అరుణగిరి.. ఆధ్యాత్మిక సిరి

పరమశివుడు కంచిలో పృథివీ లింగంగా, జంబుకేశ్వరంలో జల లింగంగా, చిదంబరంలో ఆకాశ లింగంగా, శ్రీకాళహస్తిలో వాయు లింగంగా, కోణార్క్‌లో సూర్య లింగంగా, సీతగుండంలో చంద్ర లింగంగా, ఖాట్మండులో యజమాన లింగంగా కొలువై ఉంటే... అరుణాచలంలో అగ్నిలింగంగా ఆరాధనలు అందుకుంటున్నాడు.

Updated : 23 Nov 2023 07:13 IST

(నవంబరు 26 కార్తికపౌర్ణమి సందర్భంగా అరుణాచలంలో కృత్తికా దీపోత్సవం)

పరమశివుడు కంచిలో పృథివీ లింగంగా, జంబుకేశ్వరంలో జల లింగంగా, చిదంబరంలో ఆకాశ లింగంగా, శ్రీకాళహస్తిలో వాయు లింగంగా, కోణార్క్‌లో సూర్య లింగంగా, సీతగుండంలో చంద్ర లింగంగా, ఖాట్మండులో యజమాన లింగంగా కొలువై ఉంటే... అరుణాచలంలో అగ్నిలింగంగా ఆరాధనలు అందుకుంటున్నాడు.

పృథివీలింగం, జలలింగం, ఆకాశలింగం, వాయులింగం, సూర్యలింగం, చంద్రలింగం, యజమానలింగం, అగ్నిలింగం.. అనే అష్టమూర్తులను భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తాం. ఈ క్షేత్రాలను దర్శించుకుంటే పుణ్యమన్నది శాస్త్ర వచనం. అరుణాచలం విషయంలో మాత్రం- వెళ్లే అవకాశం లేకుంటే.. తలచుకున్నా చాలు పాపాలు తొలగి, పుణ్యం ప్రాప్తిస్తుందట. అందుకే అరుణాచలాన్ని తన ఆధ్యాత్మికసాధనా క్షేత్రంగా చేసుకున్న మహర్షి ‘అరుణాచలాన్ని స్మరిస్తే చాలు.. ముక్తి లభిస్తుంది. కరుణ నిండిన సముద్రం లాంటిది’ అంటూ ఆ కొండను కీర్తించారు. అంతేకాకుండా మహిమాన్వితమైన ఆ పర్వత విశిష్టతను ఎంతగానో పొగిడేవారు. ‘అరుణాచలం’ అన్న మాటే రమణులను బాల్యం నుంచి సమ్మోహితుని చేసింది. ఆయన తిరువణ్ణామలై చేరుకున్నాక దాదాపు రెండు దశాబ్దాల పాటు ఆ గిరిపైనే తపోధనుడై ఆధ్యాత్మిక సాధనలు కొనసాగించారు. అరుణగిరికి ప్రదక్షిణ చేస్తూనే రమణులు అరుణాచల శివుడిపై అప్రయత్నంగా ఎన్నో కవితలు చెప్పారు. తదనంతర కాలంలో అవే ‘అక్షర మణమాలై’ గా ప్రసిద్ధిచెందాయి. అక్షర మణమాలై అంటే ‘అరుణాచలానికి అక్షరాలతో కూర్చిన వరమాల’ అని అర్థం. అరుణాచల అష్టకం కూడా రచించిన రమణులు- ఆ పర్వత విశిష్టత గురించి భక్తులకు వివరించేవారు. ఒకసారి- ‘ఒక విదేశీయుడు.. ఈ కొండపైనున్న ఏదో ఒక పవిత్ర స్థలం నుంచి ఒక రాయి కావాలని అడిగారు. ఈ కొండంతా పవిత్రమే అని వారికి తెలియదు. ఈ కొండ మహాశివుడు. మనం దేహంతో తాదాత్మ్యం చెందినట్లు మహేశ్వరుడు ఈ కొండతో తాదాత్మ్యం చెందాడు’ అన్నారు మహర్షి. అరుణగిరి పరమభక్తికే కాదు పారమార్థిక ఉన్నతికి కూడా స్థావరం. ‘అణ్ణామలై’ అన్న తమిళపదానికి ‘ఆద్యంతాలు ఊహించలేని’ అని అర్థం. ‘అణ్ణాల్‌’ అనేది శివుని నామాల్లో ఒకటి. ‘మలై’ అంటే కొండ. ఆ శంకరుడు ఇక్కడ ఆద్యంతాలు తెలియని అగ్నిస్తంభంలా ఆవిర్భవించాడు. ‘అగ్నిలా ఎరుపైన కొండ అరుణగిరి. ఈ అగ్ని జ్ఞానస్వరూపం. జ్ఞానమిచ్చే కొండ, గిరిరూపంలో ఉన్న జ్ఞానం. ఇదే మేరువు’ అంటూ నిర్వచించారు ఆదిశంకరాచార్యులు. కొండ కింద ఉన్న భాగాన్ని అరుణాచల పాదాలుగా పిలుస్తారు.

అడుగడుగునా దేవతామూర్తులు

అరుణాచలాన్ని ఆవరించి ఎందరో దేవతామూర్తులున్నారు. అమ్మవారితో కొలువైన అరుణాచలేశ్వరుడి ఆలయం కూడా ఈ గిరిలో భాగమే! అంతరాలయంలోని కైలాసనాథుడిగానే కాకుండా అరుణగిరి చుట్టూ వివిధ రూపాల్లో తన దివ్యశక్తిని ప్రసరింప చేస్తున్నాడు. ఈ గిరి ప్రదక్షిణలో అరుణాచలేశ్వరుడి అనుగ్రహం, ఆశీస్సులు భక్తావళికి అందుతాయని బలంగా విశ్వసిస్తారు. వినాయకుడితో పాటు యమ లింగం, నైరుతిలింగం, ఈశాన్యలింగం, చంద్ర లింగం, సూర్యలింగం, కుబేరలింగం- ఇలా ఎన్నో రూపాల్లో ఆ పార్వతీశుడు విశేషమైన శక్తులతో తన తేజస్సును ప్రకటితం చేస్తున్నాడు. ఒక్కో ఆలయ దర్శనంతో ఒక్కో ఆధ్యాత్మికఫలం దక్కుతుందని పారమార్థికుల భావన.

విదేశీయులకూ విశేషమే

పది కిలోమీటర్ల చుట్టుకొలత, మూడు వేల అడుగుల ఎత్తు ఉన్న మహిమాన్వితమైన కొండ అరుణగిరి. పాశ్చాత్య ఆధ్యాత్మిక అన్వేషకులు, శాస్త్రజ్ఞులు తదితరులెందరో అరుణగిరిని చూసి ఆకర్షితులయ్యారు. ‘ఎ మెసేజ్‌ ఫ్రమ్‌ అరుణాచల’ గ్రంథంలో- ‘ఒక అమెరికన్‌ భూగర్భశాస్త్రజ్ఞుని పరిశోధనల ప్రకారం.. బొగ్గు కూడా ఏర్పడని పురాతన కాలంలో అగ్నిపర్వతం ఒత్తిడి వల్ల భూమి నుంచి ఈ పర్వతం పైకి లేచింది’ అని వివరించారు పాత్రికేయుడు, పారమార్థిక పిసాసి, రమణ మహర్షి భక్తులు పాల్‌ బ్రంటన్‌. అరుణాచలం హిమాలయాల కన్నా పురాతన మైందని పాశ్చాత్య చరిత్రకారుల అభిప్రాయం. ‘ప్రతి కార్తికమాసంలో పవిత్రమైన ఈ కొండపై ప్రజ్వరిల్లే జ్యోతిని మా హృదయాల్లోనూ వెలిగించు అరుణాచలా! సర్వాంతర్యామి అయిన ఆత్మను మాకు దర్శింపచేయి’ అని డంకన్‌ గ్రీన్‌లీస్‌ అనే విదేశీ ఆధ్యాత్మిక జిజ్ఞాసువు ఓ గీతంలో ప్రార్థించారు.

అరుణాచల పురాణకథనం

పార్వతీదేవి అరుణగిరికి వెళ్లి పరమశివునితో ఐక్యమయ్యేందుకు తపస్సు చేసిందని పురాణకథనం. ఆమె తపస్సుకు మెచ్చి శివుడు ప్రసన్నుడై, ఉజ్వలమైన దీపస్తంభంలా ప్రత్యక్షమయ్యాడట. పార్వతీదేవిని తనలో లీనం చేసుకున్నాడట. ఈ విధంగా శక్తీ, శివుడూ ఐక్యమవటమే అర్ధనారీశ్వర వృత్తాంతం. ఈ సంఘటన కార్తికమాసం పౌర్ణమినాడు సంభవించిందని- తమిళులు భావిస్తారు. అప్పటి నుంచి అరుణగిరిపై దీపం వెలిగించటం, ఆ జ్యోతిని ఆరాధించటం ఆనవాయితీ అయిందని చెబుతారు.

దేవ దీపావళి

కార్తిక పౌర్ణమి ఆధ్యాత్మిక, యోగసాధనలకు విశేషమైందని పారమార్థిక సాధకుల భావన. ఈ రోజున ధ్యానం, దేవతార్చన విశేష ఫలితాన్ని ఇస్తాయంటారు. ఈ పూర్ణిమరోజు దీపాలు వెలిగించడాన్ని ‘దేవ దీపావళి’ అని పిలుస్తారు. అరుణాచల శివుడికి ఈ పర్వదినం సందర్భంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించటం ఆచారం. కార్తిక శుద్ధపంచమి రోజు అరుణాచలేశ్వర ఆలయంలో ధ్వజారోహణంతో ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. పదోరోజు సాయంత్రం అరుణాచల శిఖరం పైన భారీ పరిమాణంలో ఉన్న రాగి కుండ నిండా నెయ్యి వేసి.. సాయంసంధ్య వేళ పెద్ద దీపాన్ని వెలిగిస్తారు. ఆ దీపకాంతి చాలా దూరం వరకూ కనిపిస్తుంది. అరుణాచల ఉత్సవాల్లో అత్యద్భుతమైంది కార్తిక దీపోత్సవం. కార్తికమాసంలో కృత్తికా నక్షత్ర తిథి రోజు ఈ ఉత్సవం జరుగుతుంది. కృత్తిక అగ్ని నక్షత్రం. పంచభూతాలకు ప్రతీకగా వెలసిన పంచలింగ క్షేత్రాల్లో, అగ్నిలింగం ఉన్నది తిరువణ్ణామలైలో. అన్ని క్షేత్రాలకు మధ్యలో అరుణాచలేశ్వరుడు బిందుస్థానంలో ప్రకాశిస్తున్నాడు. కార్తిక పూర్ణిమను ‘త్రిపుర పూర్ణిమ’ అని కూడా అంటారు. శంకరుడు త్రిపురాసురుని సంహరించిన రోజు. ఈ విజయాన్ని స్మరించుకుంటూ కూడా ఆనాటి రాత్రి దీపోత్సవాన్ని నిర్వహిస్తారు. అరుణాచలంలో కార్తిక పూర్ణిమను ‘కుమార దర్శనం’ పేరుతోనూ పిలుస్తారు.

రమణుల సన్నిధిలో పారమార్థిక అన్వేషిగా మారిన ప్రఖ్యాత రచయిత చలం కూడా అరుణగిరి గొప్పతనానికి ప్రభావితులై ఎంతగానో కీర్తించారు.

బి.సైదులు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు