ఏడాదికోసారి చందమామా.. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో..

బతుకమ్మ అంటే బతుకు మీద ఆశ, ఆకాంక్ష కలిగించే తొమ్మిది రోజుల సంబరమే బతుకమ్మ పండుగ. పూలనే దేవతగా కొలిచే అరుదైన పండుగ. పడుచులంతా ఒక్కచోట చేరి, తమ అనుభవాలనే పాటలుగా మలిచి, చప్పట్లు కొడుతూ పార్వతీదేవిని కొలిచే కమనీయ వేడుక.

Updated : 12 Oct 2023 03:29 IST

అక్టోబరు 14 నుంచి బతుకమ్మ ఉత్సవాలు

బతుకమ్మ అంటే బతుకు మీద ఆశ, ఆకాంక్ష కలిగించే తొమ్మిది రోజుల సంబరమే బతుకమ్మ పండుగ. పూలనే దేవతగా కొలిచే అరుదైన పండుగ. పడుచులంతా ఒక్కచోట చేరి, తమ అనుభవాలనే పాటలుగా మలిచి, చప్పట్లు కొడుతూ పార్వతీదేవిని కొలిచే కమనీయ వేడుక.

బతుకమ్మ అంటే.. ప్రకృతిని ఆరాధించడం. పుడమి తల్లి గొప్పదనాన్ని కీర్తిస్తూ మురిసిపోవడం. పసుపుతో చేసిన గౌరమ్మను పూజించడం. తెలంగాణ అస్తిత్వానికి, సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీక. భాద్రపద కృష్ణ పక్షాన్ని మహాలయ పక్షాలు, పితృ పక్షాలని.. ఈ మాసంలో అమావాస్య ను మహాలయ అమావాస్య అని అంటారు. వ్యవహారంలో పెత్తర అమావాస్య అంటారు. బతుకమ్మ సంబరాలు ఈ రోజున మొదలౌతాయి. జగన్మాత శక్తులైన ఇచ్ఛా, జ్ఞాన, క్రియా శక్తుల సమష్టి రూపంగా బతుకమ్మను భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తారు.

శ్రీలక్ష్మి నీ మహిమలూ గౌరమ్మ, చిత్రమై తోచునమ్మా
భారతీదేవివై బ్రహ్మకిల్లాలివై, పార్వతీదేవివై పరమేశు రాణివై
పరగ శ్రీలక్ష్మివయ్యీ గౌరమ్మ, భార్యవైతివి హరికినీ గౌరమ్మ

ఇలా సాగుతాయి- ముగురమ్మలను స్తుతించే బతుకమ్మ పాటలు.

దేవీ రూపాలైన ప్రాణశక్తి, ప్రాణేశ్వరి, ప్రాణధాత్రిలకు ప్రతీక బతుకమ్మ. ఆ దేవిని చైతన్య కుసుమప్రియగా వర్ణించింది లలితా త్రిశతి. అందుకే పూలను వరుసలుగా పేర్చి.. ముచ్చటగా సంబరాలు చేస్తారు.

వైదిక సంప్రదాయంలో నవరాత్రుల్లో నిర్వహించే శ్రీ చక్రార్చనకు ప్రతిరూపమే బతుకమ్మ వేడుక. మూడు, ఏడు, తొమ్మిది వరుసల్లో పుష్పాలతో బతుకమ్మను అందంగా అమర్చుతారు. మూడు వరుసలుగా పూలను పేరిస్తే ఆ రూపం ముగురమ్మలకు ప్రతీక. ఏడు వరుసల్లో తీర్చిదిద్దితే సప్త మాతృకలకు, తొమ్మిది వరుసలుగా అలంకరిస్తే నవదుర్గలకు ప్రతి రూపం. పసుపుతో చేసిన గౌరమ్మను దుర్గ రూపంగా, బొడ్డెమ్మగా అమ్మవారిని కొలుస్తారు. ఊరంతా ఒక్కచోట చేరి ‘బతుకమ్మా! (జీవించు తల్లీ) మాకు బతుకునీయవమ్మా’ (చల్లగా చూడు తల్లీ) అంటూ గానంచేస్తూ అమ్మను వేడుకుంటారు.

బతుకమ్మ నేపథ్యానికి సంబంధించి అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి.

మహిషాసురుడితో యుద్ధం చేసిన మహాశక్తి ఒకానొక క్షణంలో అలసిపోయిందట. ఆమె సేదతీరేలా.. మహిళలు పాటలు పాడి, కొత్త ఉత్సాహాన్ని అందించారట. అలా అసురుణ్ణి అంతం చేసి, లోకానికి కొత్త బతుకును ప్రసాదించిన దుర్గమ్మనే బతుకమ్మగా పిలుస్తారని ఒక కథనం. ప్రచారంలో ఉన్న పాటల ప్రకారం.. ధర్మాంగదుడనే రాజుకు చాలామంది పిల్లలు పుట్టినా.. అంతా చనిపోయారు. ఆ దంపతుల మొరను ఆలకించిన పార్వతీదేవే స్వయంగా వారికి బిడ్డగా జన్మించింది. ఆమెని దీవించేందుకు వచ్చిన మునులు ‘నువ్వు ఎల్లకాలం బతుకమ్మా’ అని దీవించారు. అలా ఆమె బతుకమ్మ పేరుతో పూజలు అందుకుంటోంది.

ధర్మాంగదుడను రాజు ఉయ్యాలో.. ఆ రాజు భార్యయు ఉయ్యాలో..
నూరు నోములు నోచి ఉయ్యాలో.. నూరుమందిని కాంచె ఉయ్యాలో..
వారు శూరులై ఉయ్యాలో. వైరులచే హతమైరి ఉయ్యాలో.
తల్లిదండ్రులప్పుడు ఉయ్యాలో తరగని శోకమున ఉయ్యాలో..
కలికి లక్ష్మిని గూర్చి ఉయ్యాలో.. ఘన తపంబొనరించె ఉయ్యాలో..
ప్రత్యక్షమై లక్ష్మి ఉయ్యాలో.. తన గర్భమున పుడతననె ఉయ్యాలో..

ఇలా- అనేక గీతాలు, కథలు వినిపిస్తుంటాయి.

బతుకమ్మ సంబరాలు తొమ్మిది రోజులు చేయడం ఆనవాయితీ. తొమ్మిది రకాల నైవేద్యాలు సమర్పిస్తారు. ఆ నైవేద్యాలను అనుసరించి.. బతుకమ్మను ఒక్కో రోజు ఒక్కో పేరుతో పిలుస్తారు. వాటి వివరాలు కూడా పాటల్లో ప్రస్తావనకు వస్తాయి.

అమరిక పద్ధతి

వెదురు పళ్లెంలో గుమ్మడి ఆకుల్ని పరచి, వాటిపై పసుపు కుంకుమల్ని చల్లి, నవధాన్యాలు వేస్తారు. బతుకమ్మను పేర్చే సమయంలో..

తొమ్మిదీ రోజులు ఉయ్యాలో.. నమ్మికా తోడుత ఉయ్యాలో..
అలరి గుమ్మడిపూలు ఉయ్యాలో.. అరుగులూ వేయించిరుయ్యాలో..
గోరంట పూలతో ఉయ్యాలో.. గోడలు కట్టించి ఉయ్యాలో..
తామరపూలతో ఉయ్యాలో ద్వారాలు.. వేయించి ఉయ్యాలో..

అంటూ పాటలు పాడతారు.

గుమ్మడి పువ్వుల్ని వర్తులాకృతిలో పేర్చి.. వాటిపై తంగేడు, గునుగు, బీర, గన్నేరు, నిత్యమల్లె, సీతమ్మ జడ, రుద్రాక్ష, గోరింట, బంతి వంటి పుష్పాల్ని ఒద్దికగా అమరుస్తారు. ఈ పూల దొంతర శీర్షభాగంలో గుమ్మడిపువ్వుపై జంట తమలపాకుల్ని ఉంచి, వాటి మీద పసుపు గౌరమ్మను నెలకొల్పుతారు. లయాత్మకంగా అడుగులేస్తూ, కరతాళ ధ్వనులు చేస్తూ.. బతుకమ్మ చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. ఆటపాటల అనంతరం స్త్రీలు ఒకరికొకరు తాంబూలాలు, వాయనాలు ఇచ్చి పుచ్చుకుని, బతుకమ్మల్ని జలాశయాల్లో నిమజ్జనం చేస్తారు. ఆ సందర్భంలో..

తంగేడు పూవుల్ల చందమామా.. బతుకమ్మ పోతుంది చందమామా..
పోతె పోతివిగాని చందమామా.. మల్లెన్నడొస్తావు చందమామా..
ఏడాదికోసారి చందమామా.. నువ్వొచ్చి పోవమ్మ చందమామా..
నిద్రపో బొడ్డెమ్మ నిద్రపోవమ్మా నిద్రాకు నూరేండ్లు.. నీకు వెయ్యేండ్లు
పాలిచ్చె తల్లికి బ్రహ్మ వెయ్యేండ్లు.. నినుగన్న తల్లికి నిండు నూరేండ్లు

అంటూ ఆలపిస్తారు. ఇలా సమైక్యతను పెంచి సంతోషాలు పంచుతుంది బతుకమ్మ పండుగ.

రమా శ్రీనివాస్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని