చేస్తున్న దృశ్యం కనిపించింది. వెంటనే బ్రహ్మ వద్దకు వెళ్ళి ఇహలోకమే వద్దనుకునే నాకు ఈ కల ఏమిటని అడిగాడు. బ్రహ్మ దివ్యదృష్టితో పరిశీలించి ‘అది అలా జరగబోతోంది కాబట్టి కలగా వచ్చింది. కానీ, ఇది రాబోయే జన్మలోనిది’ అని చెప్పాడు. ఇది శివ పార్వతులకు తెలిసింది. సనత్కుమారుడంతటివాడికి మరో జన్మ ఉంటే అతడు తమకే సంతానమైతే బాగుంటుందని వారికి అభిప్రాయం కలిగింది.

సనత్కుమారుడు తపస్సు చేసుకుంటున్న ప్రదేశానికి శివుడు వెళ్లాడు. తపోనిమగ్నుడైన సనత్కుమారుడు శివుణ్ని పట్టించుకోలేదు. కోపించిన శివుడు ‘లయకర్తనైన నేనే స్వయంగా వచ్చినా పలకరించవా’ అని గద్దించాడు. ‘శపించగలను జాగ్రత్త’ అని హెచ్చరించాడు. కళ్లు తెరచిన సనత్కుమారుడు ‘శాప ఫలితం నా దేహానికే గాని ఆత్మకు కాదు గదా’ అన్నాడు. శపిస్తానన్నా భయపడని వైరాగ్యమూర్తిని చూసి ఆశ్చర్యపోయిన శివుడు సనత్కుమారుడితో ఆదరంగా ‘నీకు వరం ఇస్తాను... కోరుకో’ అన్నాడు. దానికి అతడు ‘ప్రపంచం మీద ఏ ఆశా లేని నాకు వరం దేనికి? కావలిస్తే నీకే వరమిస్తాను కోరుకో’ అన్నాడు. వచ్చిన అవకాశం జారవిడువరాదని భావించిన శివుడు ‘స్వామీ! నీవంటి వైరాగ్య సంపన్నుడు నాకు పుత్రుడిగా జన్మించా’లని కోరుకొన్నాడు. ఆయన అంగీకరించాడు.

ఇది విన్న పార్వతి పురుషుడివైన నువ్వు ‘నాకు పుత్రుడిగా’ అన్నావు కదా. పురుషుడికి గర్భధారణ ఎలా? మళ్ళీ వెళ్లి ‘మాకు పుత్రుడు’గా అని అడగమంది. కానీ తపోనిష్ఠలో ఉన్న సనత్కుమారుడి నుంచి బదులు లేదు. కొంతకాలానికి అతడు ఒక నిప్పు ముద్దగా శంకరుడిలో ప్రవేశించాడు. అది శివుడి మూడో కంటి నుంచి వెలువడి వేగంగా వెళ్లి శరవనంలో పడింది. ఆ నిప్పు ముద్ద ఒక కుమారుడి రూపం ధరించగా కృత్తికా స్త్రీలు ఆరుగురు తమ స్తన్యంతో పోషించారు. అందుకే ‘షణ్ముఖు’డయ్యాడు. ఇది మరొక గాథ.

సుబ్రహ్మణ్యస్వామి వాహనం నెమలి. ఇంద్రుడి కుమార్తె దేవసేన, శివ ముని పుత్రిక వల్లీదేవి ఇతడి పత్నులుగా పురాణాలు చెబుతున్నాయి.తమిళుల దైవారాధనలో స్కంద పూజకు విశేష ప్రాచుర్యం ఉంది. అక్కడ ప్రసిద్ధ సుబ్రహ్మణ్య క్షేత్రాలున్నాయి. తెలుగునాట కొన్ని ప్రాంతాల్లో ఈ దినం పుట్టలో పాలుపోసే సంప్రదాయమూ ఉంది. పంచారామాల్లో ఒకటి సామర్లకోటలోని స్కందారామం. ఇక్కడి శివలింగాన్ని కుమారస్వామి ప్రతిష్ఠించినట్లు చెబుతారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని