కోరుకున్నంతకాలం బతకొచ్చు

ప్రాణం, దేహం, మనసు కాలం తీరిపోగానే సహజంగా నశిస్తాయి. కానీ ప్రయత్నిస్తే చావును జయించవచ్చని, అదృశ్య రూప పరివర్తనం చెందవచ్చని ఆత్మబోధలో ఆదిశంకరులు చెప్పారు.

Updated : 14 Mar 2023 13:25 IST

ఫిబ్రవరి 1 భీష్మ ఏకాదశి

ప్రాణం, దేహం, మనసు కాలం తీరిపోగానే సహజంగా నశిస్తాయి. కానీ ప్రయత్నిస్తే చావును జయించవచ్చని, అదృశ్య రూప పరివర్తనం చెందవచ్చని ఆత్మబోధలో ఆదిశంకరులు చెప్పారు. ఇదెలా సాధ్యమంటే, చంచలమైన మనసును చలించే వాయువు కలిగిన అనాహత చక్రంలో విలీనం చేయాలి. దీంతో సత్యం అంటే ఏమిటో తెలిసిన పరుగులు పెట్టే మనసు తన ఆటను అటకెక్కిస్తుంది. అలాగే ప్రాణాన్ని త్రికాల జ్ఞానం ఇచ్చే ఆజ్ఞా చక్రంలో ఉంచాలి. దీనివల్ల ప్రాణానికి ఎప్పుడు నిష్క్రమించాలి అనే జ్ఞానం కలుగుతుంది. భీష్ముని ఇచ్ఛా మరణంలో దాగిన రహస్యమిదే. ఇక దేహాన్నీ, దేహాభిమానాన్నీ విశుద్ధచక్రంలో లీనం చేయాలి. విశుద్ధమంటే మలినం లేనిది. ఈ చక్ర దేవత డాకినీదేవి. ఇక జీవి పిండదశలో ఎరుపు, తెలుపుల మేళవింపుతో బిందు రూపంగా ఉంటుంది. 15 రోజుల తర్వాత బుడగ రూపం చెంది, మరో పక్షం తర్వాత గట్టిపడి, 45 రోజులకి పిండాకృతి పొందుతుంది. ఇదే స్థితిని డాకినీ స్థితి. అంటే దేహం ఏర్పడటానికి కారణమైన డాకిని నివసించే విశుద్ధంలో దేహాన్ని విలీనం చేయాలి. ఎక్కడ తీసుకున్నామో అక్కడే వదిలేయా లన్నమాట. ఇలా ప్రాణ-దేహ-మనసులను విలీనం చేసినప్పుడు నచ్చినంతకాలం బతకొచ్చు, మనం కోరుకున్నప్పుడు చనిపోవచ్చు. మృత్యువును జయించడం అంటే ఇదే! ఇందుకు ఆత్మను తెలుసు కోవాలి. భీష్ముడు అది తెలిసిన జ్ఞాని కనుక ఇచ్ఛామరణం పొందాడు. 

ఉమాబాల


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని