త్యాగ యోగ సమన్వయం!

ఒకసారి రామకృష్ణమఠం సాధు సత్సంగంలో ఓ స్వామీజీ ‘నేను ఉపనిషత్తుల గురించి వివరించాలనుకుంటున్నాను’ అన్నారు. బదులుగా అక్కడే ఉన్న పరమహంస ప్రత్యక్ష శిష్యులు స్వామీ ప్రేమానంద ‘అన్ని ఉపనిషత్తులకూ సజీవ భాష్యంగా ఉన్న మన గురుదేవులు రామకృష్ణులు ఉండగా,

Published : 15 Feb 2024 00:23 IST

ఫిబ్రవరి 18 రామకృష్ణ పరమహంస జయంతి

కసారి రామకృష్ణమఠం సాధు సత్సంగంలో ఓ స్వామీజీ ‘నేను ఉపనిషత్తుల గురించి వివరించాలనుకుంటున్నాను’ అన్నారు. బదులుగా అక్కడే ఉన్న పరమహంస ప్రత్యక్ష శిష్యులు స్వామీ ప్రేమానంద ‘అన్ని ఉపనిషత్తులకూ సజీవ భాష్యంగా ఉన్న మన గురుదేవులు రామకృష్ణులు ఉండగా, ఇంకే ఉపనిషత్తుల గురించి బోధిస్తారు? ఆయన సర్వ శాస్త్రాల సారం. వారి జీవితం అన్ని పారమార్థిక గ్రంథాలకు ప్రమాణం. త్యాగ, యోగ సమన్వయం’ అన్నారు. కాదా మరి! రామకృష్ణ పరమహంస ఆధ్యాత్మిక జ్ఞానం సముద్రంతో సమానమైంది. ఆ జ్ఞానసాగర కెరటంలోని ఒక తుంపర వేలాది మంది జ్ఞానులను సృష్టించగలదు. ఆ ఆధ్యాత్మికవేత్త అందించిన విశ్వజనీనభావాలు అమూల్యమైనవి.

త్యాగీశ్వరుడు.. యోగీశ్వరుడు

గురువు రామకృష్ణ పరమహంసను స్తుతిస్తూ ఓ గీతంలో ‘ఓ ప్రభూ! నువ్వు త్యాగపురుషుల్లో మొదటివాడివి. మాయాబద్ధులైన మానవులను తరింపజేయటానికి ప్రాణాలను అర్పించిన త్యాగీశ్వరుడివి. యోగులకు సాధనల్లో సహాయ పడటానికి అవతరించిన యోగీశ్వరుడివి’ అన్నారు స్వామి వివేకానంద. నిరాడంబర జీవితానికి నిలువెత్తు నిదర్శనం పరమహంస. ఒక తెల్లని ధోవతి, ఓ చిన్న గదిలో నివాసం, దక్షిణేశ్వర కాళికాలయ ప్రసాదమే భిక్షాన్నం. ఇలా సరళంగా, సంతుష్టితో జీవించిన పరమయోగి ఆయన. సిరి సంపదలు, పేరుప్రతిష్ఠలు తృణప్రాయంగా భావించారు. దైవిక భావనలే తప్ప దైహిక భోగాల గురించి ఆలోచించలేదు. కాళికాలయంలో అమ్మ వారిపై ఎంత ఆరాధనో, అక్కడికి వచ్చే అభాగ్యులపై కూడా అంతే ఆత్మీయత. ‘కదలని విగ్రహాలను భగవంతుడిగా ఆరాధిస్తున్నాం కదా! మరి కదిలే జనులను పూజ్యభావంతో చూడలేమా?’ అని భక్తులకు హితవు పలికేవారు. అలాగే స్త్రీల కష్టాలు, దైన్యస్థితిని చూసి రామకృష్ణ పరమహంస కలత చెందేవారు. గౌరీమా అనే భక్తురాలిని కోల్‌కతాలోనే ఉండి స్త్రీజనోద్ధరణ కోసం పని చేయమన్నారు. ఆ బాధ్యతను పూర్తిచేసేలా చూసే గురుతర బాధ్యత తన ధర్మపత్ని శారదాదేవికి అప్పగించారు.

గృహస్థులకూ గురుదేవులే

ఒక చేత్తో భగవంతుడి పాదాలను గట్టిగా పట్టుకుని, రెండో చేత్తో లౌకిక వ్యవహారాలు చక్కబెట్టుకోవాలంటూ గృహస్థ శిష్యులకు చెప్పేవారు. అందరూ సన్యాసం స్వీకరించాలని ఏనాడూ చెప్పలేదు. కుటుంబ బాధ్యతల్ని తప్పించుకుని సన్యాసం కావాలంటూ వచ్చిన ఎందరినో వారించారు. తల్లిదండ్రులను, భార్యా పిల్లలను చూసుకొమ్మని తరిమేశారు కూడా. భక్తులకు ఆయన కల్పతరువు లాంటివారు. ఒక శిష్యుడు ఆయన గురించి..

తుల్య లోష్ట కాంచనం చ హేయ నేయ ధీగతం
స్త్రీషు నిత్య మాతృ రూప శక్తి భావ భావుకం
జ్ఞాన భక్తి భుక్తి ముక్తి శుద్ధ బుద్ధిదాయకం
తం నమామి దేవ దేవ రామకృష్ణ మీశ్వరం

‘మట్టినైనా బంగారాన్నయినా సమానంగా చూసేవారు, కోరికలు లేనివారు, స్త్రీలను మాతృమూర్తిగా, కాళీమాతగా భావించేవారు, భక్తులకు జ్ఞానం, భక్తి, ముక్తి, నిర్మలమైన బుద్ధిని ప్రసాదించేవారు అయిన ఈశ్వరసమానుడు రామకృష్ణ పరమహంసకు నమస్సులు అర్పిస్తున్నాం’ అంటూ కీర్తించారు.

చైతన్య


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు