Dussehra: సర్వలోక సంరక్షిణీ దుర్గాదేవీ నమోస్తుతే

అమ్మకాలి మువ్వల సవ్వడి చిన్నారి మనసుకు కొండంత భరోసానిస్తుంది. అమ్మ తన చెంతకు వస్తోందన్న ఊహే ఆ పాపకు నిశ్చింత కలిగిస్తుంది.

Updated : 23 Oct 2023 08:37 IST

(నేడు విజయదశమి)

అమ్మకాలి మువ్వల సవ్వడి చిన్నారి మనసుకు కొండంత భరోసానిస్తుంది. అమ్మ తన చెంతకు వస్తోందన్న ఊహే ఆ పాపకు నిశ్చింత కలిగిస్తుంది. అది అమ్మ పదానికున్న శక్తి. అమ్మ కోసం అంతలా ఆరాటపడే మనలాగే.. సృష్టి సమస్తం ఆ అమ్మలగన్న అమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ రాకకోసం కళ్లింతలు చేసి ఎదురుచూసే శుభ మాసమే ఆశ్వయుజం.

‘ఆకాశలక్ష్మి తన చుక్కల ముత్యాలసరాల్ని ఆకాశగంగలో కడగటానికి సిద్ధం చేసుకున్న కుంకుడుకాయ నురుగు తెప్పల్లా.. ఎంతో అందంగా తెల్లగా ఉన్నాయి శరత్కాలమేఘాలు’ అంటూ వర్ణించాడు ఆముక్తమాల్యదలో శ్రీకృష్ణదేవరాయలు. అంతటి నిర్మల వినీల గగనంలో పుచ్చపూవు లాంటి వెన్నెల వెలుగులీనే అమ్మవారి ముఖకాంతి జ్ఞానపథాన్ని సూచిస్తుంది. ఆ తేజోమయి కారుణ్య కటాక్షంతో.. మనలో ఉన్న అజ్ఞానాన్ని, జడత్వాన్ని విడిచి పునరుత్తేజం పొందే సదవకాశమే దుర్గా నవరాత్రి వేడుక.

నవరాత్రి సమారాధ్యాం నవచక్ర నివాసినీం
నవరూపధరాం శక్తిం నవదుర్గాముపాశ్రయే

అంటూ మహాలయ పితృపక్షాలు ముగియగానే.. పితృదేవతానుగ్రహాన్ని తమకందించిన ఆ ఆదిపరాశక్తిని కృతజ్ఞతాపూర్వకంగా పూజించుకుంటాం. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి విజయదశమి వరకూ గల తొమ్మిది రాత్రులే దేవీ నవరాత్రులు. ఈ తొమ్మిది రోజుల్లో పరాశక్తి మొదటి 3 రోజులూ మహాకాళిగా, తర్వాత 3 రోజులూ మహాలక్ష్మిగా, చివరి మూడు రోజులూ మహా సరస్వతిగా కొలువై ఉంటుంది. ఏ కారణంగానో నవరాత్రులూ పూజించలేని వారు సప్తమి, అష్టమి, నవమి తిథుల్లో త్రిరాత్ర దీక్ష చేసే సంప్రదాయముంది. ఈ త్రిరాత్రులను మూలా నక్షత్రంతో కూడిన షష్ఠి లేదా సప్తమి నాడు మహాసరస్వతిని ఆవాహన చేయటంతో ఆరంభించి విజయదశమి నాడు శమీపూజతో ముగుస్తుంది.

శ్లోకార్థేన తయా ప్రోక్తం భగవత్యాఖిలార్థదం
సర్వం ఖల్విదమేవాహం నాన్యదస్తి సనాతనం

దేవీభాగవతంలోని ఈ శ్లోకంలో సాక్షాత్తూ ఆదిపరాశక్తి తనను తాను సనాతమైనదానిగా ఆవిష్కరించుకుంది. సకలచరాచర సృష్టి జలప్రళయంలో మునిగిన వేళ వటపత్రశాయి యోగ నిద్రకు ఉపక్రమించాడు. ఆ సమయంలో ఆయన చెవి గుబిలి నుంచి మధు-కైటభులనే ఇద్దరు రాక్షసులు పుట్టుకొచ్చారు. పుట్టీపుట్టగానే, వేదపారాయణం చేస్తున్న చతుర్ముఖ బ్రహ్మను చంపేందుకు ప్రయత్నించారు. అప్పుడు.. యోగమాయ కమ్మి.. యోగనిద్రలో ఉన్న నారాయణుణ్ణి స్తుతించి.. రాక్షస భయాన్ని దూరం చేయమని వేడుకున్నాడు బ్రహ్మ. అందుకోసం అవతరించిన పరాశక్తి తామసిక స్వరూపమే మహాకాళి. నిద్రానారాయణుని నుంచి అలా విడివడిన యోగమాయ ఆ రాక్షసులను ఆవహించింది. ఆ ప్రభావంతో గర్వితులై.. విష్ణువునే ‘ఏ వరం కావాలో కోరుకో’మన్నారు. ‘మీరిద్దరూ నా చేతిలోనే మరణించేలా వరమివ్వండి’ అన్నాడు మాధవుడు. ‘అంతా జలమయమైన వేళ, నీరు తాకని చోట మమ్మల్ని వధించవచ్చు’ అన్నారు రాక్షసులు. అది అసాధ్యం అనుకున్నారు. తన తొడలనే వారికి మరణశయ్యగా మార్చి వారిని వధించాడు విష్ణువు. అలా.. మధుకైటభులను హతమార్చి బ్రహ్మరక్షకురాలు, మహా మాయా స్వరూపిణి అయ్యింది మహాకాళి.

ఒకసారి కులగురువుల సూచన మేరకు బ్రహ్మను ప్రసన్నం చేసుకునేందుకు తీవ్ర తపస్సు చేసి అమరత్వాన్ని కోరాడు మహిషాసురుడు. అది తప్ప మరేదైనా కోరుకోమన్నాడు బ్రహ్మ. తన బలంపై మితిమీరిన విశ్వాసమో, మహిళలపై చిన్నచూపో గానీ, అబల చేతిలో మరణాన్ని కాంక్షించాడు మహిషుడు. వరగర్వంతో ముల్లోకాలనూ ముప్పుతిప్పలు పెట్టగా- దేవతాగణమంతా పరాశక్తిని ఆశ్రయించారు. త్రిమూర్తులు, సకల దేవతల తేజస్సు నుంచి ‘దశభుజ సహస్రేణ సమన్తాద్వాప్య సంస్థితాం’ అన్నట్లు వేయి చేతులతో దిగంతాలకు వ్యాపించిన సింహవాహిని ఉదయించింది. కామరూప ధారియైన మహిషాసురుణ్ణి అమోఘ యుద్ధపాటవంతో అంతం చేసింది. మహిషాసురమర్దినిగా పూజలందుకునే ఆదిపరాశక్తి రాజసిక స్వరూపమే మహాలక్ష్మి.

ఆధివ్యాధి నివారిణిగా, తమోఘ్ని సంహారిణిగా గౌరీదేవి అంశగా జన్మించిన అమ్మ సాత్విక స్వరూపమే మహాసరస్వతి.

ఘంటాశూలహలాని శంఖముసలే చక్రం ధనుస్సాయకం
హస్తాబ్జైర్దధతీం ఘనాన్తవిలసచ్చీలాంశు తుల్య ప్రభాం
గౌరీదేహ సముద్భవాం త్రిజగతాధారభూతాం మహా
పూర్వామాత్ర సరస్వతీమను భజే శుమ్భాది దైత్యార్థినీం

హుంకార గర్జనమాత్రంతో ధూమ్రలోచనుని, దీర్ఘజిహ్వతో కాళిగా చండముండుల్ని వధించిన మాతకు తోడుగా సప్తమాతృకలను సృజించి పంపారు బ్రహ్మాదులు. జగన్మాత అయిన తనను కామించిన శుంభ నిశుంభులపై కూడా కరుణ చూపిన దేవి- శివుడి పోరు కలగకుండా పాతాళానికి పారిపొమ్మనే సందేశాన్ని పంపింది. మూర్ఖులై యుద్ధానికే సిద్ధమైన వారిని వధించి ముల్లోకాలనూ రక్షించింది. త్రిశక్తి స్వరూపాలే కాక దుర్గముడనే లోకకంటకుణ్ణి వధించి దుర్గగా సార్థకనామధేయురాలైంది. ఆ రోజే దుర్గాష్టమి. మహిషాసురవధ జరిగిన నవమి మహర్నవమి, ఆదిపరాశక్తి అపరాజితగా కొలువైన రోజు విజయదశమి.

శరత్కాలే మహా పూజా క్రియతే యా చ వార్షికీ
తస్యాం మమైతన్మాహాత్మ్యం శ్రుత్వా భక్తి సమన్వితః

దేవీభాగవతంలోని ఈ శ్లోకం అమ్మను పూజిస్తే వచ్చే ఫలితాన్ని పేర్కొంది. అమ్మ స్వరూపం త్రైలోక్యమోహనం. అమ్మ చేతిలోని శూలం బాహ్యాంతర శత్రువులపై పోరాడే ధైర్యాన్నిస్తే, చక్రం ధర్మాచరణకు పురిగొల్పుతుంది. ఆమె చేతిలోని కత్తి దుర్గుణాలను నశింపచేస్తే, బాణం కష్టసమయంలో వెనుకడుగు వేయకుండా కాపాడుతుంది. శంఖం నిత్యసంతోషులుగా జీవించమని ప్రేరేపిస్తే, పద్మం విషయసుఖాల పట్ల వాంఛ వద్దని నిర్దేశిస్తుంది.

ఈ రుతువు శారీరక, మానసిక రుగ్మతలకు నెలవు. భగవతి సేవావ్రత రూపంలో చేసే ఉపవాసాలు, సామూహిక పూజలు, ప్రసాదాల రూపంలో తీసుకునే ఆహారం.. తనువూ, మనసులు బలం పుంజుకునేలా చేస్తాయి.

స్తన్య పిపాసులను మరిచే తల్లి ఉంటుందా? అయితే ఆ పిలుపులోని తీవ్రత, ఆర్ద్రత అమ్మను క్షిప్రప్రసాదినిగా మారుస్తుంది. అమ్మే కదా.. మనమేం చేసినా చెల్లుతుంది అనుకుంటాం. అలా మనం తెలిసీ తెలియక చేసే తప్పిదాలను కూడా.. కోపగించుకోక సరిదిద్దుతుంది. జగన్మాత కూడా అంతే. మనల్ని నిరంతరం కనిపెట్టుకుని ఉంటుంది. క్షణమాత్రమైనా సరే, మనసారా చేసే పూజతో సంతుష్టురాలయ్యే నిత్యతృప్త అమ్మ. అందుకే ‘యథా యోగ్యం తథా కురు’ అంటూ విద్యుక్త ధర్మాన్ని అనుసరిస్తూ, ఫలితాన్ని ఆమె చెంత ఉంచటం విజ్ఞుల లక్షణం.

పార్నంది అపర్ణ


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని