మహాలక్ష్మీ నమోస్తుతే

సకల లోకాలకూ వెలుగునిచ్చే చిన్ని దీపపు అంకురం శ్రీ మహాలక్ష్మి. సృష్టిలో కనిపించే సర్వ వైభవాలు లక్ష్మీదేవి భిన్నమైన వ్యక్తరూపాలే. అవే అష్టలక్ష్ములుగా కీర్తిని అందుకుంటున్నాయి. అవి ప్రధానమైనవి. వాటితో పాటు మానవాళి కోరుకోదగిన అన్నింటినీ లక్ష్మిగానే చెబుతారు.

Published : 24 Aug 2023 00:23 IST

ఆగస్టు 25 వరలక్ష్మీ వ్రతం

శ్రావణమాసం వచ్చిందంటే పూజలూ, వేడుకలతో వాతావరణం మనోహరంగా ఉంటుంది. శ్రావణ మంగళ, శుక్రవారాలు మరీ ప్రత్యేకం. ఈ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మీ వ్రతం ఆచరించి తరిస్తారు.

లక్ష్మీం క్షీరసముద్రరాజ తనయాం శ్రీరంగధామేశ్వరీం
దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురాం
శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవ బ్రహ్మేంద్రగంగాధరాం
త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం
మాతర్నమామికమలే కమలాయతాక్షి శ్రీ విష్ణు హృత్‌ కమల వాసిని
విశ్వమాతః క్షీరోదజే కమల కోమలగర్భ గౌరి లక్ష్మీ ప్రసీదమహ్యం

కల లోకాలకూ వెలుగునిచ్చే చిన్ని దీపపు అంకురం శ్రీ మహాలక్ష్మి. సృష్టిలో కనిపించే సర్వ వైభవాలు లక్ష్మీదేవి భిన్నమైన వ్యక్తరూపాలే. అవే అష్టలక్ష్ములుగా కీర్తిని అందుకుంటున్నాయి. అవి ప్రధానమైనవి. వాటితో పాటు మానవాళి కోరుకోదగిన అన్నింటినీ లక్ష్మిగానే చెబుతారు. భౌతిక సంపదలే కాదు.. మోక్షం, స్వాతంత్య్రం మొదలైనవి కూడా లక్ష్మీదేవి చిహ్నాలే. ఇన్ని రూపాల్లో మరీ ముఖ్యమైందిగా ఎంపిక చేసుకున్నదే వరలక్ష్మీదేవి. నిర్వచన పరంగా చెప్పాలంటే.. వరలక్ష్మి అంటే వరుడితో కూడిన లక్ష్మి అనే అర్థం ఉంది. ‘వర’ పదానికి ఎంచుకున్నది, శ్రేష్ఠమైంది అనే అర్థాలు కూడా ఉన్నాయి. ఇతర సంపదల సంగతలా ఉంచి మనందరం కోరుకునే ఆనందమే అసలైన సంపద. అదే వరలక్ష్మి. ఆ వరలక్ష్మీదేవిని పొందే వ్రతాన్ని పార్వతీదేవి కోరికపై మహాశివుడు- కుమారస్వామికి ఉపదేశించి.. ఆ షణ్ముఖుని ద్వారా భూలోకంలో ప్రచారం చేయించినట్టు స్కాందపురాణం తెలియజేస్తోంది.

ఈ వ్రతాన్ని శ్రావణపూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం చేయమని వరలక్ష్మీదేవి స్వయంగా ఆదేశించింది. అది శ్రేష్ఠం. ఆరోజు ఏదో కారణం వల్ల వీలు కుదరని పక్షంలో శ్రావణ పూర్ణిమ రోజున లేదా తర్వాతి శుక్రవారం చేసుకోవచ్చు. అదీ కుదరలేదంటే ఈ మాసంలో ఏ శుక్రవారమైనా సరే చేసుకోవచ్చు. అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది.

సర్వ మంగళ మాంగల్యే శివే సర్వార్థసాధికే

శరణ్యే త్య్రంబికే దేవి నారాయణి నమోస్తుతే

అదీ సార్థకత...

వ్రతం అంటే ప్రవర్తనలో పాటించే నియమం. వరలక్ష్మీవ్రతాచరణ అంటే ఉత్తమ సంపదను పొందటానికి తగిన ప్రవర్తన అలవరచుకోవాలన్నమాట. ఆ వివరాలను సోదాహరణంగా తెలియజేస్తుంది వరలక్ష్మీ వ్రతం. వ్రత ఆవిర్భావం, వ్రతం ఎలా చేయాలి, ఎవరు చేశారు, ఫలితం ఏమిటి.. తదితర సంగతులన్నీ వ్రతకథలోనే ఉన్నాయి.

చారుమతి అనే బ్రాహ్మణ ఇల్లాలిది మగధదేశంలో కుండిన నగరం. ఆవిడ అత్తమామలను ప్రేమతో చూసుకుంటూ, హితంగా మితంగా మాట్లాడేది. ఇంటా బయటా కరుణాహృదయం చూపేది. ఉన్నదాంతో సంతృప్తి చెందుతూ సదా ఆనందంగా ఉండేది. ఒకరోజు ఆమెకు వరలక్ష్మీదేవి కలలో కనిపించి శ్రావణ పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం తనని పూజించమని చెప్పింది. చారుమతి ఆ సంగతి పెద్దలకి తెలియజేసి, వారి అనుమతితో వ్రతం చేసుకుంది. ఆమెది మంచి మనసు కనుక ఏమీ కోరకుండానే దేవి కరుణించింది. వరలక్ష్మి ఇతరుల ప్రస్తావన తేకున్నా.. చారుమతి నాలుగు వర్ణాల వారినీ వ్రతానికి రమ్మంది. పూజ పూర్తయ్యేసరికి ఆ మహిళలే కాదు, వారి కుటుంబాలూ సంతోషించాయి. అదే అసలైన ప్రయోజనం. వ్రతానికి సార్థకత.

సాటివారిని దైవంగా..

శుద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మీ సరస్వతీ

శ్రీర్లక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా

వ్రతమనే నెపంతో ఎన్ని మహార్థాలు బోధిస్తుందో మన సంప్రదాయం చూడండి. సాటి స్త్రీని ముత్తైదువగా, వరలక్ష్మీదేవి స్వరూపంగా భావించి పూజించటం, దైవం.. మానవ రూపంలో కొలువై ఉంటుందని చాటుతూ, సాటివారిని దైవసమానులుగా చూడటం అలవాటు చేయడానికే. వాయనం ఇచ్చేటప్పుడు ‘నా వాయనం పుచ్చుకున్నది ఎవరు?’ అనే ప్రశ్న.. ‘నేనే వరలక్ష్మీదేవిని’ అనే సమాధానం అందుకు సాక్ష్యం. చారుమతిలా సదాచార సంపన్నత ఉంటే వరలక్ష్మి అనుగ్రహం కలుగుతుందంటూ సత్ప్రవర్తన బోధిస్తుంది. ఇది వ్యక్తిగతం. ఇక అత్తమామలు, ఇతర పెద్దలను సేవించటం, గౌరవించడం అన్నది కుటుంబ బాధ్యత, మానవతా ధోరణి అనిపించుకుంటాయి. పూజాది కార్యక్రమాల్లో అన్ని వర్ణాల వారికీ సమానార్హత ఉంటుందని ఆచరణపూర్వకంగా చెప్పడం సామాజిక స్పృహ. ఇలాంటి సద్గుణాలు అందరిలో ఉంటే స్వర్గం భూమికి దిగి రాదా? అటువంటి సమాజమే మన రుషుల ఆదర్శం. వ్రతాలు, నోములు మనని ఆ దిశగా నడిపిస్తాయి.

డాక్టర్‌ అనంతలక్ష్మి, ఆధ్యాత్మికవేత్త


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని