సనాతన ధర్మంలో సర్పపూజ

హైందవ సంస్కృతిలో సర్పపూజ అనాదిగా వస్తున్న ఆచారం. దేవ, రాక్షస, యక్ష, గంధర్వ, నాగ, పితృ, మానుష గణాలను సప్తగణాలంటారు. ఈ ఏడింట్లో నాగులకూ, మనుషులకూ అవినాభావ సంబంధం ఉందని పురాణాలు పేర్కొంటున్నాయి. నాగులు రజోగుణం అధికంగా కలిగిన గణాలు.

Published : 16 Nov 2023 05:03 IST

నవంబరు 17 నాగుల చవితి

హైందవ సంస్కృతిలో సర్పపూజ అనాదిగా వస్తున్న ఆచారం. దేవ, రాక్షస, యక్ష, గంధర్వ, నాగ, పితృ, మానుష గణాలను సప్తగణాలంటారు. ఈ ఏడింట్లో నాగులకూ, మనుషులకూ అవినాభావ సంబంధం ఉందని పురాణాలు పేర్కొంటున్నాయి. నాగులు రజోగుణం అధికంగా కలిగిన గణాలు. ఆగ్రహంతో పాటు ఉపకారం చేసే తత్వం కూడా సర్పాల్లో అత్యధికం అంటారు. ఈ రెండు గుణాల్లో నాగులు మనల్ని పోలి ఉంటాయని శాస్త్రాలు చెబుతున్నాయి. సర్పజాతికి ఎనిమిది మంది మూలపురుషులు ఉన్నారని పురాణవచనం. వారిలో అనంతుడు, వాసుకి, తక్షకుడు, శంఖపాలుడు, ధనుంజయుడు, కర్కోటకుడు, మహాపద్ముడు, కుశికుడు ముఖ్యులు. అనంతుడు, వాసుకి సత్వగుణ ప్రధానులు. శంఖపాల, ధనుంజయులు రజోగుణ ప్రధానులు. తక్షక, కర్కోటకులు తమోగుణ ప్రధానులు.

మన సనాతన ధర్మంలో ఆదిశేషుడు, నాగేంద్రుడు, వాసుకి, తక్షక పేర్లతో సర్పాన్ని దేవతలతో సమానంగా పూజించడం ఆచారం. అంతకంటే ముఖ్యమైన సంగతి ఏమిటంటే- పాలసముద్రంలో శ్రీమహావిష్ణువుకు ఆదిశేషుడు తల్పంగా, పరమశివునికి వాసుకి ఆభరణంగా, నాగేంద్రుడు గణపతికి యజ్ఞోపవీతంగా మారి.. తమ జన్మల్ని ధన్యం చేసుకున్నాయి. యోగ శాస్త్రాన్ని రచించిన పతంజలి ఆదిశేషుడి అవతారమేనని పురాణేతిహాసాలు పేర్కొన్నాయి. నాగపూజ విశిష్టత గురించి స్వయంగా శంకరుడే పార్వతీదేవికి చెప్పినట్లు స్కాందపురాణం ప్రస్తావించింది. స్త్రీలు తమ అభీష్టసిద్ధి కోసం ‘పాహిమాం నాగేంద్ర సౌభాగ్యం దేహిమే..’ అంటూ నాగుల్ని పూజించటం అనాదిగా వస్తున్న ఆచారం. అయితే నాగపూజను వివిధ ప్రాంతాల్లో ఏడాదికి రెండుసార్లు చేసుకుంటారు. కార్తికమాసంలో శుద్ధచవితిని నాగులచవితిగా, పంచమిని నాగపంచమిగా పూజలు చేస్తారు. సర్పాలు కనిపించగానే.. భయ భ్రాంతులకు గురవకుండా, ఆ భీతితో సర్పజాతిని నాశనం చేయకుండా భూతదయను పెంచటానికి, పూజ్యభావం పాదుకొల్పటానికి ఈ నాగారాధన తోడ్పడుతుందనేది తాత్వికుల భావన.

చైతన్య


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని