శాంతిసౌఖ్యాల చిరునామా ప్రేమ

శక్తినీ, స్ఫూర్తినీ అందిస్తుంది ప్రేమ. కష్టంలో బాసటగా నిలుస్తుంది, సౌఖ్యాన్ని రెట్టింపు చేస్తుంది. నేనున్నాననే భరోసాతో ప్రశాంతత చేకూరుస్తుంది. జీవిత పరమార్థాన్ని ప్రబోధిస్తుంది. మన ఆధ్యాత్మిక గ్రంథాలు ప్రేమకు పెద్ద పీట వేశాయి.

Updated : 08 Feb 2024 03:03 IST

ఫిబ్రవరి 14 ప్రేమికుల దినోత్సవం

శక్తినీ, స్ఫూర్తినీ అందిస్తుంది ప్రేమ. కష్టంలో బాసటగా నిలుస్తుంది, సౌఖ్యాన్ని రెట్టింపు చేస్తుంది. నేనున్నాననే భరోసాతో ప్రశాంతత చేకూరుస్తుంది. జీవిత పరమార్థాన్ని ప్రబోధిస్తుంది. మన ఆధ్యాత్మిక గ్రంథాలు ప్రేమకు పెద్ద పీట వేశాయి.

ప్రియస్య భావః ప్రేమా- అన్నారు. ప్రియమంటే మనసుకు నచ్చడం. ఆ ఇష్టం మరింత ఎక్కువైతే ప్రేమ. జీవితంలో ప్రేమ లేకుంటే మనుగడే ఉండదు. కన్నవాళ్ల అనురాగం, గురువుల వాత్సల్యం, పెద్దల ఆత్మీయత, తోబుట్టువుల అనుబంధం, బంధుమిత్రుల ఆపేక్ష- ఇలా ప్రేమ ఎన్నో రూపాల్లో కనిపిస్తుంది. ప్రేమికులది ఆత్మబంధం. దంపతులది అవినాభావ సంబంధం. ఇతిహాసాలు, ప్రబంధాల్లో ప్రేమ ఔన్నత్యాన్ని చాటే కథలనేకం ఉన్నాయి.

వలచినవాడు పురుషోత్తముడు

మహాలక్ష్మి అవతారమైన రుక్మిణీదేవి శ్రీకృష్ణపరమాత్మనే భర్తగా భావించుకుని నిరంతరం ఆయన ధ్యాసతోనే, ధ్యానంలోనే మునిగిపోయింది. సోదరుడు తన చెలికాడైన శిశుపాలునికి రుక్మిణిని ఇచ్చి వివాహం చేద్దామని తలపెట్టాడు. కానీ రుక్మిణి మాత్రం త్రికరణశుద్ధిగా శ్రీకృష్ణుణ్ణే పొందాలని తలచి తన ప్రేమ సందేశాన్ని పంపింది. నిష్కల్మషమైన ఆ ప్రేమను మెచ్చిన కన్నయ్య తక్షణం విదర్భదేశం చేరి, తన కోసమే వేచి చూస్తున్న రుక్మిణిని ద్వారకా నగరానికి తీసికెళ్లి వివాహం చేసుకున్నాడు. ఈ ఉదంతం భాగవతంలోనిది. రుక్మిణి సోదరుని మాట కాదని ప్రేమించిన వానితో వెళ్లిపోవడం ఆదర్శమా!?- అని కొందరికి అనిపించవచ్చు. కానీ కృష్ణుడు కేవలం పురుషుడు కాదు, పురుషోత్తముడని గ్రహించి- తన ప్రేమను, తన జన్మను సార్థకం చేసుకున్న రుక్మిణి కథ పుణ్యప్రదం. అందుకే ఇప్పటికీ మన పెద్దలు- కన్నెపిల్లలతో రుక్మిణీ కళ్యాణ కథను చదివిస్తారు. ఆ కథను చదివిన వారికి శ్రీకృష్ణుని వంటి భర్త లభిస్తాడని విశ్వసిస్తారు.

జగన్మాత అయిన పార్వతీదేవి పరమశివుణ్ణే భర్తగా పొందాలనుకుంది. ఆ ఆదిదేవుని ఆరాధించి, కఠోర తపస్సుతో మెప్పించింది. ఆయన అర్ధశరీరాన్ని పొంది, ఆదిదేవిగా పూజలందుకుంటోంది. శ్రీకృష్ణుని చెల్లెలు సుభద్రాదేవి. ఆమె తనకు బావ అయిన అర్జునుని పట్ల మక్కువ పెంచుకుంది. అర్జునుడు కూడా సుభద్ర కోసం మారువేషంలో యోగిగా వచ్చాడు. ఆమె మనసు గెలుచుకుని, వివాహమాడాడు. వీరిది కూడా అపురూప ప్రేమే.

చిత్రమైన ప్రేమ కథలు

నల దమయంతులు హంస చేసిన రాయబారంతో ఒకరి గురించి ఒకరు తెలుసుకుని పరస్పరం అనురాగబద్ధులయ్యారు. తనను వరించడానికి వచ్చిన దేవేంద్రాది దిక్పతులను సైతం కాదనుకుంది దమయంతి. ఆ దేవతలనే ప్రార్థించి, వారి అనుగ్రహంతోనే స్వయంవరంలో ఆమె నలుణ్ణి వరించగలిగింది. అలాగే చిలుక రాయబారంతో తమ ప్రేమను పండించుకుని వివాహమాడారు ప్రభావతీ ప్రద్యుమ్నులు. రాక్షస తనయ ఉష.. తనకు కలలో కనిపించిన అనిరుద్ధుని వరించింది. అనిరుద్ధుడు శ్రీకృష్ణుడి మనవడు. వారి ప్రేమకు జాతివైరం అడ్డు రాలేదు. భీమసేనుని వలచి వరించింది రక్కసి హిడింబి.

యమధర్మరాజునే ఎదిరించి, మెప్పించి, పతి ప్రాణాలను తిరిగి పొందిన సావిత్రిది కూడా ప్రేమ వివాహమే. అల్పాయుష్కుడని తెలిసి కూడా తల్లిదండ్రులను ఒప్పించి, సత్యవంతునికి సహధర్మచారిణి అయ్యింది.

‘ప్రేమిస్తే పెద్దలను ఒప్పించాలి. లేదా ఎదిరించి అయినా జీవితాంతం కలిసి జీవించాలి’ అనే సూత్రాన్ని సావిత్రి, రుక్మిణి పాటించి చూపారు, ఆదర్శంగా నిలిచారు. పెద్దలను ఒప్పించి చేసుకుంది సావిత్రి. ఎదిరించి చేసుకుంది రుక్మిణి.

అదొక గుణపాఠం

పురాణేతిహాసాల్లో అమరప్రేమలే కాదు, అందుకు వ్యతిరేకమైన కథలూ ఉన్నాయి. రావణాసురుడు సీత మీది ఇష్టంతో ఆమెను ఎత్తుకెళ్లాడు. పతనం కొనితెచ్చుకున్నాడు. దుష్యంతుడు శకుంతలను ప్రేమించి, పెళ్లి చేసుకుని.. తర్వాత వదిలేశాడు. ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన మహారాజు, ధర్మాన్ని నిలబెట్టాల్సిన పాలకుడు అయ్యుండీ- పుత్రునితో కలిసి వచ్చిన శకుంతల ఎవరో తనకు తెలియనట్లే నటించాడు. ఆమెని నిందించి, దూషించి, దోషి అయ్యాడు. శకుంతలా దుష్యంతుల ప్రేమకథ తరతరాలకూ గుణపాఠం నేర్పుతుంది. పెద్దలకు చెప్పకుండా, ఎవరికీ తెలియనివ్వకుండా, రహస్యంగా పెళ్లి చేసుకున్నా, చేసుకోకుండా తొందరపడినా మిగిలేది దుష్ఫలితాలేనని హెచ్చరిస్తుంది. అది పురాణకాలం కాబట్టి ఆకాశవాణి నిజం పలికి శకుంతలను కాపాడింది. నేటి ఈ యంత్ర యుగంలో అలాంటి అద్భుతాలకు అవకాశం లేదు.
ప్రేమ, కామం ఒకటి కాదు. ప్రేమ మనసుకు సంబంధించిన భావ ఔన్నత్యం. కామం శరీరానికి సంబంధించిన సౌఖ్యం. మోహ, వ్యామోహాలకు తావీయక.. మనసా వాచా కర్మణా ప్రేమను పొంది, అనుభూతి చెందాలంటే వివాహమే శరణ్యం అంటుంది మన ధర్మం.

ఆలుమగలు స్నేహితుల్లా..

సఖ్యం సాప్త పదీనాం- అన్నారు. ఏడడుగులతో స్నేహబంధం ఏర్పడుతుంది. వివాహానంతర ప్రేమ సాంఘిక నైతికతను పొంది ఉంటుంది, ధర్మార్థ కామ మోక్షాల సాధనకు దాంపత్యమే ఆధారం- అంటున్నాయి మన ధార్మిక గ్రంథాలు. అందుకే ముల్లోకాల్లోనూ మూడుముళ్ల బంధానికే ప్రాముఖ్యత. దేవలోక అప్సరస అయిన ఊర్వశి- అర్జునుని వలచి వరించాలనుకుంది. వారి మధ్య వివాహానికి ఆస్కారం లేదు కనుక అర్జునుడు తిరస్కరించాడు. శాపం పొందినా చలించలేదు. వివాహ బాంధవ్యానికి అంతటి ప్రాధాన్యత.

నారాయణ కవచం - జగదైక్య భావన

ఆధ్యాత్మిక చింతన పెంపొందడానికి, సత్యశోధనకు, పరమాత్ముని చేరడానికి ప్రేమే మూలాధారం. ఈ ప్రేమ స్త్రీపురుషులకు మాత్రమే చెందింది కాదు. ఒక్కరికే పరిమితం కాదు. ఇది విశ్వజనీన ప్రేమ. జగదైక్య భావన పొందిన వారిని విష్ణుమూర్తి స్వయంగా దరి చేర్చుకుంటాడు, వైకుంఠ ప్రాప్తి కలిగిస్తాడు- అని పేర్కొంది నారాయణ కవచం. జగదైక్య భావన అంటే సకల ప్రాణుల పట్ల సమాదరణను, సమమైన ప్రేమను కలిగి ఉండటం. కుల మత వర్గ జాతి హెచ్చుతగ్గుల భేదభావం లేకపోవడం. అదే సమైక్య భావం. అదే విశ్వప్రేమ. శాంతిసౌఖ్యాల చిరునామా.

డా.పి.లలితవాణి

 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని