విశేషం.. విశిష్టం.. దేవీ స్మరణం

శరత్కాలం వచ్చేనాటికి వర్షాకాలం ముగిసి ప్రశాంతత సంతరించుకుంటుంది. ఈ వాతావరణ మార్పు వ్యాధులకు కారణమవుతుంది. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు శక్తి ఆరాధన పేరుతో శుచిగా ఉంటే అనారోగ్యాలు దరిజేరవు, మానసిక ప్రశాంతత చేకూరుతుంది.

Updated : 12 Oct 2023 00:49 IST

అక్టోబరు 15 శరన్నవరాత్రులు ప్రారంభం

శరత్కాలం వచ్చేనాటికి వర్షాకాలం ముగిసి ప్రశాంతత సంతరించుకుంటుంది. ఈ వాతావరణ మార్పు వ్యాధులకు కారణమవుతుంది. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు శక్తి ఆరాధన పేరుతో శుచిగా ఉంటే అనారోగ్యాలు దరిజేరవు, మానసిక ప్రశాంతత చేకూరుతుంది. శరన్నవరాత్రుల పేరుతో నియమాలు, వేడుకల ఆంతర్యం అదే.

అశ్విని నక్షత్రంతో కూడిన మాసం ఆశ్వయుజ మాసం. ఈ మాసంలో వచ్చే శరన్నవరాత్రుల ప్రాధాన్యతను వర్ణిస్తూ..

చందనం శీతలం ఆరోగ్యదం లోకే
చందనాదపి ఫ(బ)లవాన్‌ చంద్రికా
చంద్ర చందనయోరపి శీతలా ఆరోగ్యదా,
సౌందర్య సంపత్కరీ సుఖదా చ శరత్చంద్రికా

అన్నారు. లోకంలో చల్లనిదీ, ఆరోగ్యాన్నిచ్చేదీ చందనం. దాని కంటే శక్తి గలది పున్నమి వెన్నెల. అంతకంటే సుఖాన్ని, సౌందర్యాన్ని, సంపదలనూ ఇచ్చేది శరత్కాల వెన్నెల అనేది భావం.

వాఙ్మయంలో శరత్కాలం

కాళిదాసు మొదలు ఎందరో కవులు శరత్కాల వర్ణనలకు పెద్దపీట వేశారు. ఈ కాలంలో వచ్చే ఆశ్వయుజ పౌర్ణమి వాల్మీకి జయంతి. ఆయన రచించిన రామాయణం ఆధ్యాత్మిక వెన్నెల కురిపిస్తోంది- అంటారు రసహృదయులు. నన్నయ్య ‘శారద రాత్రులుజ్జ్వల..’ అంటూ శరత్కాల వర్ణనతో రచన చాలించాడు. ఎర్రాప్రగడ శరత్కాల వర్ణనతో భారతాన్ని కొనసాగించాడు. విశేషం ఏమిటంటే.. నన్నయ రాత్రిని వర్ణిస్తే, ఎర్రన పగటి కాంతిని వర్ణించాడు. శరత్కాలంలో పగలు, రాత్రి కూడా సొగసైన ప్రకృతి సౌందర్యన్నే కలిగి ఉంటాయని నిరూపించారు. శరత్కాలంలో రాత్రిపూట ఆకాశాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే నక్షత్రాల అమరిక సింహ వాహనంపై ఆదిపరాశక్తి ఉన్నట్లు ఉంటుందంటారు. ఈ ఖగోళ విన్యాసాన్ని సామాజిక పర్వంగా రుషులు వర్ణించారు.

రుతువుల్లో శరదృతువే ప్రధానమైందని పేర్కొంది రుగ్వేదం. ఎందుకంటే కారణాలు చాలానే ఉన్నాయి. శరత్కాలంలో ప్రధాన పాత్ర చంద్రుడిది. ఈ కాలంలో చంద్రకాంతి నిర్మలంగా, ప్రకాశవంతంగా ఉంటుంది. చంద్ర కిరణాల కాంతిలో ఆరోగ్య కారక గుణాలున్నాయి. ముఖ్యంగా మానసిక స్థితి మీద ఇది ప్రభావాన్ని చూపుతుంది.

అభీష్టాలు నెరవేరుతాయి..

శరన్నవరాత్రుల్లో జగదంబను ఆరాధించేవారికి సర్వ శుభాలూ సంప్రాప్తిస్తాయని ప్రగాఢంగా విశ్వసిస్తారు. ఇవి అమ్మవారికెంతో ప్రియమైన రోజులు. ‘దుర్‌’ అంటే చెడు స్వభావం, ‘గ’ అంటే దాటడం. భక్తుని చెడు స్వభావాన్ని పోగొట్టి కష్టాలు దాటేట్లు చేసే శక్తి స్వరూపిణే దుర్గ. అందువల్ల శరన్నవరాత్రుల్లో దుర్గాదేవిని తొమ్మిది రూపాల్లో పూజించాలని దేవీ భాగవతం చెబుతోంది.

శరత్కాల చంద్రకాంతిలో ఔషధ గుణాలుంటాయి. కనుక ఆహార నియమాలు పాటిస్తూ, పూజావిధి నిర్వర్తించడం వల్ల సకలాభీష్టాలూ నెరవేరుతాయని బ్రహ్మాండ పురాణం తెలియజేస్తోంది.

నవరాత్రులు.. నియమాలు..

శరన్నవరాత్రుల్లో అమ్మవారిని కన్యాకుమారి నుంచి కాశ్మీరం వరకూ వివిధ రూపాలు, పద్ధతుల్లో ఆరాధిస్తారు. అమ్మవారిని ఎలా ఆరాధించాలని మార్కండేయ మహర్షి అడిగితే.. ‘ఉపవసేన నక్తేన చైవ ఏక భుక్తేన వాపునః శరన్నవరాత్ర దీక్షాం ఆచరేత్‌’ అంటూ బ్రహ్మ వివరించాడు. నియమాల్లో ముఖ్యమైంది ఉపవాస దీక్ష. చేయగలిగిన వాళ్లు- ఈ తొమ్మిది రోజులూ పాలు, పండ్లు మాత్రమే సేవించాలి. అలా చేయలేని వాళ్లు ఏకభుక్తం (పగలు పూజానంతరం తినడం) లేదా నక్తం (రాత్రి తినడం) చేయొచ్చునని భావం.

సాత్విక, రాజస, తామస అనే మూడు గుణాలూ సృష్టికి మూలం. వీటినే త్రిగుణాత్మక శక్తులు అంటారు. వీటికి మూలశక్తి ఆదిశక్తి అయిన పరమేశ్వరి. విశ్వ ప్రణాళికలన్నీ ఆ శక్తి స్వరూపిణి అధీనంలోనే ఉంటాయి. అందుకే ఆ శక్తిని జగన్మాత, త్రిశక్తి స్వరూపిణి అంటారు. దీక్షతో నిర్వహించే నవరాత్రులను పూజల ఆధారంగా సాత్విక, రాజస, తామస అని మూడు రకాలుగానూ నిర్వహిస్తారు. సాత్విక పూజ మోక్షాన్ని.. రాజస పూజ పదవులు, సంపదలను.. తామసిక పూజ కామితాలను ఇస్తుందని శాస్త్రవచనం. అలాగే దేవిని ‘ఐం’ బీజాక్షరంతో సరస్వతి రూపిణిగా, ‘హ్రీం’ బీజాక్షరంతో పార్వతిగా, ‘శ్రీం’ బీజాక్షరంతో లక్ష్మీదేవిగా ఆరాధించాలి. ఈ మూడూ విద్య, శక్తి, సంపదలకు ప్రతీకలు.

ఆశ్వయుజ మాసంలో విశ్వసృష్టికి మూలమైన పరబ్రహ్మ స్వరూపం అవ్యక్త, అద్వితీయ శక్తులతో అలరారుతుంది. అందువల్లే హరిహర బ్రహ్మాదులంతా ఆ శక్తిని ఆరాధిస్తుంటారు. విష్ణు నామాన్ని వెయ్యిసార్లు జపించడం కంటే శివనామం వందసార్లు జపించడం శ్రేష్టం. శివనామాలు వంద కంటే దేవీ నామం ఒక్కటైనా మేలంటారు. అంత విశిష్టమైన అమ్మవారిని శరన్నవరాత్రుల్లో స్మరిస్తే ఎంత విశేష ఫలితం ఉంటుందో వేరే చెప్పాలా!

సాయి శారద కొడుకుల


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని