వందే వాల్మీకి కోకిలం!

రుక్షుడు అనే నిరక్షర బోయ అరణ్యంలో దారిదోపిడీలు చేస్తున్నాడు. ఒకసారి సప్తర్షుల్ని ధనం కోసం బంధించాడతడు. ‘ఇన్ని పాపాలు చేసి కుటుంబాన్ని పోషిస్తున్నావు కదా! ఈ పాపఫలాన్ని నీ వాళ్లు పంచుకుంటారేమో అడుగు’ అన్నారు మునులు.

Updated : 26 Oct 2023 06:44 IST

అక్టోబరు 28 వాల్మీకి జయంతి

రుక్షుడు అనే నిరక్షర బోయ అరణ్యంలో దారిదోపిడీలు చేస్తున్నాడు. ఒకసారి సప్తర్షుల్ని ధనం కోసం బంధించాడతడు. ‘ఇన్ని పాపాలు చేసి కుటుంబాన్ని పోషిస్తున్నావు కదా! ఈ పాపఫలాన్ని నీ వాళ్లు పంచుకుంటారేమో అడుగు’ అన్నారు మునులు. భార్యాపిల్లలు ససేమిరా పంచుకోమనడంతో రుక్షుడి కళ్లు తెరుచుకున్నాయి. వైరాగ్యం ఆవరించి.. మహర్షుల పాదాలను ఆశ్రయించాడు. వారు ‘రామ’ నామాన్ని తిరగేసి ఉపదేశించారు. రుక్షుడు ఆ ‘మరా’ శబ్దాన్ని నిష్ఠగా ఏళ్ల తరబడి జపించాడు. భక్తుడిగా మారిన ఆ బోయ చుట్టూ మొక్కలు మొలిచాయి, వల్మీకములు (చీమల పుట్టలు) పెరిగాయి. అయినా బాహ్యస్మృతి లేకుండా రామనామ జపంలో లీనమయ్యాడు. ఆ రూపాన్ని చూసి, అతడికి రామ మంత్ర సిద్ధి కలిగిందని మహర్షులు నిర్ధారించుకున్నారు. ‘వాల్మీకి’ అని సంబోధించారు. అలా బోయవాడు కాస్తా వాల్మీకి రుషిగా, తపస్విగా మారిపోయాడు. నారదుడి ఉపదేశంతో లోకానికి రామకథను రసరమ్యంగా అందించాడు. రామాయణంలోని కొన్ని ప్రధాన ఘట్టాలతో వాల్మీకి మహర్షికి ప్రత్యక్ష అనుబంధం ఉంది. నిండుగర్భిణి అయిన జానకీదేవికి తన ఆశ్రమంలో ఆశ్రయమిచ్చి, కంటికిరెప్పలా సంరక్షించి జనకుడంతటి వాడయ్యాడు. లవకుశుల్ని తాతలా పెంచి, సీతారాముల కథను కంఠస్థం చేయించి, ఆ మధురకావ్యాన్ని లోకవ్యాప్తం గావించి పునీతుడయ్యాడు. సంస్కృతంలో అదే ఆదికావ్యం.  

కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం

కవిత్వమనే కొమ్మనెక్కి.. ‘రామ రామ’ అనే తియ్యని అక్షరాలను చెవులకు ఇంపుగా పలుకుతున్న వాల్మీకి కోయిలకు వందనాలు అర్పిస్తున్నామని భావం.  మహా భారత, అష్టాదశ పురాణాలను రచించిన వ్యాసమహర్షి వాల్మీకి శిష్యుడని చెబుతారు. వాల్మీకిని భార్గవుడని కూడా సంబోధిస్తారు. ఎంత పతనావస్థకు చేరిన వారైనా సరే పశ్చాత్తాపం చెంది, మారదలచుకుంటే.. అది సాధ్యమే అనటానికి వాల్మీకి మహర్షే నిదర్శనం. కృషి ఉంటే మనుషులు రుషులవుతారు, మహాపురుషులవుతారు- అని నిరూపించాడా మహనీయుడు. భక్తుడిగానే కాదు, భావకవిగానూ వాల్మీకి ఆరాధ్యనీయుడే. రామాయణంలోని కవితా చమత్కృతులు, రసమాధుర్యాలు నిత్యనూతనంగా దర్శనమిస్తాయి. అందుకే దాశరథి రంగాచార్య ‘వాల్మీకి రామాయణం గనుక అధ్యయనం చేస్తే, కాల్పనిక రచయితలకు శిల్పనైపుణ్యం అర్థమవుతుంది’ అన్నారు.      

చైతన్య


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని