పుణ్య కార్య సోపానం ధనుర్మాసం
డిసెంబరు 16 ధనుర్మాస ప్రారంభం
మంచు తెరల మాటున హేమంత రుతుశోభను ఇనుమడించే పుణ్యమాసం. బంతులు, చేమంతులు, జాజులు, విరజాజులు.. మృదుమధుర గాజుల గలగలలు.. పరంధాముడి కరుణకోసం ఆరాధనలు.. ఇలా శోభాయమానమైన పవిత్రమాసం ధనుర్మాసం.
ప్రకృతి వన్నెలకు నెలవు, పర్యావరణ పరిరక్షణకు నిలువుటద్దంగా వెలుగులు విరజిమ్ముతుంది ధనుర్మాసం. పాశుర గానాలతో ముగ్గు ముచ్చట్లు, గొబ్బిపాటలు, గంగిరెద్దుల ఆటలు, దేవదేవుడి హరినామ స్మరణలతో అలరారుతుంది. చల్లని గాలుల మధ్య పూజలూ వ్రతాల సందడికి శ్రీకారం చుడుతుందీ మాసం. అయితే చైత్రం, వైశాఖం, జ్యేష్ఠం- ఇది కదా మన మాసాల వరుస క్రమం. మరి ఆ వరుసలో ధనుర్మాసం పేరు లేదేమిటనేది కొందరి సందేహం. అది తీరాలంటే మాసాల కోసం మానాలను తెలుసుకోవాలి. మానం అంటే కొలత అనే అర్థం కూడా ఉంది. కాలాన్ని కొలిచేందుకు అద్భుత గణన విధానాన్ని అనుసరించారు మహర్షులు. క్షణం అంటేనే అతి సూక్ష్మ విభజన. కానీ క్షణంలో సూక్ష్మాతి సూక్ష్మ విభాగాలైన లవం, తృటి కూడా చూడగలిగిన ఘనత వారిది. అలా గణించగా సూర్యుడు ధనుస్సు రాశిలో ప్రవేశించి మకరంలోకి వెళ్లే సమయం ధనుర్మాసం. సూర్యుడు ధనూరాశిలో ప్రవేశించడాన్ని పండుగ నెలపట్టడం అంటారు. ఈ నెలరోజులెంతో విశిష్టమని పురాణాలూ, ఇతిహాసాలూ కొనియాడాయి. గీతలో కృష్ణపరమాత్ముడు ‘మాసానాం మార్గ శీర్షిహం’ అన్నాడు. అంత శుభమాసమైనప్పటికీ ఈ నెలలో కొన్ని రోజులను మన పూర్వీకులు శూన్యమాసంగా పరిగణించారు.
నెలంతా కోలాహలమే
ధనుర్మాసంలో వేకువజామునే లేచి విష్ణుమూర్తిని పూజిస్తారు. అలాగే నిత్యం సూర్యభగవానుణ్ణి ఆరాధిస్తారు. వాకిట్లో కళ్లాపి చల్లి ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెడతారు. వాటిని పసుపుకుంకుమలు, పూలతో అలంకరించి పూజిస్తారు. హరిదాసుల సంకీర్తన, గంగిరెద్దుల కోలాహలం ఈ సందళ్లన్నీ ధనుర్మాసం నెల పట్టింది మెదలు చివరి దాకా కొనసాగుతాయి. వీటన్నిటా దైవధ్యానం, పర్యావరణ పరిరక్షణ, పరిశుభ్రత ఇమిడి ఉన్నాయి.
సౌరమానం.. చాంద్రమానం
చంద్రమానం, సౌరమానం, సావనమానం, నాక్షత్రమానం, బార్హస్పత్యమానం- అనే వాటి ప్రకారం మాసాలు ఏర్పడతాయి. చాంద్రమానం 27 నక్షత్రాల ప్రకారం ఉంటుంది. పౌర్ణమి రోజున ఏ నక్షత్రం ఉంటే ఆ మాసం పేరు వస్తుంది. ఉదాహరణకు చిత్తా(చిత్ర) నక్షత్రం ఉంటే చైత్రమాసం, విశాఖ ఉంటే వైశాఖమాసం. దక్షిణాదిన తెలుగు రాష్ట్రాల్లో శుభలేఖల్లో ‘...సంవత్సర ...చాంద్ర మానేన’ అంటూ రాసేది ఈ సూత్రాన్ని అనుసరించే. అలాగే సూర్యుడు ఒక్కో రాశిని దాటడాన్ని బట్టి సౌరమానాన్ని లెక్కిస్తారు. రవి కర్కాటకంలో ప్రవేశించే సమయాన్ని కర్కాటక సంక్రమణం అని, ఆ రాశిలో సంచరించే కాలాన్ని కర్కాటక మాసమని అంటారు.
మన ఏడాది దేవతలకు ఒకరోజు
సంవత్సరంలో రెండు అయనాలుంటాయి. సూర్యుడు కర్కాటకరాశిలో ప్రవేశించి నప్పటి నుంచి దక్షిణాయనం. ఇది దేవతలకు రాత్రి. మకరసంక్రమణతో ఉత్తరాయణం మొదలవుతుంది. ఇది పగటిపూట. అంటే మన సంవత్సర కాలం దేవతలకు ఒకరోజు కింద లెక్క. దక్షిణాయనానికి చివరిది, ఉత్తరాయణానికి ముందుది అయిన ఈ ధనుర్మాసం పూజాదికాలకు పరమ పవిత్రం, సాత్వికారాధనలకు ప్రధానం. అందుకే సత్వగుణ ప్రధానుడైన విష్ణుమూర్తిని ఈ నెలలో ఆరాధిస్తారు. అలాగే ఈ మాసంలో గోదాదేవి రోజుకొక పాశురం చెబుతూ తిరుప్పావై వ్రతం చేసి విష్ణు సాయుజ్యాన్ని పొందింది.
ఒక సంవత్సరంలో చాంద్రమాన, సౌరమానాల రోజుల సంఖ్యలో ఉండే తేడాను సరిచేయడానికి అధికమాసం, క్షయమాసం, శూన్యమాసం- అంటూ కొన్ని రోజులను లెక్కకట్టారు. కాలస్వరూపుడు అయిన భగవంతుడి ఆరాధనలోనే కాలం గడపాలని చెబుతారు. ఎవరు ఏ మానం ప్రకారం నడుచుకున్నా చివరికి అంతా ఒక గీత మీదికి రావాలన్నదే ఇందులో ఉన్న అర్థం, పరమార్థం.
శూన్యమాసమంటే...
సౌరమాన, చాంద్రమానాల ప్రకారం కలిసుండే కొన్ని మాసాలను శూన్య మాసాలంటారు. ఉదాహరణకు సూర్యమానం ప్రకారం ధనుర్మాసం, చాంద్రమానం ప్రకారం పుష్యమాసం కలిసి ఉన్న కొన్ని రోజులు శూన్యమాసం అవుతుంది. అలాగని ధనుర్మాసం అంతా శూన్యమాసం కాదు. అలాగే పుష్యమాసం మొత్తం శూన్యమాసం కాదు. మీన మాసంతో కూడిన చైత్రం, మిథునంతో కూడిన ఆషాఢం, కన్యతో కూడిన భాద్రపద మాసాలు శూన్యమాసాలు. ఈ కాలంలో శుభకార్యాలకు ముహూర్తాలు ఉండవు. దైవకార్యాలు, పితృకార్యాలే ఆచరిస్తారు. అధిక, క్షయ మాసాల్లోనూ ముహూర్తాలు ఉండవు. ధనుర్మాసంలో కొన్ని రోజులను శూన్యంగా భావించి పెళ్లిళ్లు లాంటి వాటికి దూరంగా ఉండి పూజలు, వ్రతాలు చేస్తారు. ఈ నియమం వల్ల లౌకిక విషయాలకు దూరంగా ఉంటూ భగవదారాధనలో తరించేందుకు ఎక్కువ సమయం దొరుకుతుంది. అందుకే ఈ మాసాన్ని పుణ్య కార్య సాధనంగా భావిస్తారు.
యల్లాప్రగాడ మల్లికార్జున రావు
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
2023 సంవత్సరం.. మార్చి 23వ తేదీ.. 23 ఓట్లు
-
India News
విశ్వసించే వారందరికీ శ్రీరాముడు దేవుడే: ఫరూక్ అబ్దుల్లా
-
Sports News
దిల్లీని ఢీకొట్టేదెవరో?.. నేడే ముంబయి-యూపీ ఎలిమినేటర్
-
Ts-top-news News
పసిపాపకు మంత్రి హరీశ్‌రావు అండ.. ‘ఈనాడు’ కథనానికి స్పందన
-
World News
Russia: ‘పుతిన్‌ను అరెస్టు చేయడమంటే.. యుద్ధాన్ని ప్రకటించినట్లే!’
-
India News
Anand Mahindra: తోలుబొమ్మ ‘నాటు నాటు’.. ఆనంద్ మహీంద్రా పోస్ట్ వైరల్